breaking news
Chennai International Film Festival
-
ఆ బాధ్యతను చిత్ర పరిశ్రమే తీసుకోవాలి
‘‘సెన్సార్ బోర్డ్ పనితీరు సరిగ్గా ఉండాలి. అలా ఉండాలంటే అర్హులైనవారే సెన్సార్ బోర్డ్‌లో ఉండాలి’’ అన్నారు కమల్‌హాసన్. ప్రస్తుతం చెన్నయ్‌లో జరుగుతున్న చెన్నయ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియావారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారాయన. సెన్సార్ బోర్డ్‌కి సంబంధించిన ఓ ప్రశ్నకు కమల్‌హాసన్ స్పందిస్తూ - ‘‘సినిమాలను ఇష్డపడేవాళ్లే దాదాపు సెన్సార్ బోర్డ్‌లో ఉంటారు. వాళ్లు ఎన్నో సినిమాలు చూస్తారు. అంత మాత్రాన మంచి అనుభవజ్ఞులై ఉంటారని చెప్పలేం. అర్హులైనవాళ్లు సభ్యులుగా ఉంటేనే సినిమాకి న్యాయం జరుగుతుందన్నది నా బలమైన నమ్మకం. ప్రస్తుతం మన సెన్సార్ బోర్డ్‌లో ఉన్న సభ్యుల్లో అర్హులైనవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రతి రాజకీయ పార్టీ తమకు సంబంధించిన ఓ సభ్యుడు సెన్సార్ బోర్డ్‌లో ఉండాలని కోరుకుంటోంది. అది తప్పు. సెన్సార్షిప్ బాధ్యతను సినిమా పరిశ్రమే తీసుకోవాలి’’ అన్నారు. -
వాళ్లు కన్నీటితో ఉంటే మనం పన్నీరు జల్లుకుంటామా?
‘‘రాష్ట్ర ప్రజలు సీమాంధ్ర, తెలంగాణ అంటూ ఒకరకమైన ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంటే మనం పండగ చేసుకోవడమా? ప్రేక్షక దేవుళ్ల వరంతో మనం ఆకాశంలో హరివిల్లులా వెలుగుతున్నాం. అంతగా అభిమానిస్తున్న వారు బాధలో ఉన్నప్పుడు మనం పండగ చేసుకుంటే చెడు సంకేతాలు వెళ్లవా’’ అని ప్రశ్నిస్తున్నారు డా. మోహన్‌బాబు. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ దక్షిణ భారత పరిశ్రమ చెన్నయ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ 21న ప్రారంభమయ్యే ఈ వేడుకలు 24 వరకూ జరుగుతాయి. ఈ వేడుకలను ఉద్దేశించే మోహన్‌బాబు ఈ ప్రశ్నలను సంధించారు. చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి ఈ వేడుకల విషయంలో పునరాలోచించాలని శనివారం ఓ ప్రకటనలో మోహన్‌బాబు అన్నారు. -‘‘నూరేళ్ల పండగను వైభవంగా జరపాలని అందరం నిర్ణయించుకున్నాం. దీనికి సంబంధించి రెండున్నర గంటలతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రూపొందించాలనుకున్నాం. అయితే ఇది జూలై 30కి ముందు. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. తెలంగాణ, సీమాంధ్ర మన పరిశ్రమకు రెండు కళ్లులాంటివి. ఈ ప్రజలు ఆవేదనలో ఉన్నప్పుడు మనం ఆడిపాడి సినిమా పండగ చేసుకోవడం ఎంతవరకు సబబు? ప్రజల మనోభావాలు దెబ్బ తినే ప్రమాదం ఉండదా? ప్రజలు కన్నీటితో ఉంటే మనం పన్నీరు జల్లుకుంటున్నామనే భావన వారికి కలగదా? అలాగని ఈ వేడుకల్లో మన తెలుగు పరిశ్రమవారు పాల్గొనకూడదని నేను అనను. కానీ ఈ వేడుకను వాయిదా వేస్తే బాగుంటుందని, చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. సినిమా నిజం. ప్రేక్షకులు నిజం. మిగతావన్నీ మధ్యలో పడి లేచే కెరటాలే’’ అన్నారు.