బాలికను మోసగించి ఏటీఎం కార్డు చోరీ
పామర్రు (కృష్ణా) : ఏటీఎంకు వెళ్లిన బాలికకు గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమె వద్ద ఉన్న కార్డును తీసుకున్నాడు. దానితో బాలిక తల్లి ఖాతా నుంచి రూ.72,300 డ్రా చేసుకున్నాడు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. స్థానిక చౌదరిపేటలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న జి.బాల సత్యశ్రీకి భారతీయ స్టేట్‌బ్యాంక్ స్థానిక బ్రాంచ్‌లో అకౌంట్ ఉంది. దీనికి ఏటీఎం కార్డు కూడా ఉంది. సత్యశ్రీ గతనెల 25న తన కుమార్తెకు ఏటీఎం కార్డు ఇచ్చి మినీ స్టేట్మెంట్ తీసుకురమ్మని పంపారు. బాలిక విజయవాడ రోడ్డులోని ఏటీఎంకు వెళ్లి మినీ స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నంలో ఉండగా ఓ వ్యక్తి అక్కడకు వచ్చాడు. ఆమెకు మాయమాటలు చెప్పి కార్డును తీసుకుని, ఇంకో కార్డు ఇచ్చాడు. బాలిక దానితో మినీ స్టేట్మెంట్ తీసుకునేందుకు ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో ఇంటికి వెళ్లిపోయింది.
సత్యశ్రీ ఈనెల ఒకటో తేదీన బ్యాంక్‌కు వెళ్లి తన ఏటీఎం కార్డు పనిచేయడం లేదని ఫిర్యాదు చే యగా, సిబ్బంది దానిని పరిశీలించి.. అది మీ కార్డు కాదని చెప్పారు. దీంతో ఆమె ఆందోళనకు గురై బ్యాంక్ ఖాతాను పరిశీలించగా, అందులో నుంచి రూ.73,200 డ్రా చేసినట్లు ఉంది. ఏటీఎం కార్డును అపహరించిన వ్యక్తి దానితో గతనెల 25న స్థానిక గఫార్ సెంటర్లోని ఏటీఎం నుంచి రూ.40వేలు, గుడివాడలోని ఏటీఎం నుంచి మరుసటిరోజు రూ.9,500, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఏటీఎం నుంచి రూ.23,700 డ్రా చేసినట్లు ఉంది. సత్యశ్రీ కుమార్తెకు గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన కార్డు భీమవరానికి చెందింది. అది కూడా అపహరణకు గురైందని అక్కడి బ్యాంక్ బ్రాంచ్‌లో ఫిర్యాదు దాఖలైంది. కార్డుదారుడు దీనిపై ఈనెల ఒకటో తేదీన బ్యాంక్‌లో ఫిర్యాదు చేశారు. కార్డును బ్లాక్ చేయించారు. తన ఏటీఎం కార్డు అపహరణకు గురైనట్లు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సత్యశ్రీ ఫిర్యాదు చేసింది.