breaking news
Kharif rice cultivation
-
సకాలంలో వరి.. ఆరుతడే సరి!
- సకాలంలో ఖరీఫ్ వరి సాగుకు.. వెద పద్ధతి(నేరుగా విత్తుకోవటం)లో ఆరుతడి సేద్యం మేలు - తక్కువ ఖర్చు.. వారం ముందే కోతకొస్తుంది - తక్కువ వర్షం కురిసినా పంటకు ఢోకా ఉండదు సమయానికి వర్షాలు కురవకపోవడం.. సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఆలస్యం కావడం.. డెల్టాలో వరి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఫలితంగా ఖరీఫ్‌లో ఆలస్యంగా నాట్లు వేయటం వల్ల రెండో పంట సాగుకు కాలం మించిపోయి పంట దిగుబడి దెబ్బతింటున్నది. కాబట్టి, నారుమళ్లు పోసి నాట్లు వేయడానికి బదులు.. వెద పద్ధతి లేదా నేరుగా విత్తే పద్ధతిలో వరి పంటను సకాలంలో ప్రారంభించవచ్చు. నీటిని నిల్వగట్టకుండా ఆరుతడుల ద్వారా పంటను సాగు చేసుకోవచ్చు. తద్వారా సాగు నీటి సమస్యలను సమర్థవంతంగా అధిగమించవచ్చని కృష్ణా డెల్టా రైతాంగానికి సూచిస్తున్నారు మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి. అనురాధ. జూన్, జూలై మాసాల్లో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదవటం, కాలువల ద్వారా సాగు నీరు ఆలస్యంగా రావటం వంటి కారణాల వల్ల వరి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి దిగుబడి ఆశాజనకంగా ఉండాలంటే జూలై నెలాఖరులోగా నాట్లు వేయాలి. మరీ ఆలస్యమయితే చలికి పెరుగుదల మందగిస్తుంది. ఖరీఫ్‌లో నాట్లు వేయటం సకాలంలో పూర్తి చేయకపోతే రబీలో వరి మాగాణుల్లో అపరాల పంటల సాగు ఆలస్యమవుతుంది. నవంబర్ మొదటి వారంలోగా అపరాలను విత్తుకోకపోతే ఆలస్యమయిన కొద్దీ (రోజుకు 10–15 కిలోల చొప్పున) దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అయితే, వరి విత్తనాలను సీడ్ డ్రిల్ ద్వారా వెద పెట్టే పద్ధతిని పాటిస్తే ఖరీఫ్‌ను సకాలంలో ప్రారంభించవచ్చు. వెద పద్ధతి ద్వారా కూడా నాటువేసే పద్ధతికి సమానంగా ధాన్యం దిగుబడులు వస్తాయి. ఈ పద్ధతిలో నారుమడి దున్నటం, నారు పెంచటం, నాట్లు వేయటం వంటి పనుల అవసరం లేదు. కాబట్టి, రైతుకు ఖర్చు తగ్గుతుంది. వెద పద్ధతిలో వరి సాగుకు చౌడు నేలలు, ముంపునకు గురయ్యే భూములు, గట్టి పొర ఉన్న నేలలు అనుకూలం కాదు. సాంప్రదాయిక పద్ధతిలో నాట్లువేసే విధానంలో ఎకరాకు 20–25 కిలోల విత్తనం అవసరం. అయితే వెద పద్ధతిలో 10–15 కిలోల విత్తనం సరిపోతుంది. రైతుకు ఎకరాకు సుమారు రూ. 4 వేల వరకు ఖర్చు తగ్గుతుంది. చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. వెద పద్ధతిలో పైరు 7 రోజులు ముందే కోతకు వస్తుంది. యం. టి. యు 1061, సాంబ మసూరి, విజేత, కృష్ణవేణి, చైతన్య, కాటన్ దొర సన్నాలు వంటి రకాలు త్వరగా ఏపుగా పెరిగి కలుపును అణచివేస్తాయి. కాబట్టి ఈ రకాలు ఎద పద్ధతిలో సాగుకు అనుకూలం. వర్షాలు పడిన వెంటనే దున్నుకొని పొలం తయారు చేసుకుంటే కలుపును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. పొలంలో నీరు నిల్వ ఉండకుండా వీలయినంత చదును చేసుకోవాలి. భూమి పదునయ్యే వర్షం పడిన తర్వాత విత్తనం వేసుకోవాలి. భూమి స్వభావాన్ని బట్టి వారం పదిరోజుల తర్వాత మొదటి తyì ఇవ్వాలి. విత్తనం మొలకెత్తిన 10–15 రోజుల వరకు నీటి ఎద్దడి ఉండకూడదు. విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి.. తర్వాత 24 గంటలు మండెకట్టాలి. గింజల ముక్కుపగిలి తెల్లని పూత కనిపించగానే పొలమంతా సమానంగా వెదజల్లాలి. లేదా ట్రాక్టరు, అరక గొర్రుతో 2–3 సెం. మీ లోతులో పైపైన విత్తుకోవాలి. భూమిలో తగినంత తేమ లేకపోయినా, పై పొర గట్టిపడినా మొలక శాతం తగ్గుతుంది. కాబట్టి మరీ లోతుగా విత్తకూడదు. విత్తనాల మధ్య 20 సెం.మీ ఎడం ఉండాలి. తేమ తగినంత లేకుంటే విత్తిన వెంటనే తడివ్వాలి. నీటి లభ్యతను బట్టి నాటిన 30–40 రోజుల దశలో పొలంలో నీరు పారించి, మాగాణి వరిగా మార్చుకోవచ్చు. ఇదే సమయంలో వత్తుగా ఉన్న మొక్కలను తొలగించి పైరు పలుచగా ఉన్న చోట నాటుకుంటే.. తగిన సాంద్రతలో మొక్కలుండి మంచి దిగుబడులు వస్తాయి. పొలమంతా ఒకేసారి కోతకు వస్తుంది. పొట్ట దశ వరకు పొలంలో బురద పదును మాత్రమే ఉంచాలి. నీరు నిల్వ కట్టకూడదు. పైరు దుబ్బు చేసే వరకు 5–6 రోజులకోసారి ఆరుతడులు పెట్టాలి. సిఫారసుకు మించి విత్తనం వాడితే దుబ్బుల్లో కంకులు లేని పిలకలు ఎక్కువగా వస్తాయి. పైరు పడిపోతుంది. పొడ తెగులు, దోమ పోటు ఆశించే అవకాశం ఉంది. (మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. అనూరాధను 94418 14007 నంబరులో సంప్రదించవచ్చు) -
లెవీ తంతు
=9 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు =ఏఓ, ఏఏఓల నియామకానికి జేడీకి లేఖ =96,697 హెక్టార్లలో ఖరీఫ్ వరి సాగు =వరదలు కారణంగా 16 వేల హెక్టార్లలో నష్టం =దిగుబడిపై రైతుల ఆందోళన రైతుకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని లెవీ సేకరణ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కాబోతోంది.. ఖరీఫ్ వరి కొనుగోలుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. అయితే ధాన్యం నాణ్యత విషయంలో కొనుగోలు అధికారులు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో ఏటా లెవీ సేకరణ నిరాశాజనకంగా సాగుతోంది. తేమ శాతం ఎక్కువన్న కారణంపై అనేక సందర్భాల్లో అధికారులు ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తూ ఉండడంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని కర్షకులు నిరాశ పడుతున్నారు. అందుకే ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించడానికే మొగ్గు చూపుతున్నారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : మళ్లీ లేవీ సేకరణకు పౌర సరఫరా అధికారులు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ వరి కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో 9 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ధాన్యం నాణ్యతను అంచనా వేయడానికి, కొనుగోలుకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించడానికి టెక్నికల్ సిబ్బందిని నియమించనున్నారు. పదేళ్లుగా జిల్లాలో లెవీ సేకరణ నామమాత్రంగానే సాగుతోంది. ప్రతీ సీజన్లోనూ వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తులు రైతులను తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. దాంతో ధాన్యం కొనుగోలుకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నా యి. తేమ సాకుతో తక్కువ ధరకు కొనుగోలు చేయాలని అధికారులు భావిస్తూ ఉండడంతో సమస్య వస్తోంది. నాణ్యత పేరుతో అసలు కొనుగోలుకే విముఖత చూపిస్తుండడంతో జిల్లాలో పెద్దగా లెవీ సేకరణ జరగడం లేదు. 9 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు లేవీ సేకరణకు సంబంధించి జిల్లాకు ఎటువంటి లక్ష్యం లేదు. అయినా రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి అనువుగా జిల్లాలో 9 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. భీమిలి, అనకాపల్లి, చోడవరం, పెందుర్తి, నర్సీపట్నం, పాయకరావుపేట, చింతపల్లి, పాడేరు, అరకు మండలాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ తొమ్మిది కేంద్రాల్లో 9 మంది వంతున వ్యవసాయాధికారులను, 9 మంది సహాయ వ్యవసాయాధికారులను నియమించాలని పౌర సరఫరా అధికారులు వ్యవసాయ శాఖకు లేఖ రాశారు. వీరికి త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నారు. నామమాత్రంగా కొనుగోలు: ప్రభుత్వ నిబంధనల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలకు రైతులు ముందుకు రావడం లేదు. తేమ, నాణ్యత పేరుతో తక్కువ ధరకు అడుగుతున్నారు. నాణ్యత లేదని కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులకు రవాణా ఖర్చులు భారంగా మారుతున్నాయి. అందుకే వారు ధాన్యాన్ని మిల్లర్లకు నేరుగా విక్రయిస్తున్నారు. గత ఏడాది ఏడు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. గత పదేళ్లలో 2010 సంవత్సరంలో మాత్రమే అత్యధికంగా 200 టన్నులను ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు. ఎప్పటిలాగే ఈ సీజన్లో కూడా మరో నెల రోజుల్లో ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ నిబంధనల కారణంగా రైతులు ఈ కేంద్రాలకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. పంట నష్టపోయి పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ఉన్న రైతులు మిల్లర్లను ఆశ్రయించే అవకాశమే అధికంగా కనిపిస్తోంది.