'వేద నిలయంలో ఉండనివ్వం'
చెన్నై: పళనిస్వామి ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదని తమిళనాడు తాజా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. గురువారం రాత్రి తన మద్దతుదారులతో కలిసి ఆయన మెరీనా బీచ్ లోని జయలలిత సమాధిని సందర్శించి నివాళి అర్పించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... అమ్మ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం శశికళ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. జయలలిత మరణానికి ఆ కుటుంబమే కారణమని అన్నారు. వేద నిలయంలో శశికళ కుటుంబం ఉండేందుకు ఒప్పుకోమని స్పష్టం చేశారు.
ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంలో అమ్మ అనుచరులు ఎవరూ లేరని అన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తానని, ప్రజా మద్దతు కోరతానని ప్రకటించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.