breaking news
NTR Varsity
-
పీజీ మెట్ రీ ఎగ్జామ్‌తో లాభించాం!
సాక్షి, విజయవాడ: పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎంట్రన్స్-2014(పీజీ మెట్) పరీక్షను తిరిగి నిర్వహించడం వల్ల తామెంతో లాభించామని పీజీమెట్ రీఎగ్జామ్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు అమితానందం వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన ఈ పీజీమెట్ ప్రశ్న పత్రాలు.. పరీక్షకు ముందుగానే బయటకు పొక్కడంపై రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. దీంతో గవర్నర్ నరసింహన్ ఈ ప్రవేశ పరీక్షను రద్దు చేశారు. తిరిగి అనేక తర్జనభర్జనల అనంతరం ఏప్రిల్ 27న ఈ పరీక్షను ఎన్టీఆర్ ఆరోగ్య విశ ్వవిద్యాలయం మరోసారి నిర్వహించింది. ఈ క్రమంలో పరీక్ష ఫలితాలను ర్యాంకుల వారీగా ఆదివారం వర్సిటీ నోటీస్ బోర్డులో పేర్కొన్నారు. దీంతో ఈ రీఎగ్జామ్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో పేపర్ లీక్ కావడం వల్ల తాము మంచి ర్యాంకులు పోగొట్టుకున్నామని, ప్రస్తుతం తమ కష్టానికి ఫలితం లభించిందని ఆయా విద్యార్థులు ‘సాక్షి’కి చెప్పారు. వివరాలు.. ర్యాంకుల్లో వ్యత్యాసం: కర్నూలుకు చెందిన గాంధీ కళాశాల విద్యార్థి బి. శ్రీరామిరెడ్డి తొలుత 176 ర్యాంకు సాధించగా, రీఎగ్జామ్‌లో మొదటి ర్యాంకు సాధించా రు. హైదరాబాద్‌కు చెందిన ఉస్మానియా విద్యార్థి కిరీట్ గతంలో 56వ ర్యాంకు సాధించగా, ఇప్పుడు రెండో ర్యాంక్ పొందారు. ఏలూరుకు చెందిన ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థి గురుప్రసాద్ గతంలో 302 ర్యాంకు సాధించగా, ఇప్పుడు 3వ ర్యాంకు, వరంగల్ జిల్లాకు చెందిన కాకతీయ వైద్య కళాశాల విద్యార్థి రఘుపతి తొలి పరీక్షలో 44వ ర్యాంకు సాధించగా, రీఎగ్జామ్‌లో 4వ ర్యాంకు, అనంతపురానికి చెందిన కర్నూలు మెడికల్ కళాశాల విద్యార్థిని బి.దివ్య 76వ ర్యాంకు రాగా, ఇప్పుడు 5వ ర్యాంకు సాధించారు. రీఎ గ్జామ్ వల్ల తమకు ర్యాంకులు పెరిగాయని పలువురు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి పరీక్ష లో పేపర్ లీక్ అవడం వల్ల తాము ఆశించిన ర్యాంకు లు రాలేదన్నారు. కాగా, తొలి పరీక్షలో టాప్ ర్యాంకు లు సాధించిన విద్యార్థుల్లో కొందరు రీఎగ్జామ్ రాయలేదు. తొలి ఎగ్జామ్‌లో ఫస్ట్ ర్యాంకు వచ్చిన ఆకుల శ్రీకాంత్‌కు ఈసారి 1,300 ర్యాంకు వచ్చినట్టు తెలిసింది. పూర్తి జాబితా నేడు: విద్యార్థుల పేర్లుతో సహా ఫలితాలను వర్సిటీ అధికారులు సోమవారం వర్సిటీ వెబ్సైట్లో ప్రకటించనున్నారు. వర్సిటీ వెబ్సైట్లో పూర్తి వివరాలు ప్రకటించిన తరువాతే గతంలో జరిగిన గోల్‌మాల్‌పై మరింత స్పష్టత వస్తుందని జూనియర్ డాక్టర్ అసోసియేషన్(జూడా) ప్రతినిధి క్రాంతికుమార్ తెలిపారు. -
‘పీజీ మెట్’ పాత్రధారి రాజగోపాల్‌రెడ్డి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో 2007-2013 మధ్య నాలుగు లీకేజీ కుంభకోణాలకు పాల్పడిన అనంతపురం వాసి రాజగోపాల్‌రెడ్డికి... తాజాగా ఎన్టీఆర్ వర్సిటీ నిర్వహించిన పీజీ మెట్-2014 ప్రశ్నపత్రం లీకేజీలోనూ పాత్ర ఉన్నట్లు సీఐడీ అధికారులు నిర్ధారించారు. దీంతో సోమవారం ఆయనతో పాటు దళారి మాధవరావు, పీజీమెట్‌లో 40వ ర్యాంక్ వచ్చిన చందూమోహన్ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు ఈ స్కామ్‌లో 20 మంది సూత్రధారులు, దళారులతో పాటు 24 మంది ర్యాంకర్లతో కలిపి 44 మందిని అరెస్టు చేసినట్లయిందని సీఐడీ చీఫ్ టి.కృష్ణప్రసాద్ వెల్లడించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని.. ఈ స్కామ్‌లో మణిపాల్ ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం, ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల పాత్రపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.