breaking news
markapuram-podili
-
నలుగురి ప్రాణాలు తీసిన నిద్రమత్తు
కొనకనమిట్ల: నిద్రమత్తు.. నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఓ లారీ బలంగా ఢీకొట్టడంతో కర్ణాటకకు చెందిన నలుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం–పొదిలి జాతీయ రహదారిపై గురువారం ఉదయం 6.40గంటల సమయంలో జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పాటిమీదపాలేనికి చెందిన వెన్నపూస శాంతారామిరెడ్డి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఆయన భార్య సరస్వతి తోబుట్టువు, వారి బంధువులు మరో 9 మంది కర్నాటక రాష్ట్రం బళ్లారి మండలం సిద్దంపల్లి, ఎరెంగలి, ఉద్దట్టి గ్రామాల నుంచి తుఫాన్ వాహనంలో బయల్దేరారు. మరో గంటలో పాటిమీదపాలెం చేరుకోవాల్సి ఉండగా.. కొనకనమిట్ల మండలం కొత్తపల్లి వద్ద చెన్నై నుంచి మార్కాపురానికి ఫ్లైవుడ్ లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో తుఫాన్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జయింది. వాహన డ్రైవర్ మంజు అందులోనే ఇరుక్కుపోగా సిద్దంపల్లి హేమంత్‌రెడ్డి(62), చెట్ల హంసమ్మ(59), చెట్ల సుగుణమ్మ(58) ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పొదిలి వైద్యశాలకు తరలించగా సునీత(32) చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల్లో హంసమ్మ, సునీత తల్లీకూతుళ్లు. చెట్ల శృతి, చెట్ల వీరారెడ్డి, సిద్దంపల్లి రామిరెడ్డి, సురేష్‌రెడ్డి, తిమ్మారెడ్డి, కవితతోపాటు తుఫాన్ డ్రైవర్ మంజు ప్రస్తుతం ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృత దేహాలను కందుకూరు ఆర్డీవో ఓబులేసు, దర్శి డీఎస్పీ సూర్యప్రకాశ్‌రావు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరనాయక్ తెలిపారు. ఘటనా స్థలంలో మృతదేహాలు, క్షతగాత్రులు -
ముసి వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు
కొనకనమిట్ల, న్యూస్‌లైన్ : భారీ వర్షాలకు మార్కాపురం-పొదిలి రహదారిపై కొనకనమిట్ల మండలంలోని ఎదురాళ్లపాడు సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న ముసి వాగులో గురువారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. రోడ్డు మార్జిన్ దాటి 100 మీటర్ల వరకూ బస్సు కొట్టుకుపోయి పూర్తిగా మునిగిపోవడంతో దానిలోని డ్రైవర్, ప్రయాణికులు కిటికీల్లో నుంచి టాప్‌పైకి ఎక్కారు. సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న స్థానికులు సుమారు 4 గంటలపాటు కష్టపడి అందరినీ రక్షించారు. పూర్తి వివరాల్లోకెళ్తే... మార్కాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం రాత్రి 6 గంటలకు తిరుపతి నుంచి మార్కాపురం బయలుదేరింది. గురువారం ఉదయం 6 గంటలకు పొదిలి-మార్కాపురం రోడ్డుపై ప్రయాణిస్తుండగా కొనకనమిట్ల మండలంలోని ఎదురాళ్లపాడు సమీపంలో ముసి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో డ్రైవర్ బస్సును ఆపాడు. ఆ సమయంలో బస్సులో డ్రైవర్ ఐ.గాలెయ్యతో పాటు అంబటి వెంకటేశ్వర్లు (కావలి), కండె సుబ్బారావు (మార్కాపురం), బి.రమేష్ (మార్కాపురం), టి.రూబేస్రెడ్డి (నెల్లూరు), కందుకూరు కోనేరు రంగారావు సిఫార్సుల కమిటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ప్రసాదు, మరో నలుగురు కలిపి మొత్తం 10 మంది ఉన్నారు. అప్పటికే జోరుగా వర్షం కురుస్తోంది. రోడ్డుపై 10 అడుగుల ఎత్తుకుపైగా మూసీవాగు ప్రవహిస్తోంది. నిదానంగా వాగుదాటవచ్చని భావించిన డ్రైవర్ గాలెయ్య బస్సును వాగులోకి దించాడు. అయితే, వాగు మధ్యలోకి వెళ్లగానే ఒక్కసారిగా బస్సు కొట్టుకుపోయింది. రోడ్డు మార్జిన్‌దాటి 100 మీటర్ల వరకూ వెళ్లి పూర్తిగా నీటిలో ముగినిపోయింది. బస్సులోని ప్రయాణికుల్లో ఇద్దరు గుర్తు తెలియని ప్రయాణికులు నీటిలోదూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా మిగిలిన వారు కిటికీల్లో నుంచి బస్సు టాప్‌పైకి ఎక్కారు. ఈలోగా సమాచారం అందుకున్న ఆ సమీపంలోని ఎదురాళ్లపాడు, కొత్తపల్లి, కొనకనమిట్ల గ్రామాల ప్రజలు, పలువురు అధికారులు అక్కడకు చేరుకున్నారు. అయితే, బస్సు కొట్టుకుపోయింది పడమర వైపునకు కాగా అధికారులంతా తూర్పువైపున ఉండిపోయారు. తహసీల్దార్ పద్మావతి ద్వారా సమాచారం అందుకున్న కందుకూరు ఆర్డీఓ బాపిరెడ్డి, దర్శి డీఎస్పీ కె.వెంకటలక్ష్మి, పొదిలి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సైలు శ్రీహరి, కమలాకర్, ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు, మార్కాపురం డీఎం సునీల్, ఎస్బీఐ ఏఎస్ఐ షరీఫ్, అల్లూరురెడ్డి అక్కడకు చేరుకున్నప్పటికీ బస్సు పడమర వైపు ఉండటంతో నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. సాహసం చేసిన స్థానికులు... బస్సు కొట్టుకుపోయిన వైపు ఉన్న స్థానికులు ఎంతో సాహసం చేసి ప్రయాణికులందరినీ రక్షించారు. బస్సు టాప్‌పైకి కూడా నీరు చేరుతుందనే భయంతో కాపాడాలంటూ ప్రయాణికులు కేకలు వేశారు. దీంతో ఎదురాళ్లపాడుకు చెందిన కుర్రా శ్రీను, యల్లయ్య, తిరుపతయ్య, మల్లయ్య, పోకల వెంకటేశ్వర్లు, కోడె వెంకటేశ్వర్లు, నీలం బాబు, నీలం దత్తయ్య, నీలం బ్రహ్మయ్య, పందిటి నాగేశ్వరరావు స్పందించారు. మోకుల సాయంతో బస్సు వద్దకు చేరుకుని టాప్‌పై ఉన్న 8 మందినీ క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. అందుకోసం సుమారు 4 గంటలపాటు వారు శ్రమించారు. ప్రాణాలకు తెగించి ధైర్యంగా వాగులోకి ప్రయాణికులను కాపాడిన యువకులను బాధితులతో పాటు ప్రజలు, అధికారులు అభినందించారు. హెలికాప్టర్ సాయమడిగిన అధికారులు... ఒక సమయంలో బస్సు టాప్‌పైకి కూడా నీరు చేరేలా ఉండటంతో అక్కడున్న వారిని రక్షించేందుకు వాగు వద్ద ఉన్న అధికారులు హెలికాప్టర్ సాయమడిగారు. కలెక్టర్‌కు సమాచారం అందించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కూడా ఫోన్లో కలెక్టర్, జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడారు. దీంతో సంఘటన స్థలానికి హెలికాప్టర్ పంపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 11 గంటల సమయంలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారని తెలుసుకుని హెలికాప్టర్ రాకను నిలిపివేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన వైఎస్ఆర్ సీపీ నాయకులు... బస్సు కొట్టుకుపోయిన సంఘటన స్థలాన్ని వైఎస్ఆర్ సీపీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త ఉడుముల శ్రీనివాసులరెడ్డి, కొనకనమిట్ల మండల కన్వీనర్ రాచమళ్ల వెంకటరామిరెడ్డి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులను రక్షించిన స్థానికులను వారు అభినందించారు. వాగు వద్ద పోలీస్ బందోబస్తు... ఉధృతంగా ప్రవహిస్తున్న ముసి వాగులోకి వాహనాలు, ప్రజలు దిగకుండా ఆ ప్రాంతంలో పొదిలి సీఐ వెంకటేశ్వరరావు, కొనకనమిట్ల ఎస్సై శ్రీహరిలు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాగు ప్రవాహ ఉధృతి పూర్తిగా తగ్గేవరకూ పోలీసు గస్తీ కొనసాగుతుందని వారు తెలిపారు.