కొండవీటి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది వైఎస్సే
♦ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి
♦ గుంటూరులో బాలికల వసతి గృహం ప్రారంభం
సాక్షి, అమరావతి బ్యూరో/ యడ్లపాడు: చారిత్రక ప్రాంతమైన కొండవీడు కోట అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సిం హారెడ్డి తెలిపారు. ఏపీలోని గుంటూరులో అనవేమా ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న ఉడుముల కోటిరత్నం, సాంబిరెడ్డి బాలికల వసతి గృహం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన కొండవీడు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కొండవీడు అభివృద్ధికి సమష్టి సహకారం అందించినట్టు వెల్లడించారు. నాడు శ్రీకారం చుట్టిన పనులనే నేటి ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు.
ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోట అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. నోట్ల రద్దుతో సామా న్యులకే ఇక్కట్లని బడాబాబులకు ఎలాంటి కష్టం లేదని, బ్లాక్మనీ బాగానే చెలామణి అవుతోందన్నారు. రద్దుకు ముందు రూ.50, రూ.100 నోట్లు ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. గ్రామాల్లో సామాజికంగా న్యాయం జరగాలంటే రెడ్లతోనే సాధ్యమన్నారు. ముందుగా నాయిని కొండ దిగువన ఏర్పాటు చేసిన కొండవీడు ప్రాంతానికి చెందిన ఫొటోగ్యాలరీని సందర్శించారు. కొండవీడుకోట కమిటీ కన్వీనర్ శివారెడ్డి చారిత్రక విషయాలను వివరించారు. కొండవీడుకోట అభివృద్ధికి పార్టీలు, కుల, మతాలకు అతీతంగా సమష్టిగా సహకారం అందించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి కోరారు.