breaking news
FREE home delivery
-
ఈ యాప్ యూజర్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఫ్రీ
బెంగళూరు: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి భారత ప్రజలు ఈ వైరస్ దెబ్బకు అల్లాడిపోతున్నారు. ఆరోగ్యపరంగానే ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, సంస్థలు, అంతేందుకు సామాన్యులు సైతం తమకు తోచిన విధంగా కరోనా బాధితులకు సాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైడింగ్ యాప్ ఓలా ఔదార్యం చాటుకుంది. తమ యూజర్ల ముంగిటకు ఆక్సిజన్కాన్సన్ట్రేటర్లను ఉచితంగా అందించాలని నిర్ణయించుకుంది. మా యూజర్లకు ఫ్రీగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ప్రతీ రోజు పెరగడం, అందులో ఎక్కువ మంది ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కొందరికి సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కూడా విడిచారు. దీంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా ఓలా సంస్థ తమ యూజర్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉచితంగా అందించడానికి ముందుకువచ్చింది. ఇందుకు చేయాల్సిందల్లా అవసరమైన వారి కనీస వివరాలు ఓలా యాప్‌లో నింపాల్సి ఉంటుంది. తరువాత అవసరమైన వారి ఇంటి ముందుకే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉచితంగా తీసుకునేలా ఓలా ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని గివ్ ఇండియాతో భాగస్వామ్యం ద్వారా ఓలా ఫౌండేషన్ చేయనుంది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు, వాటి రవాణా చార్జీల కింద ఓలా తమ యూజర్ల నుంచి ఎలాంటి మొత్తం వసూలు చేయదు. ప్రారంభంగా 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఈ వారం నుంచి బెంగళూరు నగరంలో ప్రారంభించనుంది. రాబోయే వారాల్లో 10,000 వరకు దేశవ్యాప్తంగా వీటి సరఫరా జరిగేలా అమలు చేస్తామని ఓలా సహ వ్యవస్ధాపకులు భవీష్ అగర్వాల్ వెల్లడించారు. అసాధారణ పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేసేందుకు తాము ఓ2ఫర్ఇండియా కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన ప్రకటించారు. ( చదవండి: మద్యం ప్రియులకు శుభవార్త.. ఇకపై హోం డెలివరీ ) -
బండ దోపిడీ
ఏలూరు (టూటౌన్) :జిల్లాలోని వివిధ కంపెనీల గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులను దోచేస్తున్నాయి. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని అయినకాడికి దండుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఏజెన్సీల అక్రమార్జన మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా సాగుతోంది. జిల్లాలో 57 గ్యాస్ ఏజెన్సీల ద్వారా 8 లక్షల 19వేల 568 మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో లక్షా 45 వేలు డ్వాక్రా మహిళలకు సంబంధించినవి. వీరందరికీ ఒకే గ్యాస్ బండ ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీలు తమ వినియోగదారులకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా డోర్ డెలివరీ చేయాల్సి ఉంది. అది దాటితే 30 కిలోమీటర్ల లోపు 10 రూపాయలు, అది కూడా దాటితే 15 రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు మాత్రం ఒక్కొక్క వినియోగదారుడి నుంచి రూ. 50 నుంచి రూ. వంద వరకూ వసూలు చేస్తున్నారు. కొన్ని ఏజెన్సీలైతే వినియోగదారులను తమ వద్దకే వచ్చి గ్యాస్ బండ తీసుకోవాలని నిబంధన పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్నిచోట్ల గ్యాస్ బుక్ చేసిన ప్పటికీ కంప్యూటర్స్ పనిచేయటం లేదని చెప్పి సకాలంలో గ్యాస్‌ను సరఫరా చేయడం లేదు. దీంతో వినియోగదారుడు తన అవసరం కొద్దీ అదనంగా సొమ్ము చెల్లించి గ్యాస్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డ్వాక్రా గ్రూపులకు గ్యాస్ సరఫరా చేసే ఏలూరుకు చెందిన ఒక గ్యాస్ ఏజెన్సీ బాగా ఇబ్బంది పెడుతోందని ఆరోపణలున్నాయి. ఈ ఏజెన్సీ పరిధిలో సకాలంలో గ్యాస్ సరఫరా చేయాలంటే ఆటోడ్రైవర్లకు అదనపు సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. లేకపోతే రెండు నెలలకు కూడా గ్యాస్ పంపిణీ చేయటం లేదు. అదేమని మహిళలు అడిగితే మీ గ్యాస్ కనెక్షన్ తిరిగి రెగ్యులర్ చేసుకోవాలని, మీ వివరాలు విశాఖపట్నంలోని ఐఓసీకి పంపి కొత్తగా అనుమతి తెచ్చుకోవలసి ఉంటుందని చెప్పి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ అధికారులకు తెలిసినా వారు పట్టించుకోకపోవటంతో గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుల్ని పీడిస్తున్నాయి. అక్రమ మార్గంలో వినియోగం గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ బండలను కొంతమంది వ్యాపారులు, హోటల్స్ యజమానులు తమ ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వ్యాపారులకు ఎక్కువకు అమ్ముకుని డ్వాక్రా మహిళలను, గృహ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వినియోగదారులకు సంవత్సరానికి 12 గ్యాస్ బండలు ఇవ్వాలన్నది నిబంధన కాగా, చాలా ఏజెన్సీలు గ్రామీణ ప్రాంతాలలో 6 నుంచి 8 బండలను మాత్రమే అందిస్తున్నాయి. మిగిలినవి అడ్డదారిలో అమ్ముకుంటున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గ్యాస్ కనెక్షన్లకు పూర్తి స్థాయిలో ఆధార్‌కు అనుసంధానం చేయకపోవటమే. నిబంధనల మేరకు గ్యాస్ సరఫరా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం డ్వాక్రా మహిళలకు, గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే సమయంలో అక్రమంగా వసూళ్లకు పాల్పడితే వాహనాలను ఆపి మాకు సమాచారం అందించాలి. అలా చేసిన వారి ఏజెన్సీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం త్వరలో గ్యాస్ పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో వినియోగదారుడు గ్యాస్ కనెక్షన్లు వేరే కంపెనీకి మార్చుకోవటంతో పాటు, కావలసిన ఏజెన్సీకి మార్చుకోవచ్చు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ను వ్యాపారులు వినియోగిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ప్రజలు మాకు సమాచారం అందించాలి. - డి. శివశంకర్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఏలూరు.