పిల్లాడికి మాత్రమే కనిపించే హిట్లర్.. ఓటీటీలో డిఫరెంట్ సినిమా
వెతకాలే గానీ ఓటీటీల్లో భాషతో సంబంధం లేకుండా మంచి మంచి సినిమాలు చాలా కనిపిస్తాయి. అలాంటి ఓ మూవీ 'జోజో రాబిట్'. సాధారణంగా యుద్ధం బ్యాక్ డ్రాప్ అనగానే యాక్షన్ లేదంటే ఎమోషన్స్ చూపిస్తారు. దీనికి మాత్రం కామెడీ టచ్ ఇచ్చారు. ఓ పిల్లాడి కంట్లో నుంచి ప్రపంచ యుద్ధాన్ని చూస్తే ఎలా ఉంటుందనేదే ఈ మూవీ స్టోరీ. ఇంతకీ ఇది ఏ ఓటీటీలో ఉంది? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.2019లో థియేటర్లలో రిలీజై ప్రపంచవ్యాప్తంగా అద్భుత ఆదరణ దక్కించుకున్న సినిమాల్లో ఇది ఒకటి. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో 2020లో ఆస్కార్ కూడా సొంతం చేసుకుంది. హిట్లర్, నాజీ సైన్యంపై తీసిన మూవీనే అయినప్పటికీ కాస్త వ్యంగం జోడించి తెరకెక్కించడం ఇక్కడ స్పెషాలిటీ. ఇది హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.కథేంటి?అది రెండో ప్రపంచయుద్ధ సమయం. జర్మనీలోని ఓ ఊరిలో జోజో అనే పదేళ్ల పిల్లాడు ఉంటాడు. హిట్లర్ సైన్యంలో పిల్లల విభాగంలో ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఇతడికి మాత్రమే కనిపించే 'ఊహజనిత హిట్లర్'.. అన్ని విషయాల్లోనూ గైడ్ చేస్తుంటాడు. అలాంటి జోజో జీవితంలో ఈ యుద్ధం ఎలాంటి మార్పు తీసుకొచ్చింది. తల్లి రోజ్, ఇతడి ఇంట్లో రహస్యంగా ఉంటున్న యూదు అమ్మాయి ఎల్సా.. ఇతడి ప్రయాణంలో ఎలాంటి మలుపులకు కారణమయ్యారు అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?చూడగానే ఇది పిల్లల సినిమాలా అనిపిస్తుంది గానీ రెండో ప్రపంచ యుద్ధం, హిట్లర్, జర్మనీలోని నాజీ సైన్యం, యూదులు.. ఇలా పలు విషయాల్ని వ్యంగ్యంగా చూపించే ప్రయత్నం చేశారు. వీళ్లు గురించి ఏం తెలియకపోయినా పర్లేదు. ఎందుకంటే వాటి కంటే జోజో అనే పదేళ్ల పిల్లాడు, అతడి ప్రపంచం మనకు నచ్చేస్తుంది. తోటి పిల్లలతో ఉండే కామెడీ, తల్లి, ఎల్సాతో ఉండే ఎమోషనల్ సీన్స్ మనం ఆ ప్రపంచంలోకి వెళ్లేలా చేస్తాయి.రెండు గంటల కూడా ఉండదు ఈ సినిమా. అయితేనేం డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది. జోజోతో పాటు మనం కూడా ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. జోజో తల్లి, తండ్రి.. యూదులకు మంచి జరగాలనే ఉద్దేశంతో పనిచేస్తుంటారు. జోజోకి మాత్రం హిట్లర్, అతడి సైన్యం అంటే చచ్చేంత ప్రేమ. అలాంటి ఈ పిల్లాడు.. ఇంట్లోనే రహస్యంగా ఉంటున్న ఎల్సాతో స్నేహం చేయడం, యూదుల గురించి తెలుసుకోవడం.. ఇవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. అదే టైంలో ఆకట్టుకుంటాయి.కాకపోతే రెగ్యులర్ ఉండే డ్రామా కంటే ఇందులో కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి సగటు ప్రేక్షకుడి ఇది నచ్చకపోవచ్చు. లేదు ఏదైనా డిఫరెంట్‌గా టైమ్ పాస్ కోసం చూద్దామనుకుంటే మాత్రం ఈ మూవీ ట్రై చేయొచ్చు. మరీ ముఖ్యంగా జోజో పాత్రలో నటించిన రోమన్‌తో ప్రేమలో పడిపోతాం. ఇతడి తల్లిని హిట్లర్ ఆర్మీ చంపి, ఊరి మధ్యలో వేలాడాదీసే సీన్ అయితే మనల్ని కూడా కంటతడి పెట్టిస్తుంది.- చందు డొంకాన