breaking news
Hotels Association
-
అంతర్జాతీయ స్థాయికి భారత ఆతిథ్యం
న్యూఢిల్లీ: ప్రతిపాదిత జీఎస్టీ శ్లాబుల హేతుబద్దీకరణతో భారత ఆతిథ్య రంగం అంతర్జాతీయంగా పోటీపడే సామర్థ్యాలను సంతరించుకుంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 5 శాతం పన్ను రేటును ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం సేవలకు ప్రభుత్వం కల్పిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాయి. పన్నుల భారాన్ని తగ్గించేందుకు తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను తీసుకురానున్నట్టు స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనను హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) స్వాగతించింది. అంతర్జాతీయంగా పర్యాటకులకు చిరునామాగా భారత్ మారేందుకు జీఎస్టీలో సంస్కరణలు అవసరమని పేర్కొంది. ఇతర దేశాలతో పోల్చితే భారత ఆతిథ్య పరిశ్రమ ఆకర్షణీయంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు, 2047 నాటికి ఏటా 10 కోట్ల మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించాలన్న లక్ష్య సాధనకు ఉపకరిస్తుందని పేర్కొంది. భారత్‌లో టారిఫ్‌లు (పన్ను రేట్లు) అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్న అభిప్రాయాన్ని హెచ్ఏఐ ప్రెసిడెంట్ కేబీ కచ్రు వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా టాప్–5 పర్యాటక గమ్యస్థానాల్లో భారత్‌ను కూడా చేర్చాలంటే దేశ పోటీతత్వాన్ని పెంచాల్సి ఉందన్నారు. హోటళ్లపై 18 శాతం కారణంగా జీఎస్టీతో గదుల రేట్లు అధికంగా ఉంటున్నాయని.. దీంతో అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి ఉన్నట్టు వివరించారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.. ‘‘ప్రస్తుతం హోటళ్లలో రూ.7,500 వరకు గదుల అద్దెపై 12 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. ఇది 6–7 ఏళ్ల క్రితం నిర్ణయించిన రేటు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరిమితిని రూ.15,000కు పెంచాలి. ఇలా చేయడం వల్ల పర్యాటకులకు గదుల ధరలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం మీద పరిశ్రమ పోటీతత్వం పెరుగుతుంది’’అని హెచ్ఏఐ సూచించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక సేవలపై ఏక రూప 5 శాతం పన్ను రేటును, ఐటీసీ సదుపాయంతో అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్టు పేర్కొంది. ఇలా చేస్తే నిబంధనల అమలు భారం తగ్గుతుందని, వ్యాపార నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, మరిన్ని పెట్టుబడులు వచ్చి ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. -
హోటళ్ల ఆగ్రహం.. నిలిచిపోనున్న స్విగ్గీ సేవలు
సాక్షి, విజయవాడ : నగరంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సేవలు నిలిచిపోనున్నాయి. కమీషన్ పెంచమని తమపై ఒత్తిడి తెస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు హోటల్స్ అసోసియేషన్ బుధవారం వెల్లడించింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల వల్ల తమకు నష్టం జరుగుతుందని, దీంతో ఈ నెల 11 నుంచి స్విగ్గీతో లావాదేవీలను నిరవధికంగా నిలిపివేస్తున్నామని హోటల్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
వినియోగదారులపై భారం సరికాదు
⇔ జీఎస్టీ వ్యాట్‌ట్యాక్స్ తగ్గించాలి ⇔ హోటల్స్ అసోసియేషన్ సభ్యుల డిమాండ్ ⇔ పట్టణంలో ర్యాలీ.. నిరసన మహబూబ్‌నగర్ క్రైం: కేంద్ర ప్రభుత్వం హోటళ్లలో వ్యాట్‌ట్యాక్స్‌ను పెంచడం వల్ల వ్యాపారం బాగా దెబ్బతింటుందని, వెంటనే ఈ నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చేపట్టిన హోటళ్ల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మహబూబ్‌నగర్ పట్టణంలోని అవంతి హోటల్ దగ్గరనుంచి న్యూటౌన్, బస్టాండ్, క్లాక్‌టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మనోహార్‌రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ చట్టంలో వినియోగదారులైన సామాన్య ప్రజలపై అధిక భారం పడేవిధంగా 18శాతం వ్యాట్‌ట్యాక్స్ వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 30న జిల్లాలో హోటళ్ల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. జీఎస్టీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి సామాన్యులపై భారం పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హోటల్ వ్యాపారం అశించిన స్థాయిలో లేదని, ఈ క్రమంలో పన్నుభారం అధికంగా ఉంటే హోటల్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి నిరంజన్‌రెడ్డి, సమత్‌ఖాన్, చంద్రశేఖర్‌శెట్టి, శ్రీకాంత్‌రెడ్డి, జీతేందర్‌రెడ్డి, ఉమమహేశ్వర్రెడ్డి, భాస్కర్‌రెడ్డి,నాగరాజు పాల్గొన్నారు.