breaking news
e-icu
-
గ్రేటర్ జనాభా 1.2 కోట్లు
* చెన్నై, బెంగళూరును మించిన భాగ్యనగరం * ఇంటింటి సర్వేలో వెల్లడైన నగర జనాభా: కేసీఆర్ * అపోలో ఈ-ఐసీయూ సేవలను ప్రారంభించిన సీఎం సాక్షి, హైదరాబాద్: జనాభాలో చెన్నై, బెంగళూరు నగరాలను హైదరాబాద్ మించిపోయిందని, ఇక్కడ జనాభా 1.20 కోట్లు అని తేలిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వే ద్వారా ఈ విషయం స్పష్టమైందని, మరిన్ని విశేషాలు త్వరలో తెలుస్తాయని అన్నారు. తెలంగాణలో 10 లక్షల ఎకరాలు పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్నాయని, త్వరలో ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు. అవినీతికి ఏమాత్రం తావులేని విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు, అద్భుతమైన పారిశ్రామిక విధానం ఉంటే ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు హైదరాబాద్‌కు పరిగెడతాయని, సింగపూర్ పర్యటనలో తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించినపుడు పారిశ్రామికవేత్తలు స్పందించారని చెప్పారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రి 26వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం శిల్పాకళావేదికలో అపోలో క్రిటికల్‌కేర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ (యాక్సెస్)-ఈ-ఐసీయూ సేవలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. ఆరోగ్య మహానగరంగా భాగ్యనగరం హైదరాబాద్‌ను ఆరోగ్యమహానగరంగా మార్చడంతో అపోలో హాస్పిటల్స్ కీలకపాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ సూచించారు. అపోలో లాంటి ఆస్పత్రి హైదరాబాద్‌కే గర్వకారణమన్నారు. ఇలాంటి ఆస్పత్రి భారత్‌లో.. ఆమాట కొస్తే ప్రపంచంలోనే ఉండదని కొనియాడారు. అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడాన్ని అభినందిస్తున్నామని, ఇది మరింత పెరగాలని ఆకాక్షించారు. ఇక్కడ మరో 25 ఆస్పత్రులు రావాలని, జిల్లాల్లోనూ ఇవి పెరగాలని, ఇందుకోసం ప్రభుత్వపరంగా సహాయ,సహకారాలు అందిస్తామన్నారు. అపోలో గ్రూపు ఆసుపత్రుల చైర్మన్ డా. ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ ఈ-ఐసీయూ సేవలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ తొలిసారిగా శాటిలైట్ టెలి మెడిసిన్‌ను ఇక్కడి నుంచే ప్రారంభించారని గుర్తుచేశారు. కేన్సర్, తదితర చికిత్సల్లో ఆధునిక చికిత్సలను తొలిసారిగా హైదరాబాద్ ప్రజలకు అపోలో అందుబాటులోకి తెచ్చిందన్నారు. డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి డా. టి.రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో, మానవత్వంతో, సామాజిక చైతన్యంతో వ్యవహరించాలని కోరారు. అపోలో గ్రూపు ఆసుపత్రుల జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సంగీతారెడ్డి స్వాగతోపన్యాసం చేయగా, ఎంపీలు కడియం శ్రీహరి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటు ధరలో మెరుగైన వైద్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుమూల ప్రాంతాలకు కూడా తక్కువ వ్యయాలతో మెరుగైన వైద్యం అందించే దిశగా ఎప్పటికప్పుడు అధునాతన సేవలు అందుబాటులోకి తెస్తున్నామని హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి చెప్పారు. ఇందుకు ఉద్దేశించిన ఈ-ఐసీయూ సేవల గురించి శనివారం ఇక్కడ క్రిటికేర్ అపోలో 2014 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన విలేకరులకు వివరించారు. మారుమూల ప్రాంతాల ఆస్పత్రులను అపోలోకి అనుసంధానించడం ద్వారా అక్కడ చికిత్స పొందుతున్న వారికి స్పెషలిస్టు సర్వీసులను అందించేందుకు ఈ-ఐసీయూ తోడ్పడుతుందన్నారు. దీనివల్ల వీడియో కాన్పరెన్సింగ్ వంటి సదుపాయంతో పేషంటు ఆరోగ్య పరిస్థితిని అప్పటికప్పుడు అంచనా వేసి, స్థానిక వైద్యులకు తగు సలహాలు ఇచ్చేందుకు వీలవుతుందని చెప్పారు. ఫలితంగా పేషంట్లకు చికిత్స సమయం, వ్యయాలు కూడా గణనీయంగా తగ్గుతాయని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం పైలట్ దశ కింద 50 పడకలను అనుసంధానించామని ఆయన వివరించారు. ఈ నెల 27న అపోలో 26వ వార్షికోత్సవం సందర్భంగా ఈ-ఐసీయూ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేగలమన్నారు. దీనికి ఫిలిప్స్ హెల్త్‌కేర్ సాంకేతిక సహకారం అందిస్తోందని వివరించారు. భారత్ కేవలం పర్యాటకానికి హబ్‌గా మాత్రమే కాకుండా హెల్త్‌కేర్ హబ్‌గా కూడా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. వైద్య సేవలు మెరుగవ్వాలంటే ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలే కాకుండా ప్రజల భాగస్వామ్యం కీలకమని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. కేన్సర్ వంటి వాటిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స వ్యయాలు గణనీయంగా తగ్గుతాయన్నారు.