దేశ భవిత యువతపైనే..
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ‘దేశానికి ఆస్తి యువత, దేశ భవితవ్యం యువతపైనే ఆధారపడి ఉంది. దేశ పునర్నిర్మాణానికి యువశక్తిని వినియోగించుకోవాలి. జాతి నిర్మాణంలో యువత పాలుపంచుకోవాల’ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వియన్నారావు యువతకు పిలుపునిచ్చారు. స్థానిక శ్రీహర్షిణి డిగ్రీ, పీజీ కళాశాలల 11వ వార్షికోత్సవం సందర్భంగా కళాశాల నూతన భవన ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో వీసీ వియన్నారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ పీహెచ్ జీ కృష్ణంరాజు అధ్యక్షతన నిర్వహించిన సభలో వీసీ వియన్నారావు మాట్లాడుతూ.. ‘విద్యార్థులు వినూత్న ఆలోచనలతో భవిష్యత్తును రూపొందించుకోవాలి. తమకు ఆసక్తి, అభిరుచి ఉన్న అంశాలను ఎంపిక చేసుకుని అకుంఠిత దీక్షతో శ్రమిస్తే విజయం సాధించవచ్చ’ని ప్రోత్సహించారు. ‘మార్కులు ప్రామాణికం కాదు. చదువుకున్న అంశాలను ఆకళింపు చేసుకుని అనుభవంలో ఉపయోగించినప్పుడే ఆ చదువుకు సార్థకత లభిస్తుంద’ని పేర్కొన్నారు. నిరుద్యోగులుగా శ్రీహర్షిణి డిగ్రీ కళాశాల స్థాపించి మేటి కళాశాలగా తీర్చిదిద్దిన గోరంట్ల రవికుమార్, వీ వెంకటరావును విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.
ఆ ముగ్గురినీ మరవద్దు
తల్లి, తండ్రి, గురువును విద్యార్థులు ఎప్పుడూ మరవకూడదని ఏఎన్‌యూ రెక్టార్, ప్రొఫెసర్ ైవె పీ రామసుబ్బయ్య చెప్పారు. తాను ఇప్పటికీ తన జీతంలో ప్రతినెలా తన తల్లికి పంపించిన తర్వాతే మిగిలిన డబ్బు ఖర్చు చేస్తానన్నారు. విద్యార్థులు స్వయం శక్తితో ఎదగాలని సూచించారు. ఉద్యోగం కోసం ఒకరి ముందు చేతులు కట్టుకుని నిలిచేకంటే తామే పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం వీసీ వియన్నారావు, రెక్టార్ రామసుబ్బయ్యను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో పేస్ విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్, ప్రిన్సిపాల్ వెంకట్రావు, తెలుగు అధ్యాపకులు నూనె అంకమరావు, కసుకుర్తి శ్రీనివాసులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం
శ్రీహర్షిణి డిగ్రీ, పీజీ కళాశాల నూతన భవనాలను ఏఎన్‌యూ వీసీ కే వియన్నారావు ప్రారంభించారు. యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ వైపీ రామసుబ్బయ్య కళాశాల కార్యాలయం, ప్రయోగశాలలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఒంగోలు పీజీ సెంటర్ స్పెషలాఫీసర్ వెంకటేశ్వరరావు, పూర్వ స్పెషలాఫీసర్ సంజీవరావు, అధ్యాపకులు, పలువురు నగర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.