breaking news
Kakinada-Pithapuram
-
కాకినాడ-పిఠాపురం రైల్వేలైన్‌కు కేంద్రం సానుకూలం
కాకినాడ సిటీ : దశాబ్దాలుగా జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన కాకినాడ-పిఠాపురం మెయిన్‌లైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వేశాఖ సానుకూలంగా ఉందని, వచ్చే రైల్వే బడ్జెట్లో నిధులు కేటాయింపునకు రైల్వే శాఖ మంత్రి హామీ ఇచ్చారని కాకినాడ ఎంపీ, రైల్వేబోర్డు సభ్యులు తోట నరసింహం వెల్లడించారు. ఈ నెల 25న రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న దృష్ట్యా రాష్ట్రానికి రావలసిన నిధులు, కొత్త ప్రాజెక్టులపై చర్చించేందుకు మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుతో సమావేశమైనట్టు ఎంపీ నరసింహం ఒక ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ సిటీగా ఎంపికవ్వడంతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడకు మెయిన్‌లైన్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గతంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ జరిగినా కార్యరూపం దాల్చలేదని, ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి కాకినాడ అభివృద్ధికి సహకరించాలని రైల్వేమంత్రి సురేష్ ప్రభుకు విన్నవించినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన ఆయన పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మోక్షం కల్పించేందుకు కృషి చేస్తానని, ఈ మేరకు బడ్జెట్లో ప్రాజెక్టుకు ప్రాధాన్యం కల్పించి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్టు ఎంపీ తోట వెల్లడించారు. -
టీంగ్..టీంగ్.. టీంగ్..దయచేసి వినండి..
ప్రతి ప్లాట్‌ఫాంపై సమస్యలు తిష్ట వేసి ఉన్నవి.. ప్రాథమిక వైద్యసౌకర్యం అంతంత మాత్రం నేడు దక్షిణమధ్య రైల్వే జీఎంతో ఎంపీల భేటీ ఆకాంక్షల్ని సాకారం చేయాలంటున్న జిల్లావాసులు సాక్షి ప్రతినిధి, కాకినాడ :రైల్వే బడ్జెట్.. ఏటా దీనిపై జిల్లావాసుల్లో ఆశలు మోసులెత్తుతుంటాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోటిపల్లి-నర్సాపురం, కాకినాడ-పిఠాపురం రైల్వే లైన్లకు నిధులు, జిల్లాకు కొత్త రైళ్లు, ఉన్నరైళ్లకే ప్రధాన స్టేషన్లలో హాల్ట్ వంటి ఆకాంక్షల సాకారానికి పచ్చజెండా ఊపుతారని ఎదురు చూస్తుంటారు. రైల్వేస్టేషన్లు ఆధునికీకరణకు నోచుకోవాలని కోరుకుంటారు. జనం ఆశలు, ఆకాంక్షలను బలపడేలా బడ్జెట్‌కు ముందు నేతలు హామీలు గుప్పించడమూ రివాజే. అయితే.. అవి సాకారం కావాలంటే బడ్జెట్ రూపకల్పనలో భాగంగా దఫదఫాలుగా జరిగే సమావేశాల్లో జిల్లాప్రజల వాణిని, ఆకాంక్షలను ఎంపీలు బలంగా వినిపించాలి. ఈ క్రమంలో ముందుగా దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తాతో రాష్ట్ర ఎంపీల సమావేశం గురువారం విజయవాడలో జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని రైల్వేస్టేషన్ల పరిస్థితిపై ప్రత్యేక కథనం.. జిల్లా ప్రధాన కేంద్రం కాకినాడలో.. కాకినాడ జిల్లాకు పరిపాలనా కేంద్రమే అయినా హౌరా-చెన్నై మెయిన్ లైన్లో ఉన్న రాజమండ్రితో పోల్చితే అభివృద్ధి అంతంత మాత్రమే. కాకినాడ రైల్వేస్టేషన్లో భానుగుడి వైపు ప్లాట్‌ఫాం నిర్మాణానికి గతంలోనే ఆమోదం లభించినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. రోజూ వచ్చే రైళ్లలో సగం మంది ప్రయాణికులు భానుగుడి వైపు దిగుతున్నారు. ఆ వైపు సౌకర్యాలు కల్పించాలి. రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వెళ్లడానికి ట్రాక్ వెంబడి రోడ్డును నిర్మించాలి. కొండయ్యపాలెం రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) ఎంత త్వరగా పూర్తయితే కాకినాడలో ట్రాఫిక్ సమస్య అంత వేగంగా నియంత్రణలోకి వస్తుంది. వంతెన పనులన్నీ రైల్వే శాఖ పూర్తి చేసినా రోడ్లు భవనాల శాఖ చేయాల్సిన పనులే మిగిలాయి. స్థానికంగా ఉన్న స్వల్ప అవరోధాలను సత్వరమే పరిష్కరించాలి. ఆర్వోబీకి అనుసంధానంగా ఉన్న రోడ్డు జగన్నాథపురం నుంచి మొదలై కొండయ్యపాలెం వరకూ వస్తుంది. ఆర్వోబీపై నుంచి వచ్చే రోడ్డును ఇటువైపు మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న 80 అడుగుల రోడ్డుకు కలిపితే ప్రయాణికులు నేరుగా నాగమల్లి తోట వద్ద మెయిన్‌రోడ్డుకు చేరుకోవచ్చు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ తాకిడి చాలావరకూ తగ్గిపోతుంది. ఐటీ పార్కు, ఆటోనగర్లతో పాటు జనావాసాలు విస్తరిస్తున్న సర్పవరం జంక్షన్లో కూడా ఇప్పుడే ఆర్వోబీ నిర్మిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవు. పోర్టు రైల్వేస్టేషన్ దగ్గర రైళ్ల నిర్వహణకు ఒకటీ లేదా రెండు పిట్లైన్లు అదనంగా వేయాలి. కాకినాడలో ఆగిపోయే రైళ్లను శుభ్రం చేసి క్షుణ్నంగా తనిఖీ చేయడానికి ఇవి చాలా అవసరం. అంతేకాదు కాకినాడ నుంచి అదనపు రైళ్లు నడపాలన్నా, కొత్త రైళ్లు వేయాలన్నా రైల్వేశాఖ తొలుత చూసేది ఈ పిట్‌లైన్ల సామర్థ్యాన్నే. వాణిజ్య రాజధాని రాజమండ్రిలో... పుష్కరాల సందర్భంగా రాజమండ్రి, గోదావరి రైల్వేస్టేషన్లకు రంగులు వేశారు. గోదావరి స్టేషన్లో ఫుట్‌వోవర్ బ్రిడ్జి నిర్మించారు. అంతకు మించి మౌలిక వసతులేవీ కల్పించలేదు. రైళ్ల రద్దీ దృష్ట్యా రాజమండ్రి స్టేషన్లో నాలుగో ప్లాట్ఫారం అత్యవసరం. పుష్కరాల సమయంలో నిర్మించిన లోలెవెల్ ప్లాట్ఫారం అంతగా ఉపయోగపడడం లేదు. తూర్పు రైల్వేస్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. స్టేషన్ ప్రాంగణంలో సులాభ్ కాంప్లెక్స్ నిర్మించాలి. కీలక కూడలి సామర్లకోటలో.. జనరల్ బోగీల్లో ప్రయాణించే వారు వేచి ఉండేందుకు ప్లాట్ఫారం ఇరువైపులా షెల్టరు లేదు. ఎండ కాసినా, వర్షం వచ్చినా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మూడు ప్లాట్ఫారంల పైనా అదే పరిస్థితి. ఫుట్‌వోవర్ బ్రిడ్జి ఒక్కటే ఉంది. పాత బ్రిడ్జి స్థానంలో ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఆరేళ్లవుతోంది. అర్ధాంతరంగా ఆగిన పనులను పూర్తి చేయాలి. తూర్పు వైపున రైలు దిగడానికి వీలుగా స్టేషన్‌ను అభివృద్ధి చేయాలి. ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్లను కేవలం రెండు నిమిషాలు కాక మూడు నిమిషాలైనా ఆపాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఫలహారశాల మూసేసి పదేళ్లవుతోంది. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పుణ్యస్థలి అన్నవరంలో.. దేవస్థానానికి వెళ్లే భక్తులు మూడో నంబరు ప్లాట్‌ఫాం దాటి కొండపైకి వెళ్లే వాహనాలు ఎక్కి వెళ్లాలి. కానీ ఈ ప్లాట్‌ఫాంపై వేచి ఉండేందుకు గదులు లేవు. టాయిలెట్స్ కూడా లేవు. టికెట్ బుకింగ్ కాంప్లెక్స్ 1వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి మూడో నంబరు ప్లాట్‌ఫాంకు మార్చాలన్నది చిరకాలపు డిమాండ్ కొండవైపు వెళ్లి వచ్చే వాహనాలు స్టేషన్ వద్ద ఆగేచోట ఎలాంటి షెల్టరూ లేదు. జిల్లా ప్రవేశద్వారం ‘తుని’లో.. రైల్వేస్టేషన్లో ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటున్నా టికెట్ కౌంటర్ మాత్రం ఒక్కటే ఉంది. రెండో కౌంటర్ ప్రారంభించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రెండో ప్లాట్‌ఫారంపై మరుగుదొడ్లున్నా ఎప్పుడూ మూసే ఉంటాయి. దువ్వాడ-పిఠాపురం మధ్య ఎక్కడ రైల్వే ప్రమాదాలు జరిగినా తుని జీఆర్పీ స్టేషన్‌కు రావాలి. ఇది రెండో ప్లాట్ఫారానికి వెనుక ఉంటుంది. అక్కడికి ఒకటో నంబరు ప్లాట్ఫారం నుంచే వెళ్లాలి. ఈ హడావుడిలో ఎవరైనా ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోలేకపోతే జరిమానాలు పడుతున్నాయి. ఈ అగచాట్లు పడలేక ఎదురుగా ఉన్న జీఆర్పీ స్టేషన్‌కు పట్టాలు దాటివెళ్లే ప్రయత్నంలో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు వినరూ.. రెండు నెలల క్రితం విజయవాడ నుంచి ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం విశాఖపట్నం వెళ్తున్న ఓ యువకుడు మంచినీరు పట్టుకోవడానికి సామర్లకోట స్టేషన్లో దిగాడు. రెండు నిమిషాలే హాల్ట్ కావడంతో కదిలిపోతున్న రైలు ఎక్కబోతూ పట్టుతప్పి ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై పడిపోయాడు. తీవ్ర గాయాలతో గంటన్నర పాటు రక్తపుమడుగులోనే ఆర్తనాదాలు చేస్తున్నా ప్రాథమిక వైద్యం చేసేవారే కరువయ్యారు. చివరకు 108 వాహనం వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయాడు. అదే రైల్వే ఆస్పత్రి వైద్యులు వెంటనే స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవి. రాజమండ్రి-తుని స్టేషన్ల మధ్య ప్రతి నెలా ఇలాంటి సంఘటనలు రెండైనా చోటు చేసుకుంటున్నాయి. ప్లాట్‌ఫాంపై వైద్య సిబ్బందిలో ఒకరిద్దరిని ఉంచితే క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అంది, ప్రాణాపాయం తప్పుతుంది.