breaking news
double buses
-
డబుల్ డెక్కర్‌కు ఆర్టీసీ రూట్ క్లియర్
సాక్షి, సిటీబ్యూరో: డబుల్ డెక్కర్ బస్సులకు గ్రేటర్ ఆర్టీసీ ‘రూట్ క్లియర్’ చేసింది. ఒకప్పుడు నగర రహదారులపై పరుగులు పెట్టిన డబుల్ డెక్కర్ బస్సులు.. ఆకాశపుటంచుల్లో విహరిస్తున్న అనుభూతిని కలిగించేందుకు మరోసారి సిద్ధం కానున్నాయి. మంత్రి కేటీఆర్ సూచన మేరకు సిటీలో వీటిని నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ.. తాజాగా రూట్లను ఎంపిక చేసింది. గతంలో ప్రాథమికంగా నిర్ధారించిన మార్గాల్లో కొన్ని స్వల్ప మార్పులు చేసి డబుల్‌డెక్కర్ బస్సులను నడిపేందుకు అవకాశం ఉన్నట్లు కమిటీ స్పష్టం చేసింది. అప్పుడు అలా.. ⇔ ఒక డ్రైవర్, ఇద్దరు కండక్టర్లు ఉండే డబుల్ డెక్కర్ బస్సులను సికింద్రాబాద్ నుంచి జూపార్కు వరకు ఎక్కువగా నడిపేవారు. మెహిదీపట్నం, అఫ్జల్‌గంజ్ రూట్లలో కూడా రాకపోకలు సాగించాయి. ⇔ నగరరానికి వచ్చే పర్యాటకులను ఆకట్టుకొనేలా సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా చార్మినార్ వరకు ఈ బస్సులు నడిచేవి. ఒకవైపు హుస్సేన్‌సాగర్ అలలు.. మరోవైపు మహనీయుల విగ్రహాలను వీక్షిస్తూ డబుల్‌డెక్కర్ బస్సులో ప్రయాణం చేయడం ఓ మధురానునుభూతి. ⇔ నగరంలో 2002 వరకు ఎక్కువగా ఇవి నడిచాయి. అప్పటికే అనేక మార్గాల్లో ఫ్లైఓవర్లు రావడంతో డబుల్‌డెక్కర్ బస్సుల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ⇔ సికింద్రాబాద్– మెహిదీపట్నంల మధ్య ఒక బస్సును 2004 వరకు కూడా నడిపారు. కానీ అప్పటికే ఈ బస్సులు చాలావరకు కాలం చెల్లినవి కావడం, మరోవైపు ఫ్లైఓవర్ల వల్ల నిర్వహణ కష్టం కావడంతో పక్కకు పెట్టేశారు. ఇప్పుడు ఇలా.. ⇔ గతంలో పర్యాటక ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని డబుల్ డెక్కర్ బస్సులను ఏర్పాటు చేశారు. అప్పటికీ.. ఇప్పటికీ హైదరాబాద్ ఎంతో విస్తరించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ నగర హంగులను ప్రస్తుతం ఈ అయిదు రూట్లలో వీక్షించవచ్చు. ⇔ సికింద్రాబాద్ నుంచి సుచిత్ర మీదుగా మేడ్చల్‌కు వెళ్లే క్రమంలో ప్యారడైజ్, జూబ్లీ బస్స్టేషన్లతో పాటు మెట్రో రైళ్ల పరుగులు ఆకట్టుకుంటాయి. ⇔ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సికింద్రాబాద్– పటాన్చెరు రూట్లో తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం, బాలానగర్ చౌరస్తా, జేఎన్టీయూ వర్సిటీ తదితర ప్రాంతాలు కనిపిస్తాయి. ⇔ కోఠి నుంచి పటాన్చెరు వెళ్లే రూట్లో హైదరాబాద్ పాత కొత్త ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. అబిడ్స్, కోఠి వంటి పాతకాలపు మార్కెట్లు, పబ్లిక్‌గార్డెన్స్, అసెంబ్లీ భవనం, లక్డికాపూల్, అమీర్‌పేట్, కూకట్పల్లి తారసపడతాయి. ⇔ గౌలిగూడలోని సెంట్రల్ బస్‌స్టేషన్ నుంచి జాంబాగ్ పండ్ల మార్కెట్, కరాచీ బేకరీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వంటి చారిత్రక ప్రదేశాలు సీబీఎస్–జీడిమెట్ల రూట్ డబుల్ డెక్కర్ బస్సు నుంచి కనిపిస్తాయి. ⇔ అఫ్జల్‌గంజ్– మెహిదీపట్నం పూర్తిగా హైదరాబాద్ పురాతన పరిమళాలను గుబాళిస్తుంది. నాంపల్లి రైల్వేస్టేషన్, విజయనగర్ కాలనీ, మాసాబ్‌ట్యాంక్ వంటి ప్రాంతాలు కనిసిస్తాయి. -
ఇక రెట్టింపు బస్సులు నడుపుతాం
న్యూఢిల్లీ: కాలుష్య నివారణకు ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న సరి-బేసి నెంబర్ ప్లేట్ ఫార్ములా వల్ల ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో బస్సు సేవలను దాదాపు రెట్టింపు చేశారు. జనవరి 1 నుంచి సరి-బేసి విధానం అమలు చేస్తున్నందున అదే రోజు నుంచి ప్రస్తుతం ఉన్న బస్సు సేవలను రెట్టింపు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6 వేల అదనపు బస్సులు ఢిల్లీ నగరంలో జనవరి 1 నుంచి రోడ్డెక్కుతాయని గురువారం రవాణాశాక మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. జనవరి 1-15 తేదీల మధ్య ఈ బస్సు సేవల్ని కొనసాగించనున్నట్లు చెప్పారు. అధిక సేవల కోసం స్కూలు బస్సులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సీఎన్జీ స్కూలు బస్సుల్లో 50 శాతం సీట్లను మహిళలకు కేటాయించామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రూపకల్పణ చేసిన 'పుచో ఆప్'ను ఈ నెల 25న డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆటో సేవలను రెట్టింపు చేయనున్నట్లు, ఒకే ఆటోను రెండు డ్రైవర్లు ఒక్కో షిఫ్ట్ చొప్పున నడుపుతారని మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. లోకల్ ట్రైన్ సర్వీసులు పొడిగించే దిశగా చర్చలు సాగిస్తున్నట్లు వివరించారు. సోమ, బుధ, శుక్రవారాల్లో బేసి సంఖ్య నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలను రోడ్డుమీదకు అనుమతిస్తామని, మంగళ , గురు, శనివారాల్లో సరి సంఖ్య నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలకు వీలు కల్పిస్తామని అధికారులు ఇటీవలే మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం విదితమే.