breaking news
cancer spread
-
World Cancer Day Feb-4 : 'జీన్' సైలెన్సింగ్ ఎడిటింగ్!
'మనం ఏదైనా రాస్తుంటాం. లేదా సినిమా కోసం రీల్స్ తీస్తుంటాం. తీరా రాశాక లేదా తీశాక అది అంత సరిగా లేదని లేదా కోరుకున్నట్లుగా రాలేదనీ లేదా తీసిన సమాచారం అవసరం లేదనిపిస్తుంది. అప్పుడు మనం చేసే పని ‘ఎడిటింగ్’! అలాగే.. మన ప్రతి ఒక్కరి జీవితంలో.. మన అవయవ నిర్మాణం, వికాసం, ఆరోగ్యచరిత్ర.. వీటన్నింటికీ మూలం ఈ రాత లేదా రీల్స్ రూపంతో పోలిక గల జన్యువులు. ఎక్కడైనా పదాలు తప్పుగా వస్తే వాటిని సవరించినట్లుగా, సినిమాలో రీల్స్ తప్పుగా వస్తే వాటిని సరి చేసినట్టుగానే.. ఈ జన్యు పొరబాట్లనూ సరి చేసే ప్రక్రియే ‘జీన్ ఎడిటింగ్’. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియలతో జన్యులోపాలతో వచ్చే క్యాన్సర్లనూ లేదా జబ్బులను పూర్తిగా నయం చేయవచ్చు. ఫిబ్రవరి 4న ‘ప్రపంచ క్యాన్సర్ డే’ సందర్భంగా ఈ అత్యంత కొత్త చికిత్స విధానాల్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ కథనం.' మన దేహం మొత్తం కణాలతో నిర్మితమై ఉంటుంది. కణం మధ్యలోని న్యూక్లియస్‌లో క్రోమోజోములుంటాయి. ఈ క్రోమోజోములన్నీ డీఎన్ఏ, ఆర్ఎన్ఏలతో కలగలసిన జన్యువులతో నిర్మితమై ఉంటాయి. మన దేహం తాలూకు అన్ని జీవక్రియలూ వాటి మీదే ఆధారపడి నడుస్తుంటాయి. అంటే జీవకణంలో జరిగే మొత్తం ప్రాసెసింగ్‌కు ఈ ఆర్ఎన్ఏలు దోహదపడుతుంటాయి. అవి చేసే పనులను బట్టి ఎమ్ఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టీ ఆర్ఎన్ఏ అనే రకాలతో ప్రోటీన్ల రూపకల్పనకు సహాయపడుతుంటాయి. ఈ ఆర్ఎన్ఏ, డీఎన్ఏల ప్రాసెసింగ్ ప్రక్రియల్లో తేడాలు జరిగినప్పుడు అవి వ్యాధుల రూపంలో.. ప్రధానంగా క్యాన్సర్లుగా బయటపడతాయి. జన్యులోపాలతో వ్యాధులు ఎలాగంటే.. కొన్ని మన జన్యువుల మూలస్థానాల్లో పొరబాటు జరిగినప్పుడు.. అది ఓ జబ్బు రూపంలో అందునా క్యాన్సర్ల రూపంలో ఎలా బయటపడతాయో చూద్దాం. ఉదాహరణకు బీసీఆర్ ఏబీఎల్ అనే జన్యువులో లోపం వల్ల టైరోసిన్ కైనేజ్ అనే ఓ ఎంజైము నిరంతరాయంగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది అత్యధికంగా తెల్లరక్తకణాలను ఉత్పత్తి చేయమంటూ దేహానికి ఆదేశాలు అందజేస్తుంది. దాంతో ఓ తెల్లరక్తకణం జీవితకాలం పూర్తి కాకుండానే అనేక తెల్లరక్తకణాలు పుట్టుకొస్తుంటాయి. పాలు విరిగినప్పుడు పనికిరాని విధంగానే.. రక్తంలో లోపభూయిష్టమైన తెల్లరక్తకణాలు గుంపులు గుంపులుగా గుమిగూడిపోయి, పూర్తిస్థాయి మెచ్యురిటీ రాకుండానే నశించిపోయి రక్తం విరిగినట్లుగా కనిపిస్తుంటుంది. ఇలా జరగడం వల్ల అది ‘క్రానిక్ మైలాయిడ్ లుకేమియా’ అనే బ్లడ్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలా ఒక జన్యువు చెడిపోవడం వల్ల/ లోపం కలగడం వల్ల వచ్చే క్యాన్సర్లు చాలా రకాలే ఉంటాయి. కొత్త చికిత్స ప్రక్రియలేమిటి? అవి ఎలా పనిచేస్తాయంటే... జన్యువులు, జెనెటిక్ కోడ్స్‌లో వచ్చే మ్యూటేషన్లు, వాటి కారణంగా ఉత్పన్నమయ్యే లోపాల కారణంగా వచ్చే వ్యాధులకు చికిత్స అందించడానికి పరిశోధకులు సరికొత్త విధానాలను కనుగొంటున్నారు. వాటిల్లో జీన్ ఎడిటింగ్లూ, జీన్ సైలెన్సింగ్లన్నవి ఇటీవలే కనుగొన్న విధానాలు. అదెలాగంటే.. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా కణంలోని జీవక్రియల్లో రకరకాల ఆర్ఎన్ఏలు.. (తాము ఏ రకానికి చెందినవన్న దాన్ని బట్టి).. జన్యు సమాచారాన్ని అందజేయడం, నిక్షిప్తపరచడం వంటి పనులు చేస్తాయి. ఇవన్నీ ఎమైనో యాసిడ్లూ, ప్రోటీన్లు ఏర్పడటం ద్వారా జరుగుతుంటాయి. ఇలాప్రోటీన్లు రూపొందే సమయంలో కొన్ని అదనంగా ఏర్పడవచ్చు. మరికొన్ని ఏర్పడాల్సిన విధంగా ఏర్పడకుండా మిస్ కావచ్చు. లేదా ఇంకొన్ని తప్పుడు సీక్వెన్స్‌లో ఏర్పడవచ్చు. వీటిల్లో ఏది జరిగినా.. అది వ్యాధిగా వ్యక్తమవుతుంది. చక్కదిద్దడానికి పరిశోధకులు చేస్తున్నదేమంటే.. ఇలా జన్యువుల్లోని లోపాల వల్ల వచ్చే క్యాన్సర్లను చక్కదిద్దడానికి పరిశోధకులు కొన్ని ఎడిటింగ్ ప్రక్రియలను అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా వారు మొత్తం ఆర్ఎన్ఏ కాకుండా... తమకు కావాల్సిన మేరకు చిన్న చిన్న ఆర్ఎన్ఏ లేదా డీఎన్ఏ స్ట్రాండ్స్ రూపొందిస్తారు. ఇలా రూపొందించిన స్ట్రాండ్స్ను ‘యాంటీ సెన్స్ ఆలిగో న్యూక్లియోటైడ్స్’ (ఏఎస్ఓ)లని అంటారు. కణంలోని జన్యుసమాచారాన్ని అందించడం, ఉపయోగించడం వంటి కార్యకలాపాలు జరిగే సమయంలో.. బహిర్గతం కావాల్సినప్రోటీన్ భాగాలు బయటకు రాకపోయినా, లోపలే ఉండాల్సినవి బయటకు వచ్చినా లేదా ఆర్ఎన్ఏ రూపంలో తేడాలు వచ్చినా అది క్యాన్సర్‌గా బయటపడుతుందని ఇప్పటికే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పరిశోధకులు రూపొందించిన ఈ ‘యాంటీ సెన్స్ ఆలిగోన్యూక్లియోటైడ్స్’, సంక్షిప్తంగా ఏఎస్ఓలనేవి చిన్న చిన్న స్ట్రాండ్స్గా ఏర్పడి.. ప్రధానంగా ఈ కింద పేర్కొన్న పద్ధతుల్లో వాటిని చక్కదిద్దుతాయి. అదెలాగంటే.. 1. ఆర్ఎన్ఏలో లోపభూయిష్టమైనప్రాంతం ఉంటే.. ఈ చిన్న స్ట్రాండ్స్ అక్కడికి వెళ్లి ప్రమాదకరమైన దాన్ని తొలగించడం లేదా పూర్తిగా కత్తిరించి మాయం చేయడం చేస్తాయి. (ఇది ఒకరకంగా ఎడిటింగ్ లాంటి ప్రక్రియ). 2. ఈ ఏఎస్ఓలు.. ఆర్ఎన్ఏ లోని లోపభూయిష్టమైనప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా జన్యులోపాలను చక్కదిద్దుతాయి. ఇక్కడ ఏఎస్ఓలు రెండు రకాలుగా పని చేస్తాయి. మొదటిది లోపభూయిష్టం కావడం వల్ల అవాంఛితమైన జన్యుపదార్థాలను అసలు పుట్టకుండా చేయడం లేదా ఆలస్యం చేయడం. 3. మరో ఇతర ఆరోగ్యకరమైన జన్యువు లోంచి.. తనకు కావాల్సిన విధమైన కార్యకలాపాలు నిర్వహించే ఆరోగ్యకరమైన జన్యువునే ఉద్భవింపజేసి, దాన్ని ఇక్కడ వాడుకునేలా చేస్తాయి ఈ ఏఎస్ఓలు. ఇలా చేయడం ద్వారా స్పైనల్ మస్క్యులార్ ఎట్రోఫీ అనే వెన్నుకు సంబంధించిన కండరాల వ్యాధి, ఫ్రంటో టెంపోరల్ డిమెన్షియా అనే మతిమరపు వ్యాధులకు పరిశోధకులు ఇప్పటికే సమర్థమైన చికిత్సా విధానాలను, పూర్తిస్థాయి పరిష్కారాలను కనుగొన్నారు. ‘యాంటీ సెన్స్ ఆలిగోన్యూక్లియోటైడ్స్’లను రూపొందింది ప్రకృతి నేర్పిన పాఠాల నుంచే.. ప్రకృతి చాలా అద్భుతమైనదీ, సంక్లిషమైనది. మన దేహంలోని ఒక కణంలో పది పక్కన పదమూడు సున్నాలు పెట్టినన్ని జన్యువులు ఉంటాయి. అంతేకాదు.. రోజుకు మన దేహంలో పది పక్కన పన్నెండు సున్నాలు పెట్టినన్ని కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఇన్నిన్ని కణాల్లో ఇంతగా విభజన జరిగే సమయంలో ఎక్కడో ఒకచోట ఎంతో కొంత పొరబాటు జరగకమానదు. వీటిని సరిచేయడం కోసమే మన దేహంలో ‘మిస్ మ్యాచ్ రిపేర్ జీన్ మెకానిజమ్’ అనే ప్రక్రియ ద్వారా పొరబాట్లను చక్కదిద్దడం జరుగుతుంది. ఏఎస్ఓ జీన్ మాడిఫికేషన్లూ, ఎడిటింగ్లూ, సైలెన్సింగ్లను జీన్ మాడిఫికేషన్ ప్రక్రియ ద్వారా ప్రకృతి నేర్పిన పాఠాల నుంచే నేర్చుకున్న పరిశోధకులు... ఇప్పుడు వీటినే లోకకళ్యాణం కోసం ఉపయోగిస్తూ కొత్త చికిత్స ప్రక్రియలను కనుగొంటున్నారు. చివరగా.. ఇప్పుడు ఇదే ప్రక్రియనూ, ఇవే సిద్ధాంతాలను ఉపయోగించి.. కొన్ని జన్యువులను ఎడిటింగ్ చేయడం ద్వారా, అవ్యక్తంగా ఉండాల్సిన మరికొన్ని జన్యువులు వ్యక్తమవుతున్నప్పుడు వాటిని నిశ్శబ్దపరచడం (సైలెన్సింగ్) ద్వారా సీఎమ్‌ఎల్ మొదలుకొని చాలా రకాల క్యాన్సర్లకు చికిత్సలను కనుగొని పూర్తిగా నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కేవలం ఒకే జన్యువు లోపం వల్ల ఒకే వ్యాధి వచ్చే కేసుల్లోనే ఈ తరహా చికిత్స పనిచేస్తుందంటూ పరిశోధకులు దీని పరిమితులనూ చెబుతున్నారు. ఈ తరహా చికిత్సతో చాలా క్యాన్సర్లు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉండటం మనకు దగ్గర్లో కనిపిస్తున్న ఓ ఆశారేఖ. క్యాన్సర్ చికిత్స కోసం మరికొన్ని కొత్త పద్ధతులు.. జీన్ సైలెన్సింగ్, జీన్ ఎడిటింగ్ అన్నవి ప్రయోగాత్మకంగా విజయవంతమైన చికిత్స ప్రక్రియలు. ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే కొన్ని దేశాలలో కొంతవరకు అందుబాటులోకి వచ్చిన మరికొన్ని ఆధునిక, ఆసక్తికరమైన చికిత్స, నిర్ధారణ ప్రక్రియల గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో.. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తోంది. క్యాన్సర్ చికిత్సలోనూ పరిశోధకులు కృత్రిమ మేధ సహాయం తీసుకుంటున్నారు. క్యాన్సర్ సెల్ కూడా ఒక కణమే కాబట్టి దాని జన్యుపటలాలను మనిషి ఒక్కడే అర్థం చేసుకోవాలంటే చాలా టైమూ, శ్రమ వృథా అయ్యే అవకాశముంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ‘ఏఐ’ సహాయంతో క్యాన్సర్ జీనోమ్ స్ట్రక్చర్‌ను విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణల ఆధారంగా క్యాన్సర్ కణాన్ని ఎలా తుదముట్టించవచ్చో తెలుసుకుని, ఆ మేరకు కొత్త చికిత్సలను రూపొందిస్తున్నారు. ఎలక్ట్రానిక్ నోస్ (ఈ–నోస్)తో క్యాన్సర్ వాసన పసిగట్టే ప్రయత్నం.. క్యాన్సర్ వ్యాధి కణం చాలా చాలా చిన్నగా ఉంటుంది. దాని సైజుకు దాదాపు నాలుగు వందల రెట్లు పెరిగాకే.. ఆ కణజాలాన్ని కనుగొనడం సాధ్యమవుతుంది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో క్యాన్సర్‌ను ఎదుర్కోవడం కష్టమవుతుంది. అయితే ఒక చిన్న మూత్రపరీక్షతో చాలా చాలా తొలిదశలోనే క్యాన్సర్‌ను కనుగొనే సాంకేతికతను అభివృద్ధి చేశారు ఇజ్రాయెల్‌లోని బీర్షెబాలో ఉన్న ‘బెన్–గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగావ్’ కు చెందిన పరిశోధకులు. ఒక ఎలక్ట్రానిక్ ముక్కును వీరు రూపొందించారు. రొమ్ము క్యాన్సర్ ఉన్న మహిళల్లో వాళ్ల మూత్రపు వాసన ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ముక్కు క్యాన్సర్‌ను పసిగడుతుంది. దీన్ని ‘ఈ–నోస్’ అని పిలుస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే మామోగ్రఫీ లాంటి అడ్వాన్స్డ్ పరీక్షలతో కాకుండా... చాలా చవగ్గా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకునే అవకాశం రాబోతోంది. టీఆర్కే ఫ్యూజన్ప్రోటీన్.. క్యాన్సర్ కణం తాలూకు జన్యుపటలం ఆరోగ్యకరమైన కణంలా కాకుండా విభిన్నంగా ఉండటమే కాదు.. విపరీతంగా కూడా ప్రవర్తిస్తుంటుంది. టీఆర్కే ఫ్యూజన్ప్రోటీన్ అనే ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణ జన్యుపటలంలోనిప్రోటీన్ల చైన్’లలో మార్పులేవైనా చేయడం ద్వారా అది తనంతట తాను నశించిపోయే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు. ఇది జరిగితే క్యాన్సర్ చికిత్సలో అది ఓ విప్లవాత్మకమైన మార్పు అవుతుంది. హైపర్‌థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్.. కీమోథెరపీ ప్రయోగం మరింత విస్తృతంగా.. కీమోథెరపీ ఇచ్చినప్పుడు అది దేహంలోని ఒక భాగంలో ఉన్న క్యాన్సర్‌పైనే కాకుండా దేహంలోని మొత్తం కణాలపైనా పనిచేస్తుంటుంది. దీనికి భిన్నంగా ప్రయోగించేదే హైపర్ థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్ కీమోథెరపీ. ఇందులో పొట్ట తెరిచి కడుపు కుహరంలో మందును ఉంచుతారు. అక్కడది విపరీతమైన వేడిపుట్టిస్తూ, క్యాన్సర్ కణాలను మాడ్చేస్తుంది. ఆరోగ్యకరమైన కొన్ని కణాలూ భస్మమైనప్పటికీ అవి మళ్లీ పుడతాయి. కానీ క్యాన్సర్ కణాలు పూర్తిగా మటుమాయమైపోతాయిగానీ మళ్లీ పుట్టవు. ఈ థెరపీని కొన్ని కడుపు క్యాన్సర్లలో వాడుతున్నారు. డాక్టర్ సురేశ్ ఏవీఎస్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఇవి చదవండి: బర్త్ ఆర్డర్ కూడా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది! -
కేన్సర్ విస్తరిస్తోంది.. బహుపరాక్!!
జంట నగరాల్లో రోడ్ల మీద ఎలాంటి మాస్కులు లేకుండా, హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ఒక్క గంటసేపు తిరగండి.. తర్వాత కూడా మీరు ప్రశాంతంగానే ఉండగలుగుతున్నారా? హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారా? రెండూ కష్టమే. ఎందుకంటే మన గాలిలో ఒక క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాముల వరకు పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) ఉండొచ్చని ప్రమాణాలు చెబుతుంటే, ఇప్పుడు ఉన్నది మాత్రం 95 మైక్రో గ్రాములు! వీటివల్ల ఏమవుతుందో తెలుసా? మామూలు ఆస్తమా నుంచి ఊపిరితిత్తుల కేన్సర్ వరకు, గుండెపోటుతో సహా అనేక రకాల వ్యాధులు వస్తాయి!! ఇదంతా కేవలం పీఎం వల్ల మాత్రమే. అదే ఆటోలు, బస్సులు, ఇతర వాహనాల నుంచి వెలువడుతున్న పొగలో ఉండే కాలుష్యం వల్ల పలు రకాల కేన్సర్లు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు ఈ కాలుష్యం వల్ల బాగా దెబ్బతినే ప్రమాదం కనపడుతోంది. ఇటీవలి కాలంలో లంగ్ కేన్సర్ కేసులు ఎక్కువ కావడానికి ఇదే ప్రధాన కారణమని పల్మనాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 4) ప్రపంచ కేన్సర్ దినం. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు.. ఇలా పలు రకాల కారణాలతో కేన్సర్ విస్తృతంగా వ్యాపిస్తోంది. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ ఒక్కరినీ వదలట్లేదు. దీని బారిన పడిన కుటుంబాలు ఇటు ఆర్థికంగా, అటు మానసికంగా దారుణంగా చితికిపోతున్నాయి. చాలావరకు కేన్సర్లు మూడు, నాలుగో దశలలో తప్ప బయట పడకపోవడం, అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో చికిత్సకు కూడా ఒక పట్టాన లొంగదు. ఒకటిన్నర ఏళ్ల వయసున్న హర్షిత్ చాలా చురుగ్గా ఉండేవాడు. చకచకా అటూ ఇటూ ఇంట్లో పరుగులు తీస్తూ అమ్మానాన్నలను ఒక్కక్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉంచేవాడు. అలాంటిది ఉన్నట్టుండి నడవడం మానేశాడు. భయం భయంగా చూసేవాడు. దాంతో కలవరపడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే, ఎంఆర్ఐ తీయించారు. మెదడుకు సంబంధించిన హైడ్రోకెఫాలస్ అనే వ్యాధి వచ్చిందని, దాంతోపాటు మెదడులో ట్యూమర్లు కూడా ఉన్నాయని వైద్యులు తేల్చారు. ఆ రెండింటికీ శస్త్రచికిత్సలు చేశారు. కానీ, ఆ చిన్నారి కోలుకోలేదు. కోమాలోనే ఉండిపోయాడు!! 78 ఏళ్ల గోపాలకృష్ణ రిటైర్డ్ హెడ్మాస్టారు. ఒక్క దురలవాటు కూడా లేదు. నిత్యం పూజా పునస్కారాలతో నిష్ఠగా జీవితం గడిపేవారు. ఉన్నట్టుండి గొంతు మింగుడు పడటం తగ్గింది. ఏం తినాలన్నా, చివరకు మంచినీళ్లు తాగాలన్నా కూడా ఇబ్బందిగా ఉండేది. కొన్నాళ్లు చూసి, డాక్టర్ల దగ్గరకు వెళ్తే, అనుమానం వచ్చి ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేయించారు. చూస్తే.. అన్నవాహిక వద్ద కేన్సర్ వచ్చినట్లు తెలిపారు. విషయం తెలిసిన మూడు నెలలకే ఆయన కన్నుమూశారు. చక్కగా తిరుగుతూ ఉండేవాళ్లను కూడా కబళిస్తున్న ఈ కేన్సర్ విస్తృతి వెనుక బహుళజాతి సంస్థల కుట్ర కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆహార పంటలపై విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న పురుగు మందులు, రసాయనాలు కూడా నేరుగా శరీరంలోకి వెళ్లిపోయి కేన్సర్‌ను కలగజేస్తున్నాయని అంటున్నారు. వీటన్నింటికీ పరిష్కారం ఎప్పటికి దొరుకుతుందో చూడాలి మరి!!