The Fantastic Four: 1960ల యాస కోసం హాలీవుడ్ హీరో కష్టాలు
మార్వెల్ స్టూడియోస్ నుంచి కెవిన్ ఫీజ్ నిర్మాణంలో, మాట్ షాక్‌మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమా జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్వెల్ కామిక్స్‌లోని మొదటి సూపర్ హీరో కుటుంబం, గ్రహాలను మింగేసే గెలాక్టస్‌తో జరిగే ఉత్కంఠభరిత పోరాట కథతో ఈ చిత్రం రూపొందింది. ఇండియాలో ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఈ చిత్రం ప్రపంచవ్యాప్త ప్రమోషన్లలో భాగంగా, రీడ్ రిచర్డ్స్ పాత్రలో నటిస్తున్న పెడ్రో పాస్కల్ వానిటీ ఫెయిర్‌తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా కోసం 1960ల నాటి యాస అలవర్చుకునేందుకు తాను 100 శాతం ప్రయత్నించానని, కానీ సిబ్బంది తనను వెనక్కి లాగారని తెలిపారు. "నేను ఆ యుగంలోని మిడ్-అట్లాంటిక్ యాసను పట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నించాను. కానీ సిబ్బంది నన్ను ‘మీలాగే మాట్లాడు’ అని చెప్పారు. ఈ సినిమా ఇప్పటివరకూ చూసిన దానికంటే భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది," అని పెడ్రో వెల్లడించారు. ఆ రకమైన మాండలికం కోసం తమకు ఓ కోచ్‌ని కూడా ఏర్పాటు చేశారని చెప్పారు.ఈ చిత్రంలో సూ స్టార్మ్‌గా వెనెస్సా కిర్బీ, జానీ స్టార్మ్‌గా జోసెఫ్ క్విన్, బెన్ గ్రిమ్గా ఎబోన్ మోస్-బాచ్రాచ్, గెలాక్టస్గా రాల్ఫ్ ఇనేసన్, సిల్వర్ సర్ఫర్‌గా జూలియా గార్నర్ నటించారు.