‘చంద్రబాబుకు ఎస్సీలంటే మొదట్నుంచీ చిన్నచూపు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎస్సీలంటే మొదట్నుంచీ చిన్నచూపని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 3వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన కనకారావు. దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన టీడీపీ నేత సతీష్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును మొదట్నుంచీ టీడీపీ నేతలు అడ్డుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు టీడీపీ నేత సతీష్ నాయుడు స్వయంగా విగ్రహానికి నిప్పు పెట్టారు. సతీష్ నాయుడుని వెంటనే అరెస్టు చేయాలి. దేశంలో దసరా ఉత్సవాలు జరుగుతుంటే ఏపీలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబుకు ఎస్సీలంటే మొదట్నుంచీ చిన్నచూపు. జగన్ అధికారంలోకి వచ్చాక విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ విగ్రహం దగ్గర లైట్లు కూడా తొలగించారుస్మృతివనంలో పనిచేసే కార్మికులకు 9 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు. పర్చూరు నియోజకవర్గంలో కూడా ఇటీవలే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు. దళితులను పోలీసులతో అరికాళ్ల మీద దాడి చేయించారు. చంద్రబాబు నిరంకుశత్వం ఎంతోకాలం నిలవదు. దళితులే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చుతారు. దళితుల భూములను కూడా కబ్జా చేసిన నీచ చరిత్ర టీడీపీ నేతలది. పిఠాపురం నియోజకవర్గంలో దళితులను బహిష్కరణ చేశారు. అసలు చంద్రబాబు ప్రభుత్వంలో దళితులు బతికే పరిస్థితి లేదు’ అని ధ్వజమెత్తారు.