'కరువు' ప్రతిపాదనలు పంపండి
ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు కేంద్రం సూచన
సాక్షి, న్యూఢిల్లీ: ఖరీఫ్ సీజన్ సహా రబీ ప్రారంభం వరకు వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశంలో కరువు పరిస్థితి నెలకొన్న దృష్ట్యా కరువుపై సాయం కోరేందుకు సంబంధిత వివరాలతో అభ్యర్థన పంపాలని కేంద్రం పలు రాష్ట్రాలకు సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సమాచారం పంపింది. ఆయా రాష్ట్రాల్లో కరువు ప్రభావిత జిల్లాల సంఖ్యను పంపాలని, వాటిని కరువు జిల్లాలుగా ప్రకటించాలో వద్దో తెలుపుతూ వెంటనే సమాచారాన్ని పంపాలని సూచించింది.
అంతేకాకుండా జాతీయ కరువు సహాయక నిధి(ఎన్డీఆర్ఎఫ్) నుంచి సాయం కోసం ఆర్థిక వివరాలతో కూడిన అభ్యర్థన పంపాలని సూచించింది. సంబంధిత వివరాలు వచ్చాక కేంద్ర బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి అవసరమైన సాయాన్ని అంచనా వేస్తాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటివరకు కరువు సహాయ నిధుల కోసం కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు వచ్చాయని తెలిపింది.