breaking news
dangerous position
-
ప్రమాదకరంగా విద్యుత్తు తీగలు
సరిచేయని విద్యుత్ శాఖ భయాందోళన చెందుతున్న ప్రజలు కొండపాక: నేలకు గజం ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలను చూసి రైతులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటుచేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వాటిని నిరంతరం పర్యవేక్షించడంలేదు. దీంతో కరెంట్ షాక్ ప్రమాదాలు తరచూ జరుగుతున్నా సంబంధిత శాఖ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బిల్లులు వసూలుపై శ్రద్ధ సమస్యలను పరిష్కరించడంలో చూపడలంలేదని ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొండపాక మండలంలో సిర్సనగండ్ల, మర్పడ్గ, తిమ్మారెడ్డిపల్లి, మంగోల్, జప్తినాచారం, దుద్దెడ, కొండపాక గ్రామాల్లోని వ్యవసాయ బావుల వద్ద విద్యుత్తు తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. దీంతో రాత్రి సమయాల్లో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటే రైతులు జంకుతున్నారు. ఏళ్ల కిందట వ్యవసాయ బావులకు విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చేందుకు విద్యుత్ స్థంబాలను ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ కొరవడి విద్యుత్తు తీగలు క్రమేణా సాగి నేలకు సుమారు గజం ఎత్తుకు చేరాయి. ఇటీవల పశువులు మేత కోసం వెళ్ళినప్పుడు వాటిని తాకి మృతి చెందాయి. అలాగే మర్పడ్గ శివారులో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్యూజ్ వైరును సరిచేస్తుండగా రైతు విద్యుత్తు షాక్తో మృతి చెందాడు. వ్యవసాయ బావుల వద్ద నేలకు తాకేలా వ్రేలాడుతున్న విద్యుత్తు వైర్లను సరి చేయాలంటూ పలుమార్లు విద్యుత్తు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల్లో రైతులు పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల వసూలుపై ఉన్న శ్రద్ధ సమస్యలను పరిష్కచడంలో చూపడలేదని మండిపడుతున్నారు. సమస్య ఇలాగే పరిష్కరించకుండా ఉంటే ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యుత్తు వైర్లను సరి చేయాలి వ్యవసాయ బావుల వద్ద నేలకు తాకేలా విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. మేత కోసం వెళ్లిన పశువులు రెండు సార్లు కరెంట్ షాక్కు గురయ్యాయి. పెనుప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలి. వేలాడే విద్యుత్ తీగ ప్రాంతానికి వెళ్లాలంటే భయంగా ఉంది. - చెంది ఆంజనేయులు, రైతు, సిర్సనగండ్ల వైర్లను సరి చేయడంలో లేదు నెల నెలా విద్యుత్తు బిల్లులను వసూలు చేయడంపై అధికారులు చూపుతున్న శ్రద్ధ నేలకు తాకేలా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు వైర్లను సరి చేయడంలో చూపడం లేదు. విద్యుత్తు వైర్లను సరి చేసి ప్రమాదాలు జరుగకుండా చూడాలి. - క్యాతం శ్రీనివాస్, రైతు, సిర్సనగండ్ల ప్రమాదాలు జరుగుతున్నా స్పందించరా? వ్యవసాయ బావుల వద్ద నేలకు తాకేలా వ్రేలాడుతున్న విద్యుత్తు తీగల వల్ల పశువులు ప్రమాదవశాత్తు తగలడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా విద్యుత్తు అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి - జైన్ ఆంజనేయులు వ్యాపారి, కొండపాక అదనపు స్తంభాల కోసం ప్రతిపాదనలు పంపాం విద్యుత్తు వైర్లను సరి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరపడే స్తంబాల కోసం ప్రతిపాదనలు పంపాం. మంజూరు కాగానే విద్యుత్తు వైర్లను సరిచేస్తాం. మరీ కిందకు వేలాడుతున్న వైర్లను సరిచేసేందుకు దృష్టిసారించాం. రైతులు భయపడాల్సిన పనిలేదు. త్వరలో అన్ని సమస్యలను పరష్కరిస్తాం. - బాల్యానాయక్, విద్యుత్ లైన్మెన్ -
ప్రమాదకర స్థితిలో తెలుగుభాష
కడప కల్చరల్ : తెలుగుభాష ప్రమాదకర స్థితిలో ఉందని, పరిస్థితిని ఇలాగే కొనసాగనివ్వకూడదని, ఏదో ఒకటి చేసి రాబోయే తరానికి ఈ భాష, సంస్కృతులను అందించి తెలుగు ప్రాంత ఘన వారసత్వాన్ని అందజేయాలని భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయడ్డారు. డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి 90వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సాహితీ పీఠం యోగి వేమన విశ్వవిద్యాలయం, సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంతో కలిసి ఆదివారం బ్రౌన్ కేంద్రంలో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన డాక్టర్ జానమద్ది కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జానమద్ది చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరానికి తెలుగుభాష, సంస్కృతుల పట్ల అవగాహన బాగా లోపించిందని, ఈ దురవస్థ చూస్తే భావితరాలకు ఇవి అందవేమోనన్న ఆందోళన కలుగుతోందన్నారు. సైన్స్, టెక్నాలజీ మానవ జీవితానికి అవసరమే అయినా భాష, సంస్కృతులకు గల ప్రాముఖ్యత, అవసరం ఇంకా గొప్పదన్నారు. వాటిని పరిరక్షించేందుకు జానమద్ది చేసిన కృషి ఎన్నదగినదన్నారు. తెలుగును ప్రపంచ భాష చేద్దాం: మండలి బుద్ద ప్రసాద్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో గుగూల్ సహకారంతో తెలుగును ప్రపంచ భాషగా చేసేందుకు అందరూ తమవంతు కృషి చేయాలన్నారు. తెలుగుభాష, సంస్కృతుల అభివృద్ధికి అనన్య సామాన్యమైన సేవ చేసిన బ్రౌన్ శాస్త్రి తెలుగు వారందరికీ ప్రాతః స్మరణీయులన్నారు. డాక్టర్ జానమద్ది వ్యక్తిత్వం, ఔదర్యం ఆయనను ఓ వ్యవస్థగా తీర్చిదిద్దాయన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ మాట్లాడుతూ సాహిత్యం గురించి తెలియని తనకు జానమద్ది పరిచయంతోనే సాహితీ, సంస్కృతుల గొప్పతనం తెలిసిందన్నారు. నేటితరంలో విలువలు తగ్గడానికి కారణం బాల్యంనుంచి మానవత్వాన్ని బోధించక పోవడమేనని, జానమద్ది లాంటి వారు ఆ విలువలను పాటించారు గనుకనే ఆ ఫలితాలు తెలుగు వారందరికీ దక్కాయన్నారు. జిల్లా కలెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్గా బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రానికి తనవంతు సహాయ సహకారాలను తప్పక అందిస్తానన్నారు. వైవీయూ వీసీ ఆచార్య బేతనభట్ల శ్యాం సుందర్ సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు. బ్రౌన్ కేంద్రం బాధ్యులు రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. పుస్తకావిష్కరణలు డాక్టర్ జానమద్ది రచించిన బహురూపి గణపతి సంచికను, కొండూరు జనార్దన్రాజు ప్రచురించిన ఁమన జానమద్ది ప్రత్యేక సంచికను అతిథులు సభలో ఆవిష్కరించారు. విద్వాన్ కట్టా రచనతో ఎలమర్తి మధు గానంతో తయారైన జానమద్దిపై ప్రశంసాగీతం సీడీని కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. కార్యక్రమంలో బద్వేలు మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావు, డీటీసీ శ్రీకృష్ణవేణి, సాహిత్యనేత్రం సంపాదకులు శశిశ్రీ, అలపర్తి పిచ్చయ్యచౌదరి, డాక్టర్ జానమద్ది కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విద్వాన్ కట్టాకు ప్రముఖుల ప్రశ ంస సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం పూర్వ బాధ్యులు విద్వాన్ కట్టా నరసింహులు సాహితీ సేవలను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఆదివారం సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో జరిగిన డాక్టర్ జానమద్ది జయంతి సభలో పలువురు వక్తలు ఆయన సాహితీ సేవలను కొనియాడారు. రాష్ర్ట శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ తమ ప్రసంగంలో డాక్టర్ జానమద్ది సీపీ బ్రౌన్ సాహితీ సేవలకు చిరకీర్తిని కల్పిస్తే జానమద్ది సహచరుడు విద్వాన్ కట్టా నరసింహులు మెకంజీ కైఫీయత్తులను పరిష్కరించి, వాటి సారాంశాన్ని జిల్లా వాసులకు అందించడం విశేషమన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ మాట్లాడుతూ తనకు పురాణాల పట్ల ఎంతో ఆసక్తి ఉండేదని, నేర్చుకునేందుకు మిత్రుల సలహాపై డాక్టర్ జానమద్దిని కలిశామన్నారు. ఇందుకు తగిన వ్యక్తి కట్టా నరసింహులేనని, ఆయనే నీకు వాటిని బోధించగలరని కట్టాను పంపారన్నారు. కట్టా నరసింహులు తనకు రామాయణ, భారత, భాగవతాలను నేర్పారని, అందుకే కట్టాను తన సాహితీ గురువుగా చెప్పుకుంటున్నానని తెలిపారు. ఈ సభలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు విద్వాన్ కట్టా నరసింహులును ప్రశంసించడంతో సభకు హాజరైన పలువురు సాహితీవేత్తలు, కవులు, రచయితలు కట్టా నరసింహులును అభినందనలతో ముంచెత్తారు.