breaking news
drama competitions
-
AP: 25 నుంచి రాష్ట్రస్థాయి నాటక పోటీలు
విజయవాడ కల్చరల్: రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు తోరం రాజా చెప్పారు. ఈ నెల 25 నుంచి వారం రోజుల పాటు విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో వైఎస్సార్ కళాపరిషత్ ద్వారా రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కనీసం 20 శాతం చిత్రీకరణ జరపాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు నిర్మాతలు, దర్శకులు సహకరించాలని కోరారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వారికి గుర్తింపు కార్డులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రంగస్థల కళాకారిణి రాజేశ్వరి మాట్లాడుతూ.. కళాకారులకు బస్‌పాస్ రాయితీ ఇవ్వాలని కోరారు. సినిమాలను ఏపీలో కూడా చిత్రీకరించి.. స్థానిక కళాకారులకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, ఉపాధ్యక్షుడు సుఖమంచి కోటేశ్వరరావు, సభ్యులు కొప్పుల ఆనంద్, బొర్రా నరసయ్య పాల్గొన్నారు. (క్లిక్: త్యాగానికి బహుమతి.. పరిహారం మంజూరు) -
సందేశాత్మకంగా ‘పున్నామ నరకం’
వీరవాసరం : వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో చిలకమర్తి కళాప్రాంగణంలో గుండా లక్ష్మీరత్నావతి కళావేదికపై ప్రదర్శిస్తున్న అఖిల భారత స్థాయి నాటిక పోటీలు ఆకట్టుకుంటున్నాయి. రసధ్వని గ్రామీణ సాంస్కృతిక సేవా సమితి శ్రీకాకుళం కళాకారులు ప్రదర్శించిన ‘పున్నామ నరకం’ నాటిక సందేశాత్మకంగా సాగింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని, కుమారులు పట్టించుకోని వృద్ధ తల్లిదండ్రుల పరిస్థితిని అద్దం పడుతూ నాటిక సాగింది. పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనే నమ్మకంతో తల్లిదండ్రులు అబ్బాయిలకు ప్రాధాన్యమిస్తున్నారని, వృద్ధాప్యంలో ఆసరాగా ఉండని కుమారులు కంటే పున్నామ నరకమే మేలనే సందేశంతో నాటిక సాగింది. అనంతరం కేకేఆర్ కల్చరల్ అసోసియేషన్ సికింద్రాబాద్ కళాకారులు ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటిక ప్రదర్శించారు. సమాజంలో మత విద్వేషాలు పెరుగుతున్న నేపథ్యంలో మతం కంటే మానవత్వం గొప్పదనే సందేశంతో నాటిక సాగింది. -
కళామతల్లి సిగలో కర్నూలు నందివర్ధనం
కర్నూలు(కల్చరల్): జెండాపై కపిరాజు..బావా ఎప్పుడు వచ్చితీవు.. చెల్లి యో చెల్లకో.. ఔరా.. ఈ రచనా చమత్కృతి ఏమియోగాని.. కర్నూలు జిల్లా పల్లె సీమల్లో ఈ పౌరాణిక పద్యాలు.. భారీ సంభాషణలు వినని వారు ఉండరు. శివరాత్రి, దసరా, సంక్రాంతి, జాతరలు.. దేవరలు.. పల్లెల్లో జరిగే పండుగలకు రచ్చబండలే రంగస్థల వేదికలవుతాయి. రైతన్నలే రంజైన పద్యం చెప్పే కళాకారులవుతారు.. ఆధునిక యుగంలో కర్నూలు నాటకం పరిపక్వమయింది. చెదిరిన ఉమ్మడి కుటుంబాలు.. వలస బాట పట్టిన కూలీలు.. ఫాక్షన్ మహమ్మారి.. పెట్రేగిన పాశ్చాత్య సంస్కృతి.. తదితర అంశాలే నాటక ఇతివృత్తాలయ్యాయి. కర్నూలు జిల్లా నాటకం పల్లె సీమ నుంచి దేశ రాజధాని ఢిల్లీ దాకా తన ప్రస్థానాన్ని కొనసాగించింది. కర్నూలు జిల్లాలో నాటకాల నడక ప్రారంభించిన వారు వెండితెరపై వెలుగుతున్నారు. 1940 నాటి మాధవ విలాస్ నుంచి నేటి లలిత కళా సమితి వరకు ఎన్నెన్నో నాటక సమాజాలు ఆవిర్భవించి అద్వితీయమైన నాటకాలు ప్రదర్శించి జాతీయ స్థాయిలో కర్నూలు ప్రతిభను ఇనుమడింపజేశాయి. వెల్దుర్తి వెంకటనర్సు నాయుడు, లొద్దిపల్లె, అల్లబక్ష్, కల్లూరి శేషయ్య, పెదపాడు పాండురంగయ్య, సీతారామమ్మ, రజనీబాయి, గొల్లా పిన్ని ప్రభాకర్, సంజన్న, సయ్యద్అహ్మద్ కర్నూలు జిల్లా రంగస్థలానికి సుందరమైన తోరణాలయ్యారు. ఎందరో నటులు నంది నాటకోత్సవాల్లో పాల్గొని నంది పురస్కారాలు పొంది కర్నూలు కళామతల్లి సిగలో నందివర్ధనాలయ్యారు. 120 ప్రదర్శనల పులిస్వారీ.. జిల్లాలోని ముఠా కక్షల ఇతివృత్తంతో ప్రసిద్ధ రచయిత విజయభాస్కర్ రాసిన ‘పులిస్వారి’ నాటకం రాష్ట్ర వ్యాప్తంగా 120 ప్రదర్శనలు పూర్తి చేసుకోవ డం ఓ సరికొత్త రికార్డు. ఈ నాటక ఇతివృత్తం కొ న్ని సినిమాలకు మూలకథగా తీసుకున్నారు. లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య దర్శకత్వం లో రూపొందిన ఈ నాటకం కర్నూలు జిల్లా నాటక రంగంలో ఓ మరుపురాని మైలురాయి. ఈ సంస్థ ద్వారా గోపిశెట్టి వెంకటేశ్వర్లు, మహ్మద్ మియా, వన్నెం బలరాం నంది అవార్డులు సాధించారు. ఇటీవల నంది నాటకోత్సవాల్లో బబ్రువాహన విజయం స్వర్ణ నంది సాధించడం లలిత కళా సమితి నాటక ప్రతిభకు తార్కాణంగా నిలిచింది. నేడు 5వ రాష్ట్రస్థాయి నాటక పోటీలు ప్రారంభం టీజీవీ కళా క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 5వ రాష్ట్రస్థాయి నాటక పోటీలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు ఒక్క క్షణం, 7.30 గంటలకు ఆనందం అనే నాటకాలు ప్రదర్శిస్తారు. నాలుగు రోజులు కర్నూలులో నాటకాల పండుగ నిర్వహిం చనున్నారు.