breaking news
mini hananadu
-
మినీ మహానాడు రసాభాస
సాక్షి, నిజామాబాద్ : అగ్రనాయకుల వలసలతో కుదేలైన తెలంగాణ టీడీపీలో వర్గపోరు తలనొప్పిగా తయారైంది. సీనియర్ నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోవడంతో సగం ఖాళీ అయిన తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా నిజామాబాద్లో సోమవారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు రసాభాసగా మారింది. టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలుగు తమ్ముళ్లు వీరంగమాడారు. ఆర్మూరుకు చెందిన సీనియర్ నాయకుడు యాదయ్యకు నియోజకవర్గ ఇంచార్జీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు గొడవకు దిగారు. నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అక్కడితో ఆగకుండా కుర్చీలను విరగొట్టారు. పార్టీ మారే వారికి పట్టం కట్టి సీనియర్లకు అన్యాయం చేస్తారా అని నిలదీశారు. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ సమక్షంలోనే ఈ ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లా కొత్త అద్యక్షుని నియామకంపై కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇది పార్టీ నిర్ణయమని అన్నపూర్ణమ్మ చెప్పారు. గందరగోళం నడుమ చివరికి యాదయ్యకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి కార్యకర్తలను నాయకులు సముదాయించారు. -
అలిగిన అరికెల నర్సారెడ్డి
హైదరాబాద్: టి.టీడీపీ ఎమ్మెల్సీ సీటు వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అలిగారు. అందుబాటులో ఉన్న తన అనుచరులతో సమావేశమయ్యారు. ఆయన టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీలందరూ పార్టీని వీడినా తాను టీఆర్ఎస్ పై ఒంటరి పోరాటం చేశానని ఆయన గుర్తు చేస్తున్నారు. తన పోరాటాన్ని అధినేత చంద్రబాబు గుర్తించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. అరికెల అలక కారణంగా ఈనెల 25న నిర్వహించ తలపెట్టిన నిజామాబాద్ జిల్లా మినీ మహానాడు రద్దయ్యే అవకాశముంది.