breaking news
minister Annam ram narayanareddy
-
‘కావలి కాంగ్రెస్’లో సమైక్య విభేదాలు
కావలి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో ‘కావలి కాంగ్రెస్’లో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ‘నాకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించి బంద్, ఆందోళన తేదీలు ఖరారు చేస్తావా’ అంటూ ఏఎంసీ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టిపై మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. శనివారం కావలి ఆర్అండ్బీ అతిథి గృహానికి వచ్చిన విష్ణువర్ధన్‌రెడ్డి ఈ విషయంపై గ్రంధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రంధి కూడా అదే స్థాయిలో విష్ణుపై రుసరుసలాడారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచనల మేరకు గ్రంధి సమైక్యాంధ్ర ఉద్యమ ప్రణాళిక రూపకల్పనపై శుక్రవారం పట్టణంలోని హోల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ కల్యాణ మండపంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం వీరి మధ్య చిచ్చు రగిల్చింది. సమావేశంలో ఈ నెల 13న బంద్‌ను, ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయం విష్ణువర్ధన్‌రెడ్డికి మింగుడు పడలేదు. శనివారం కావలికి వచ్చిన ఆయన తన అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో యానాదిశెట్టి అక్కడికి వచ్చారు. నాకు తెలియకుండా బంద్, ఆందోళన తేదీని ఎలా ప్రకటిస్తావని విష్ణువర్ధన్‌రెడ్డి గ్రంధిపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాదోపవాదనలు జరిగాయి. విష్ణు అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో ఇష్టానుసారంగా ఎవరికి వారు నడుచుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో మంత్రి ఆనం పేరు ప్రస్తావించడమే ఈ రచ్చకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే 13వ తేదీ బంద్, నిరసనలు చేయాలని ప్రకటించామని, ఇప్పుడు లేదంటే ఎట్లా అంటూ విష్ణుతో గ్రంధి మొరపెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో కాస్త రాజీపడాలని గ్రంధి విష్ణుకి సూచించడంతో 12న నిరసన కార్యక్రమాలు, 13వ తేదీ బంద్ నిర్వహించేందుకు అంగీకారానికి వచ్చారు. -
నామమాత్రపు పాత్ర
సాక్షిప్రతినిధి, నెల్లూరు : జిల్లాలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీల పాత్ర నామమాత్రంగా మారింది. ఎనిమిది రోజులుగా జరుగుతున్న ఉద్యమంలో ఆ రెండు పార్టీల నాయకులు అప్పుడప్పుడు తళుక్కున మెరిసి మాయమవుతున్నారు. జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో కీలకమైన నేతల తీరుతో ఆ పార్టీల కార్యకర్తలు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ముందుకు వెళితే ఎటువంటి సమస్యలు వస్తాయోనన్న భయం వారిని వెంటాడుతోంది. ముఖ్యంగా జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కార్యకర్తలను తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాయి. సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు ఉపసంహరించుకునేలా కార్యకర్తలు ఒత్తిడి తేవాలంటూ ప్రకటించడం వారిని అయోమయానికి గురిచేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి అటువంటి ప్రకటన చేయడం వెనుక ఆంతర్యం తెలియక వారు మదనపడుతున్నారు. సమైక్యాంధ్ర కోసం ఒకవైపు జిల్లాలో పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి వస్తుంటే మంత్రి వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయనే అభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. తమ పార్టీ నేతలనే రాజీనామాలు ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలన్న తర్వాత తాము ఏ ముఖం పెట్టుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని పార్టీ ముఖ్యుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాము ఉద్యమంలో పాల్గొన్నా జనం నమ్మరని అభిప్రాయపడ్డారు. శాసనసభ్యత్వాలకు రాజీనామాలు ప్రకటించిన ఎమ్మెల్యేల పాత్ర కూడా పెద్దగా లేదు. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి రాజధానికి పరిమితం కాగా రెండు రోజుల కిందట నెల్లూరు వచ్చిన ఆనం వివేకానందరెడ్డి, శ్రీధరకృష్ణారెడ్డి మొక్కుబడిగా పాల్గొంటున్నారు. ఒకవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు సమైక్య నినాదం వల్లిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం విషయానికి వస్తే తర్జనభర్జనల తర్వాత రాజీనామాల డ్రామాకు తెరతీసిన టీడీపీ ఎమ్మెల్యేలు సైతం అధికారపక్షం బాటలోనే పయనిస్తున్నారు. అంటీముట్టనట్టుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆజ్ఞల కోసం ఆ పార్టీ ముఖ్యులు వేచిచూస్తున్నారు. రాష్ట్ర విభజనకు పార్టీ హైకమాండ్ అంగీకరించినందున ఇప్పుడు సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తున్నామంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని టీడీపీ కార్యకర్తలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా పార్టీకి పెద్దదిక్కు అయిన సోమిరెడ్డి రాజధానిలో కూర్చుని విలేకర్ల సమావేశాలకు పరిమితం అయ్యారు. గతంలో సమైక్యాంధ్ర గళం వినిపించిన ఆయన ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనల్లో కనిపించడం లేదు. అగ్రభాగంలో వైఎస్సార్సీపీ జిల్లాలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు నగరంతో పాటు కావలి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట పట్టణాల్లో ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్జీవోలు, విద్యార్థి జేఏసీ, విక్రమ సింహపురి యూనివర్సిటీ సిబ్బంది, పలు ప్రజాసంఘాలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి సకలజనుల సమ్మెకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వ కార్యకాలపాలతో పాటు జనజీవనం పూర్తిగా స్తంభించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.