breaking news
International Kissing Day
-
ముద్దొచ్చే ఫీలింగ్!
సందర్భం నేడు ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే అది 2013 ఫిబ్రవరి. వాలెంటైన్స్ డే వారం. సాయంత్రం ఐదు కావస్తోంది. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అన్నీ ప్రేమ కవితలే! ప్రేమలో ఇంత మ్యాజిక్ ఉందా అనిపించేలా రాస్తున్నారు ఒక్కొక్కళ్లు. ఆ కవితల ధారలో కనిపించిందొక పోస్ట్.. ‘ముద్దాడుతూ గిన్నిస్ ఎక్కారు!’ అని. చూస్తే 58గంటల 38నిమిషాల 58సెకండ్ల పాటు ముద్దిచ్చుకుంటూ థాయ్‌లాండ్‌లోని ఓ జంట గిన్నీస్ రికార్డు నెలకొల్పిందట. ‘బాబోయ్ ఇది నిజమేనా!? ఏదన్నా ఫేక్ న్యూస్ వెబ్సైట్ చదువుతున్నానా!’ అనిపించి మరోసారి కన్ఫర్మ్ చేసుకున్నా. నిజమే!! పక్కనే ఉన్న ఫ్రెండ్ ఒకడికి చూపించా. వాడూ నాలానే నోరెళ్లబెట్టాడు. ముద్దువైపుకు ఆలోచన మళ్లింది. ముద్దెందుకిస్తారసలు? ఎవరు మొదలుపెట్టారు ముద్దిచ్చుకోడాన్ని? ‘పిల్ల’ముద్దు సరే, ‘పెద్ద’ ముద్దు ఎలా ఉంటుంది? ఎన్నెన్ని రకాల ముద్దులో కదా!? నా ఆలోచనలను బద్దలు కొడుతూ ‘‘చాయ్ తాగి వద్దాం పద!’’ అని ఫ్రెండ్ లాక్కెళ్లాడు. ‘ఇరానీ చాయ్ అంత మత్తుగా ఉంటుందా ముద్దు?’ అనుకుంటూ, ‘‘అన్నా! ఏం కలుపుతావన్నా నీ చాయ్‌లో? ఎక్కడా రాదెందుకు ఈ టేస్ట్?’’ అనడిగా. నవ్వి ఊరుకున్నాడు. ‘‘చిన్నా! నువ్వైనా చెప్పరా?’’ అంటే ఆ చిన్నోడు మళ్లీ అన్న దిక్కే చూశాడు. ‘‘సరే! ఎవ్వరూ చెప్పరైతే!?’’ అంటే ఫ్రెండ్ నవ్వేశాడు.నిజమే, ఎవ్వరూ చెప్పరు. ఎందుకు చెప్తారు? పుట్టగానే ఒక్కసారి వెలుగు కళ్లల్లో పడితే వాటినలా మూసుకోమని ఎవరైనా చెప్పారా? ఆకలేస్తే ఏడవమని ఎవరు నేర్పించారు? ఇష్టాలను చూసినప్పుడు నవ్వడాన్ని ఎవ్వరూ అలవాటు చేయలేదే? ముద్దిస్తే బుగ్గను మనకు మనమే తుడిచేసుకోవడం ఎవర్ని చూసి నేర్చుకున్నాం? వెయిట్... అసలు నేనేం ఆలోచిస్తున్నా! దట్స్ ఇట్. ఇదే వాడి మ్యాజిక్. కనిపెట్టిన వాడి మ్యాజిక్ ఇదే! ఎన్ని ఆలోచించి కనిపెట్టకపోతే వాడినిప్పుడు తలుచుకున్నాం!? కనిపెట్టిందేనా లేక మనిషికి పుట్టుకతోనే అబ్బిన విద్యా? కనిపెట్టే ఉండొచ్చు అంటారు పెద్దోళ్లు. ఆ కనిపెట్టినవాడెవడో!? ఇది బాగుంటుందన్న ఆలోచన వాడికి ఎందుకొచ్చి ఉంటుందో? ఇది అలవాటైన వాడికి దీనికీ ఓ రోజు పెట్టాలని ఎందుకనిపించిందో? అనిపించిందే తడవు దానికో రోజెలా పెట్టేశాడో? అదలా ఉంటే వాలెంటైన్స్ డే వారం ఓ కిస్సింగ్ రికార్డ్ కంటపడ్డం ఏంటో? అంతా ఒక మాయ. ముద్దు మాయ. ముద్దంటే ఏం గుర్తొస్తుంది ముందు? తొమ్మిది నెలలు మోసి జన్మనిచ్చిన అమ్మ మొదటిసారి చేతుల్లోకి అందుకున్నప్పుడు ఓ ముద్దిచ్చే ఉంటుంది. అదెలా ఉండి ఉంటుందో? అదే మనకు తెలిసి ఉంటే ఆ ఫీలింగ్‌ను పట్టుకొని ఎన్నెన్ని కథలు, కవితలు రాసేసేవాళ్లమో? అదే తెలిసి ఉంటే ఇలాంటి రోజులు కొన్ని ఇంకెంతెంత అందంగా ఉండేవో? అమ్మ చేతుల్లోకి అలా తీసుకొని ముద్దిస్తూంటే చూసిన నాన్న కళ్లెలా మెరిసి ఉండెనో? ఏంటో అన్నీ మనకి తెలిసేలా చేయడు ఆ దేవుడు! వాళ్ళున్నారుగా చాల్లే అనుకున్నాడేమో!! అదేదో నువ్వెన్ని చెప్పినా చెప్పడానికి ఏదోకటి మిగిలే ఉంటుందంటారు. మాటల్లో చెప్పేదైతే ఏదోక భాష నేర్చేసుకున్నాం కాబట్టి చెప్పేస్తాం. చెప్పకుండా మిగిల్చిన, చెప్పడానికి అవకాశం రాని ఓ ఫీలింగ్‌ని ఎవరికి చెప్తాం? ఎలా పంచుకుంటాం? లైఫ్‌లో ఎన్ని ఉండుంటాయి ఆ ఫీలింగ్స్? కొన్నైతే ఊహలకే తప్ప పరిచయం కూడా రాని ఫీలింగ్స్.. అమ్మ ఇచ్చిన ముద్దులా! మరదే, జీవితమంటే ఇంతేనేమో, ఎవ్వరికీ చెప్పకుండా దాచుకున్న, చెప్పడానికి ఒక అవకాశం కూడా లేని ఫీలింగ్స్‌తో నిండిన ఒక మాయ. ముద్దు (అది ఎలాంటిదైనా) అలాంటి ఫీలింగ్స్‌లో ఒకటై ఉంటుంది. అంతే అంతే! అదే నిజం! ఎంత ఫిలాసఫీ ఉందీ ముద్దులో!! వావ్!!! ‘‘మాట్లాడుతుంటే వినవేం!?’’ కొడుతూ అరిచాడు ఫ్రెండ్. నేను ఆలోచనల్లోనుంచి బయటపడ్డా. ఈ ఫీలింగ్ ఇప్పుడు వాడికెలా చెప్పాలి? దాచేయడమే! ముద్దు ముచ్చట్లు ⇒తల్లి పిల్లాడికి ఆహారం నోటితో అందించే క్రమం నుంచి ముద్దనేది పుట్టుకొచ్చిందంటారు. అదెంతవరకు నిజమో!? ⇒ముద్దును మనమే కనిపెట్టామట. మన వేదాలలో దీనికి సంబంధించిన ప్రస్తావన ఉందని తేలింది. మూడు వేల ఏళ్ళ క్రితం నుంచే భారతీయ శిల్పకళలో ముద్దు గురించి ముచ్చటించారని పరిశోధకులు తేల్చారు. ⇒ముద్దుకో రోజు ఉండాలని ఎవరు కనిపెట్టారో ఎవ్వరికీ తెలియదు. ఇంగ్లాండ్‌లో ఈ డే పుట్టిందని అంటారు. జూలై 6న చాలా దేశాల్లో పెద్ద ఎత్తున కిస్సింగ్ డేని జరుపుకుంటారు. ⇒2005 నుంచి లాంగెస్ట్ కిస్ పేరుతో పోటీలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైతే థాయ్‌లాండ్ జంట ఎక్కాచై, లక్సనా తిరనరాట్లదే లాంగెస్ట్ కిస్ రికార్డు (58గంటల 38నిమిషాల 58సెకండ్లు). ⇒బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ తెలుసు కదా? ఆయనే ఫస్ట్ మోషన్ పిక్చర్ కెమెరా కనిపెట్టారు. అదే విధంగా ‘ది కిస్’ పేరుతో 1896లో మొట్టమొదటి కిస్ సీన్‌ను కూడా తెరపైకి తెచ్చింది ఆయనే! అప్పటికింకా ఇండియాలో సినిమా అనేది పుట్టలేదు. – వి. మల్లికార్జున్ -
అధరములను మధుర ఫలములవలె...
సందర్భం నేడు పపంచ ముద్దుల దినోత్సవం నవ్వులు నానా రకములు! ప్రేమలు పలు విధములు!! అదే రీతిన ముద్దులు కూడా సకల రూపములు!!! పురుషులందు పుణ్య పురుషులు వేరయా అనే రీతిలో ముద్దులందు మోహ ముద్దులు వేరు. ముద్దంటే? పెదవులతో రాసే పొయిట్రీ. ముద్దంటే? శృంగార సౌధానికి చేసే శంకుస్థాపన. ముద్దంటే? గుండెల్లో ఘనీభవించిన ప్రేమను ద్ర(ధృ)వీకరించుకునే ప్రయత్నం. ఇదంతా చూస్తుంటే... అధరాలక్కూడా అయస్కాంత శక్తి ఉందేమో అనిపిస్తుంది. ముద్దుతో కవిత్వం తన్మయత్వం పొందినట్టుగానే, ముద్దుతో వెండితెర పరవళ్లు తొక్కే పరిమళ సంద్రమయ్యింది. ఒకప్పుడు వెండితెరపై ముద్దు అనేది పరమ నిషిద్దం. ఇప్పుడది బాక్సాఫీస్‌కి బంగారు బాతు. ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’లో శ్రీదేవి అన్నట్టుగా - నాయకా నాయికలు తమ అధరములను మధుర ఫలముల వలె కొరుక్కుతినడం ఇప్పుడు ‘కామ’న్. బాలీవుడ్లో ఈ లిప్లాక్లనేవి ఆటోమేటిక్ లాక్ వేసినంత సులభము, సునాయాసము. టాలీవుడ్‌లోనూ అదే పరిస్థితి. ఎన్ని ఉదాహరణలని చెప్పాలి? ఎంత చరిత్ర అని తవ్వి తీయాలి. ఫైనల్‌గా ఈ ‘కిస్’కిందకాండ ప్రేక్షకులకు నయనానందకాండ! తొలి తెలుగు సినిమా ముద్దు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. మనకు స్వాతంత్య్రం వచ్చిన ఏడాదే విడుదలైన ‘గొల్లభామ’ సినిమాలో లిప్‌లాక్ సీన్ ఉంది. ప్రముఖ నటి అంజలీదేవి తొలి సినిమా అది. అంజలీదేవి, ‘ఈలపాట’ రఘురామయ్యపై ఈ ముద్దు సన్నివేశం చిత్రీకరించారు. సెన్సార్‌వారు అభ్యంతరం వ్యక్తం చేస్తే, అది నిజమైన ముద్దు దృశ్యం కాదని, ఎడిటింగ్‌లో చేసిన మేజిక్ అని చెప్పి తప్పించుకున్నారట ఆ చిత్ర దర్శక, నిర్మా తలు. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఇలాంటి బ్లాస్ట్‌లు చాలా జరిగాయి మరి! తొలి భారతీయసినీ చుంబనం 1933లో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కర్మ’ అనే సినిమా వచ్చింది. అందులో హీరో హీరోయిన్లు హేమాంశురాయ్, దేవికారాణి. వీరిద్దరిపై ఓ సుదీర్ఘ చుంబన దృశ్యం చిత్రీకరించారు. అప్పట్లో అది సూపర్ సెన్సేషన్. భారతీయ వెండితెరపై ఈ రీతిన ముద్దు దృశ్యాన్ని చిత్రీకరించడం ఇదే ప్రథమం.