breaking news
June 11
-
జూన్11న జీఎస్టీ కౌన్సిల్ తుది భేటీ
న్యూఢిల్లీ: జూలై 1వ తేదీ నుంచి ప్రతిష్టాత్మక జీఎస్టీ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మరోసారి పునరుద్ఘాటించారు. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ తుది సమావేశం జూన్ 11న తేదీన నిర్వహించనున్నట్టు శుక్రవారం చెప్పారు. బహుశా ఇది చివరి భేటీ అవుతుందన్నారు. పలు వర్గాల నుంచి వచ్చిన సూచనలు, అసంతృప్తులను దృష్టిలో ఉంచుకుని ఆదివారం జరిగే కౌన్సిల్ సమావేశంలో సమీక్షించనున్నట్టు తెలిపారు. జూన్ 3వ తేదీన జరిగిన 15వ సమావేశంలో సభ్యులు సూచించిన సవరణలు, జీఎస్టీ డ్రాఫ్ట్ రూల్స్, రేటు సవరణలను 16వ సమావేశంలో ప్రధానంగా చర్చించి అంగీకారం తెలపనున్నట్లు చెప్పారు. దీంతో పాటు వివిధ పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చిన వినతులపై కూడా కౌన్సిల్ చర్చిస్తుందన్నారు. మరోవైపు తమపై విధించిన జీఎస్టీ రేటుపై సమీక్షించాల్సిందిగా ఆటో పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేశాయి. మధ్యశ్రేణి నుంచి లార్జ్ సైజ్ హైబ్రిడ్ కార్లపై విధించే 43 శాతం పన్నును సమీక్షించాల్సిందిగా కోరాయి. ఈ పన్ను రేటు ప్రస్తుతం 30.3 శాతంగా ఉంది. అదేవిధంగా టెలికాం సెక్టార్ సైతం తమపై 18 శాతంగా ఉన్న పన్నును సమీక్షించాల్సిందిగా కోరింది. అలాగే సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( సీవోఏఐ ) కూడా ఇప్పటికే రెవెన్యూ సెక్రటరీకి ఈ మేరకు ఓ లేఖ కూడా రాసింది. ఐటీ హార్డ్‌వేర్ పరిశ్రమ సైతం ఐటీ ఉత్పత్తులు మానిటర్లు, ప్రింటర్లులాంటి కొన్ని అంశాలకు ప్రతిపాదించిన 28 శాతం బదులుగా ఏకరూప పన్ను విధానం తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కాగా జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటికే దాదాపు అన్ని వస్తు, సేవలపై పన్నులను నిర్ణయించింది. వివిధ రకాల వస్తువులపై 5, 12, 18, 28 శాతంగా పన్నులను ఖరారు చేసింది. విలువైన లోహాలు, బంగారు నాణేలు , అనుకరణ ఆభరణాలు, బంగారంపై 3శాతం శ్లాబ్‌ను నిర్ణయించింది. ముడి డైమండ్లపై 0.25శాతం పన్ను రేటును విధించిన విషయం తెలిసిందే. -
జూన్ 11 వరకే పెళ్లిసందడి
కొవ్వూరు :గోదావరి పుష్కరాల నేపథ్యంలో జూన్ 11 తర్వాత ఏడాది పాటు వివాహాలు చేయకూడదని పండితులు సూచిస్తున్న నేపథ్యంలో తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెళ్లిళ్ల సందడి ఊపందుకుంది. ఇప్పటికే వేలాది పెళ్లిళ్లు జరిగాయి. వివాహాది శుభకార్యాల నిర్వహణ, ముహుర్తాల విషయంలో పండితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలు పూర్తయ్యూక ఆరునెలల పాటు చేయకూడదని కొందరు, ఏడాది పాటు శుభకార్యాలు నిర్వహించకూడదని మరికొందరు చెబుతున్నారు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పటి (జూలై 14 పుష్కరాల ప్రారంభం) నుంచి నదికి తూర్పుభాగంలో ఉన్నవారు ఏడాది పాటు, పశ్చిమతీరంలో ఉన్న వారు విజయదశమి వరకు (నాలుగు నెలలపాటు) వివాహాది శుభకార్యాలు చేసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. సింహరాశిలో ఉన్న తొమ్మిది పాదాలలో మొదటి ఐదు పాదాలు అనగా జూలై 14 నుంచి సెప్టెంబర్ 30 వరకు, పుబ్బ రెండో పాదంలో గురు అతిచారంతో దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా శుభకార్యాలు చేయడం సింహ, గురు దోషం వల్ల నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 25 నుంచి గోదావరి నదికి పశ్చిమ తీరంలో ఉన్నవారు వివాహాది శుభకార్యాలు చేసుకోవచ్చునంటున్నారు. గోదావరి నదికి అంత్య పుష్కరాలున్నందున తూర్పు ప్రాంతంలో ఉన్న తూర్పు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లావాసులు ఏడాదిపాటు వివాహాది శుభకార్యాలు చేసుకోకూడదని పండితుల అభిప్రాయం. ఈ ఏడాది జూన్ 17నుంచి ఆగష్టు 14 వరకు అధిక ఆషాడం, నిజ ఆషాడం శూన్యమాసాలు అయినందున వివాహాది శుభకార్యాలకు అనువైన రోజులు కాదని పండితులు చెబుతున్నారు. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 9 వరకు గురుమౌఢ్యం, ఆగస్టు 10 నుంచి 20వ తేదీ మధ్య శుక్రమౌఢ్యం ఉండడం వల్ల, భాద్రపదమాసం సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 12 వరకు శూన్యమాసం కావడంతో వివాహాది శుభకార్యాలకు ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. విజయదశమి నుంచి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు గోదావరి నదికి పశ్చిమ ముఖంగా ఉన్న కృష్ణ, గుంటూరు ఇతర జిల్లాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకోవచ్చునని కొందరు పండితులు చెబుతున్నారు. ఈనెలలో 8, 9, 11, 12, 14, 15, 21, 22, 25 తేదీలు, మార్చినెలలో 4, 6, 7, 8, 11 నుంచి 15 వరకు, ఏప్రిల్ నెలలో 10, 22, 29, మేనెలలో 6, 7, 9, 10, 20, 27, 28, 30, 31వ తేదీలు, జూన్‌లో 3, 5, 6, 7, 10, 11వ తేదీలు వివాహాలకు అనువైన రోజులని పండితులు చెబుతున్నారు.