మేదరమెట్లకు కన్నీటి వీడ్కోలు
జలదంకి: వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు, జలదంకి మండల నేత మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డికి మండల వాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. కావలి నుంచి బ్రాహ్మణక్రాకలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చిన మేదరమెట్ల మృతదేహానికి సోమవారం నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం నిర్వహించిన అంత్యక్రియలలో ఉదయగిరి, కావలి నియోజకవర్గాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు, అభిమానులు, కార్యకర్తలు, మండల వాసులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య మండల వాసులు మేదరమెట్ల అంత్యక్రియలను నిర్వహించారు.
అడిగిన వారికి లేదనకుండా ఆయన చేసిన దానాలను, నిర్మించిన ఆలయాల గురించి ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తమ ప్రజానేత మృతి చెందడంతో జలదంకి మండలం మూగబోయినట్లు అయిందని స్థానికుల కన్నీరు మున్నీరుగా విలపించారు.
మండల వాసులను ఎవరిని కదిలించినా మేదరమెట్ల గొప్పతనాన్ని చర్చించికోవడం కనిపించింది. బీజేపీ రాష్ట్ర నేత కందుకూరి వెంకటసత్యనారాయణ, వైఎస్సార్సీపీ జలదంకి మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి, వివిధ మండలాల కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు.
మేదరమెట్ల కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్
జలదంకి: వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి ఆదివారం మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను సోమవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. మేదరమెట్ల సతీమణి, జెడ్పీటీసీ సభ్యురాలు శివలీలతో ఆయన ఫోన్లో మాట్లాడారు.
ఓదార్పు యాత్ర జిల్లాలో చేపట్టినపుడు మూడు రోజులపాటు మేదరమెట్ల స్వగృహంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మేదరమెట్ల మంచి వ్యక్తి అని, పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.