breaking news
Neglect of duty
-
సెక్యూరిటీ గార్డే బలి పశువు
సాక్షి, ఖమ్మం: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యానికి ఒక సామాన్య సెక్యూరిటీ గార్డు బలయ్యాడు. ఎలాంటి విచారణ చేపట్టకుండానే అర్ధంతరంగా అతడిని విధుల నుంచి తొలగించడంతో ఖమ్మంలోని పెద్దాస్పత్రి మరోసారి వివాదానికి కేంద్ర బిందువైంది. ఆదివారం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సమయానికి డాక్టర్లు, నర్సులు ఎవ్వరూ లేకపోవడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు బాలింతకు సెలైన్ బాటిల్ ఎక్కించిన ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నిర్లక్ష్యంపై ‘సాక్షి’ ప్రధాన, జిల్లా సంచికల్లో కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. ఇంకా పలు పత్రికల్లో వార్తలు రావడం, చానళ్లలో ప్రసారం కావడంతో పెద్దాస్పత్రిలో ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, సెలైన్ ఎక్కించిన సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించడంపై సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, పేషెంట్ కేర్ సిబ్బంది సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా అలసత్వం ప్రదర్శించిన డాక్టర్లు, నర్సులపై చర్య తీసుకోకుండా సెక్యూరిటీ గార్డును బలిపశువును చేయడమేంటని? ఖండించారు. ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ నాయకులు సంఘీభావం తెలిపారు. సెక్యూరిటీ గార్డును విధుల్లోకి తీసుకొని బాధ్యులైన వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులు పదిలం.. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో కాన్పుకు వచ్చే గర్భిణులకు ప్రసవం తర్వాత వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి..డిశ్చార్జ్ అయ్యే వరకు..డాక్టర్లు, నర్సులు పర్యవేక్షిస్తూ..వైద్యసేవలు అందించాలి. 24 గంటలూ షిఫ్టుల వారీగా వారికి డ్యూటీలు వేస్తారు. కానీ విధుల పట్ల అలసత్వం ప్రదర్శించడం, వారి స్వంత క్లీనిక్‌లు చూసుకోవడంపై దృష్టి పెడుతుండటంతో బాలింతలు, చిన్నారులకు సరైన వైద్యం అందట్లేదనేది ఆరోపణ. సమయానికి ఎవ్వరూ అందుబాటులో ఉండక..కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో అక్కడి స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు బాలింతలకు సహాయం చేస్తుంటారు. ఇలాంటి ఘటనే..తాజాగా సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి ఎసరు పెట్టింది. సదరు గార్డు సెలైన్ పెట్టిన సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సులను వదిలేసి తాత్కాలిక ఉద్యోగిపై చర్యలు తీసుకోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న వారిని రక్షించేందుకే సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించారని, ఎలాంటి విచారణ చేపట్టకుండా..తీసేయడం అనుమానాలకు బలం చేకూర్చినట్లైంది. డబ్బులు వసూలు చేస్తున్నారా? డెలివరీ వీడియో తీశారా? – ప్రత్యేకాధికారి విచారణ పెద్దాస్పత్రిలో చోటు చేసుకున్న వరుస ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారును ఆదేశించింది. అందులో భాగంగా వైద్య విధాన పరిషత్ రాష్ట్ర స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఏ. రాజశేఖర్ బాబు సోమవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో విచారణ చేపట్టారు. డాక్టర్లు, నర్సులను వేర్వేరుగా పిలిచి వివరాలు తెలుసుకున్నారు. సెక్యూరిటీ గార్డు సెలైన్ పెట్టిన సమయంలో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు? అందుబాటులో లేనిదెవరు? తదితర విషయాలపై విచారించారు. గతంలో జరిగిన ఘటనలపై ఆరా తీశారు. ప్రసవించిన సమయంలో మగ, ఆడ పిల్లలు పుడితే ఒక్కోరేటు పెట్టి పేషంట్ల వద్ద నుంచి డబ్బులు గుంజుతున్న విషయంపై కూడా అడిగారు. డాక్టర్లకు స్వంతంగా ఎవరెవరికి క్లీనిక్‌లు ఉన్నాయో తెలుసుకున్నారు. గత నెల ప్రసవ సమయంలో వీడియోలు తీసిన ఘటనపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆస్పత్రి ఆర్ఎంఓ కృపా ఉషశ్రీ, డాక్టర్ మంగళ పాల్గొన్నారు. బాధ్యులెవరైనా చర్యలు తీసుకుంటాం.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలింతకు సెక్యూరిటీ గార్డు సెలైన్ ఎక్కించిన ఘటనకు సంబంధించి..పూర్వాపరాలు విశ్లేషించి, ఇంకా చోటు చేసుకున్న వరుస ఘటనలకు కారణమైన బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోంది. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు. డాక్టర్లు, సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హాస్పిటల్ వదిలి వెళ్లకూడదు. ప్రసవమప్పుడు బంధువుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తే ఇంటికి పంపిస్తాం. రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. అందుకోసం స్వతహాగా ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్‌రేను అతి త్వరలో అందుబాటులోకి తెస్తాం. – రాజశేఖర్ బాబు, వైద్యవిధాన పరిషత్ రాష్ట్ర ప్రత్యేకాధికారి -
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి శంకర్పల్లి: ‘ఆస్పత్రులకు వచ్చే రోగుల చికిత్సకోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చులు చేస్తోంది. రోగులకు వైద్యం అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. నీవు విధులకు హాజరు కావు.. నీవు ఉండి ఎందుకు దండగ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నేను ఆస్పత్రికి వచ్చాను.. విధుల్లో లేవు.. మరో రెండుసార్లు కూడా ఆస్పత్రికి వచ్చినా కనిపించలేదు. ఇలాగైతే ఈ ఆస్పత్రి ఎందుకు.. మీరు ఎందుకు..’ అని శంకర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు నాగనిర్మలపై ఎమ్మెల్యే కాలె యాదయ్య తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ నర్సింలు అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమానంగా అమలు చేస్తుందన్నారు. సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.