సీపీఐ అభ్యర్థికి ఇండిపెండెంట్ గుర్తు
యాచారం, న్యూస్‌లైన్: బీ- ఫారం సకాలంలో అందజేసిన సీపీఐ అభ్యర్థికి అధికారులు ఇండిపెండెంట్ గుర్తు కేటాయించారు. ఇది గుర్తించిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తప్పును సరిదిద్దుకున్నారు. వివరాలు.. మండలంలోని రిధిలోని చింతుల్లకు చెందిన ఆకుల భిక్షపతి యాచారం జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
సోమవారం మధ్యాహ్నం సీపీఐ నుంచి పార్టీ బీ- ఫారాన్ని జెడ్పీలో కార్యాలయంలో అధికారులకు అందజేశారు. సీపీఐ నుంచి భిక్షపతి సకాలంలో బీ-ఫారం అందజేసినప్పటికీ అధికారులు అతనికి ఇండిపెండెంట్ గుర్తు కేటాయించారు. ఇది గుర్తించిన సీపీఐ మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ, ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కావలి నర్సింహ, అభ్యర్థి భిక్షపతిలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సకాలంలో బీ-ఫారం అందజేసినా ఇండిపెండెంట్ గుర్తు ఎలా ఇస్తారని నిలదీశారు. దీంతో అధికారులు తమ తప్పు తెలుసుకున్నారు. అనంతరం భిక్షపతికి సీపీఐ పార్టీ గుర్తును కేటాయించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.