breaking news
Nukalamma
-
మీనాక్షమ్మ గుడిలా నూకాలమ్మ ఆలయం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కొలిచిన వారికి కొంగుబంగారమై, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా.. ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవతగా విరాజిల్లుతున్న అనకాపల్లి నూకాలమ్మ ఆలయాన్ని తమిళనాడులోని మధుర మీనాక్షి దేవాలయం తరహాలో అభివృద్ది చేస్తున్నారు. మూడు వైపులా రాజగోపురాలు నిర్మించడంతో పాటు రానున్న 200 సంవత్సరాల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆలయానికి తూర్పు వైపున మాత్రమే రాజగోపురం ఉండగా... మిగిలిన మూడువైపులా రాజగోపురాలను నిర్మిస్తున్నారు. అదేవిధంగా గర్భగుడిని కూడా విస్తరిస్తున్నారు. మొత్తం రూ. 8 కోట్లతో చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులు వచ్చే నెలలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని పనులూ పూర్తయితే ఉగాది నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను 2023 అక్టోబర్ నెలలో అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. శతాబ్దాల చరిత్ర...! అనకాపల్లిలోని నూకాంబికా అమ్మవారి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఉత్తరాంధ్రలోని పురాతన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయంలో నూకాంబిక దేవి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు కాకర్లపూడి అప్పలరాజు పాయకారావు ఈ ఆలయాన్ని తమ కుటుంబ దేవత అయిన కాకతాంబిక కోసం నిర్మించారు. ఆ తర్వాత ఈ దేవతను నూకాంబిక లేదా నూకలమ్మ అని పిలుస్తున్నారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాచీన వైభవాన్ని పరిరక్షించడంలో భాగంగా గత ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది. ఏటా ఉగాది అనంతరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఆలయంలో నెల రోజుల పాటు జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో రానున్న 200 సంవత్సరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అభివృద్ది పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు ఇలా...! గతంలో కాకతీయుల కాలంలో ఆలయ అభివృద్ది పనులు జరుగగా ఇన్నాళ్ల తరువాత గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టింది. అమ్మవారి ఆలయం మొదటి భాగంలో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి తీసుకొచ్చిన నల్లరాయితో గర్భాలయం 14X14 అడుగుల నుంచి 17.11x17.11 అడుగులకు విస్తరించనున్నారు. అంతరాలయాన్ని సైతం భారీగా విస్తరిస్తున్నారు. చూడగానే మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం గుర్తుకు వచ్చేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. -
అమ్మా! నీ వెంటే..
=తల్లి చనిపోయిన కొన్ని గంటల్లోనే మనోవేదనతో కుమార్తె మృతి =రెండు కుటుంబాల్లో విషాదం గొలుగొండ, న్యూస్‌లైన్: విధి విచిత్రమైనది. ఎప్పుడేమి జరుగుతుందో తెలియని పరిస్థితి. గొలుగొండ మండలంలో శనివారం ఇదే జరిగింది. మండలంలోని శ్రీరాంపురానికి చెందిన చిటికెల నూకాలమ్మ(70) శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయింది. ఆరోగ్యంగా తిరుగాడుతున్న నూకాలమ్మ ఆకస్మిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం బంధువులకు మరణవార్త చెప్పేందుకు అంతా తలోదారి వెళ్లారు. నూకాలమ్మకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. కుమారులు ముగ్గురు గ్రామంలోనే ఉంటున్నారు. పెద్దకుమార్లె సుర్ల ఆదిలక్ష్మి తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామంలో ఉంది. రాత్రి 7గంటలకు తల్లి మరణవార్తను ఆమెకు చేరవేశారు. తల్లి చనిపోయిందని తెలిసి ఆదిలక్ష్మి కన్నీరుమున్నీరైంది. కుమారుడు భవానీమాలలో ఉండటంతో బయటకు వెళ్లకూడదని అంతా ఆమెకు తెలిపారు. దీంతో తల్లి ఆఖరిచూపులకు నోచుకోలేదనే బెంగతో మానసికంగా కుంగిపోయింది. రాత్రి 8.30 గంటలకు ఆదిలక్ష్మి(51) కూడా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. తల్లి నూకాలమ్మకు శనివారం రాత్రే అంత్యక్రియలు చేపట్టిన శ్రీరాంపురంలోని బంధువులు ఆదివారం ఉదయాన్నే నాగరాయి గ్రామం వెళ్లి ఆదిలక్ష్మి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కొన్ని గంటల వ్యవధిలో తల్లీకుమార్తెల మరణంతో రెండు గ్రామాల్లో విషాదం అలుముకుంది.