breaking news
Central Vidyalaya
-
కేంద్రీయ విద్యాలయం మంజూరు
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు ఉత్తమ విద్య అందించాలనే సంకల్పంతో మంచిర్యాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తూ కేంద్ర మానవవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఇంటర్ వరకు బోధన జరుగుతుంది. 2014-15 విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. పక్కాభవనం నిర్మించే వరకు మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లోని సింగరేణి పాఠశాల(మూసివేసిన) భవనంలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకోసం రూ.17 కోట్లు మంజూరు చేశారు. మంచిర్యాల పరిసర ప్రాంతాల్లోని ఏడెకరాల స్థలంలో పాఠశాల సముదాయాన్ని నిర్మించనున్నారు. సుమారు 60 మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేయనున్నారు. విద్యాలయం నిర్వహణ అంతా కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలోనే కొనసాగనుంది. విద్యాలయంలో ప్రవేశం ఐదు సంవత్సరాలు పూర్తయిన పిల్లలను లాటరీ పద్ధతిన ఒకటో తరగతిలో చేర్చుకుంటారు. మి గతా తరగతుల్లో ఖాళీల ఆధారంగా రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీ క్షలో ఇతరులకు 33 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం మార్కులు వచ్చినవారిని చేర్చుకుంటా రు. ప్రతీ తరగతిలో ఎస్సీలు 15 శాతం, ఎస్టీలు 7.5 శాతం, వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో చదివిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం ఉండదు. ప్రతీ తరగతిలో 50 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. కేంద్రీయ విద్యాలయంలో ఒకటి నుంచి పది తరగతులు క్రమం తప్పకుండా ఉత్తీర్ణులైన విద్యార్థులను అదే విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. ఏడాదిలో దశల వారీగా నిర్వహించిన ఏడు పరీక్షలు, క్రీడా, సాంస్కృతిక అంశాల్లో చూపిన ప్రతిభా ఆధారంగా మార్కులు కేటాయించి, క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్‌ను విద్యార్థికి కేటాయిస్తారు. దీని ద్వారా పైతరగతికి విద్యార్థిని పంపుతారు. పైతరగతికి ఏటా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థికి మాత్రమే వసతి గృహంలో అనుమతి ఉంటుంది. విద్యార్థి ప్రవర్తన, చదువు, హాజరు సరిగా లేకుంటే పాఠశాల నుంచి తొలగిస్తారు. బోధన ఇలా.. సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రకారం బోధన జరుగుతుంది. వీటి నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఏ1 నుంచి ఈ2 గ్రేడ్ కేటాయిస్తారు. వారానికి ఐదు రోజులు తరగతులు నిర్వహిస్తారు. ప్రతిరోజూ నాలుగు గం టల బోధిస్తారు. మిగతా సమయంలో పాఠ్యాం శాల సాధనతోపాటు క్రీడా, సాంస్కృతిక అంశాల్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో మార్కులను తెలపరు. ఫీజులిలా.. బాలికలకు ఒకటి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పదో తరగతి వరకు ఉచిత విద్య ఉంటుంది. ప్రవేశ రుసుం రూ.25. ఇతర వర్గాల వారికి కమిటీ నిర్ణయించిన మేరకు ఫీజు ఉంటుంది. తరగతుల వారీగా కంప్యూటర్ విద్యకు రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటుంది. ఇంటర్లో ఆర్ట్స్ విద్యార్థులకు రూ.300, సైన్స్ విద్యార్థులకు రూ.400 ప్రతినెలా ఫీజు చెల్లించాలి. ధరలో 25 శాతం చెల్లిస్తే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ అందజేస్తారు. ఎవరికి ప్రవేశం కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వే, పోస్టాఫీస్, బీఎస్ఎన్ఎల్ , ఎల్ఐసీ, నేవీ, విమాన, బ్యాం కు, ఇన్‌కంటాక్స్, రక్షణ విభాగాలు ఇలా.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలందరికీ ఈ విద్యాలయంలో ప్రవే శం ఉంటుంది. ప్రవేశం లభించిన ప్రతీ విద్యార్థి తండ్రి తాను పనిచేస్తున్న కార్యాలయం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంటు పొందవచ్చు. పాఠశాల కమిటీ.. పాఠశాలలో విద్యావ్యవస్థ, వసతి, భోజనం, మౌలిక వసతుల పర్యవేక్షణకు కమిటీని ఏర్పా టు చేస్తారు. ఈ కమిటీలో ప్రిన్సిపాల్, ఇద్దరు ఉ పాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇద్దరు ఉంటారు. వీరి పర్యవేక్షణలో విద్యార్థుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కేంద్రీ య విద్యాలయం జిల్లాలోని కేంద్రప్రభుత్వ ఉ ద్యోగుల పిల్లల పాలిట వరంగా మారనుంది. -
కేంద్రీయ విద్యాలయానికి గ్రీన్ సిగ్నల్
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్ : ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే సదుద్దేశంతో ఏర్పాటు చేసే కేంద్రీయ విద్యాలయం సిద్దిపేటకు మంజూరైంది. కొంత కాలంగా సిద్దిపేట కేంద్రంగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రయత్నం సఫలీకృతమైంది. గతేడాది క్రితం సిద్దిపేట పట్టణంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ఎమ్మెల్యే హరీష్‌రావు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు అందజేసిన విషయం తెలిసిందే. అంతేగాక నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో ఆ శాఖ మంత్రి పల్లంరాజును వ్యక్తిగతంగా కలిసి విద్యాలయం ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు సిద్దిపేటలోని ఎన్సాన్పల్లి శివారు విద్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వ స్థల పరిశీలన జరిగింది. ఈ కేంద్రీయ విద్యాలయంలో ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సీబీఎస్ఈ సిలబస్ ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం బీహెచ్ఈఎల్ ప్రాంతంలో ఓ కేంద్రం కొనసాగుతోంది. ప్రస్తుతం రెండో విద్యాలయంగా సిద్దిపేటలో ఏర్పాటు కానుంది. ప్రస్తుతానికి వచ్చే విద్యా సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రారంభించి వెను వెంటనే దానిని 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎమ్మెల్యే హరీష్‌రావు న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ సిద్దిపేటకు కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం హర్షించ దగ్గ విషయమన్నారు. సిద్దిపేటలో ప్రస్తుతానికి బీసీ వసతి గృహంలో తాత్కాలికంగా విద్యాలయాన్ని కొనసాగిస్తామని, కలెక్టర్ సహకారంతో సొంత భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. తన మరో ప్రయత్నం సఫలీకృతం అయితే కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 14 కోట్లు మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు.