మేలుకొలుపులో సమస్యల ఏకరువు
- జొన్నలగడ్డ పద్మావతికి హారతులతో స్వాగతం
మడ్డిపల్లి (శింగనమల) : నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వారిని జాగృతం చేసేందుకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు మూడవరోజు కార్యక్రమానికి గ్రామీణుల నుంచి భారీ స్పందన లభించింది. వారు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. మేలుకొలుపు పాదయాత్ర ఆదివారం పుట్లూరు మండలంలోని మడ్డిపల్లి, జంగంరెడ్డిపేట, మడుగుపల్లి గ్రామాల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు పద్మావతికి హారతులు, పసుపు కుంకుమలతో స్వాగతం పలికారు. సుబ్బరాయసాగర్ నుంచి 29వ డిస్ట్రిబ్యూటరీకి హెచ్ఎల్సీ నీరు వదిలేలా చేసి అదుకోవాలని రైతులు కోరారు.
జన్మభూమి కమిటీల వల్ల అర్హులకు పింఛన్లు, రుణాలు రాకుండా పోతున్నాయని లబ్ధిదారులు ఆవేదన చెందారు. ఎస్సీలకు కూడా జన్మభూమి కమిటీలు సంతకం పెడితేనే రుణాలు మంజూరు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేని, రుణాలకు వడ్డీరాయితీ కూడా రాలేదని, రూ.2ల వడ్డీ పడుతోందని మహిళలు వాపోయారు. మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నా అధికారులు ఉపాధి పనులు కల్పించడం లేదని జంగంరెడ్డిపేట కూలీలు పద్మావతి దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఓబిలేసు, పార్టీ మండల కన్వీనరు భూమిరెడ్డి రాఘవరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబరు వెంకట్రామిరెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మహేశ్వర్రెడ్డి, రామాంజులరెడ్డి, పార్టీ ఐటీ వింగ్ బెంగళూరుకు చెందిన నాయకులు, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీపీఎం మద్దతు
మేలుకొలుపు పాదయాత్రకు సీపీఎం శింగనమల నియోజకవర్గ కార్యదర్శి బాలరంగయ్యతోపాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మద్దతు ప్రకటించారు. జంగంరెడ్డిపేట వద్ద పద్మావతిని కలిశారు.