breaking news
project agreements
-
తెలంగాణకు ‘మహా’ దుర్దినం: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తును తగ్గించుకుని మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒప్పం దం చేసుకుందని, ఇది రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తుందని శాసనమండలిలో కాంగ్రెస్‌పక్ష నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. మాజీమంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే బి.భిక్షమయ్యగౌడ్‌తో కలసి ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఒప్పందం పేరుతో మహా దగా, తీరని ద్రోహం చేశారని, ఈ రోజు తెలంగాణకు దుర్దినమని పేర్కొన్నారు. 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించడానికి 2012లోనే అప్పటి మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చౌహాన్‌తో సమైక్య రాష్ర్టంలో ఒప్పందం జరిగిందన్నారు. ఇప్పుడా ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడానికి ఒప్పందం చేసుకున్నారని, దీనివల్ల సుమారు 70 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని, ఇది తెలంగాణకు తీరని నష్టమని అన్నారు. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టు పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. శ్రవణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి ద్రోహం చేసి సంబరాలు జరుపుకుంటారా.. అని ప్రశ్నించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38 వేల కోట్లు ఉండగా, అదనంగా రూ.50 వేల కోట్లు పెంచారని, కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు. -
కేసీఆర్ ఒప్పందం.. మహా దగా, మహా మోసం
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కుదుర్చుకున్న ప్రస్తుత ఒప్పందాల్లో కొత్తదనం లేదని టీకాంగ్రెస్ విమర్శించింది. ఒప్పందాల అంశంపై టీకాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్, అప్పటి మహారాష్ట్ర సీఎం మధ్య కుదిరిన ఒప్పందమే ఇది అని చెప్పారు. అయితే తుమ్మడిహట్టి వద్ద ప్రాణహితపై 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టాలని గత ఒప్పందం కాగా, కేసీఆర్ ఒప్పందంలో ఆ ఎత్తును 4 మీటర్లకు తగ్గించడంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కేసీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం మహా దగా, మహా మోసం అని, తెలంగాణను ముంచే ఒప్పందం అంటూ వారు మండిపడ్డారు. ఒక ఎకరం ఆయకట్టు పెరగకుండా ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని మాత్రం రూ.50 వేల కోట్లు పెంచారని, అందుకే ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి చీకటి రోజు అని, మహారాష్ట్రకు మేలు జరిగేలా తెలంగాణకు నష్టం జరిగేలా ఒప్పందం కుదిరిందంటూ టీకాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.