breaking news
bank account information
-
క్లిక్ చేస్తే రూ.2.67 లక్షలు కొల్లగొట్టారు!
ఆకివీడు: వాట్సాప్‌లో వస్తున్న లింక్ మెసేజ్‌లు బ్యాంకు ఖాతాదారుల ఖాతాలను ఖాళీ చేస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని దుంపగడప గ్రామ శివారు పల్లెపాలెం వాసి కొల్లేటి హరిబాబుకు ఇలాంటి ఘటనే ఎదురైంది. దీంతో శనివారం ఆకివీడు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు..హరిబాబుకు స్థానిక స్టేట్‌బ్యాంకులో ఖాతా ఉంది. ‘ఎకౌంట్ బ్లాక్ అయింది. లింక్‌ను క్లిక్ చేయండి’ అంటూ డిసెంబర్ 15న మెసేజ్ రావడంతో ఆ లింక్‌ను క్లిక్ చేశాడు. అనంతరం అతని ఖాతాలో ఉన్న రూ.2,67,928 నగదు వేరే ఖాతాకు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో అతడు బ్యాంకు అధికారులను సంప్రదించాడు. అక్కడి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని కోరుతూ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెప్పాడు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ బీవై కిరణ్‌కుమార్ తెలిపారు. ఇటువంటి మెసేజ్‌లను ఓపెన్ చేయవద్దని, లింక్‌లను నమ్మవద్దని, వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు. -
ఆధార్ సీడింగ్‌కు స్పెషల్ డ్రైవ్
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని తక్షణం గ్యాస్ డీలర్లకు అంద జేయాలని జేసీ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. వాటి వివరాలు సేకణలో నిర్లక్ష్యం వహిస్తున్న రైల్వే, కోరమండల్, పోలీస్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం రాత్రి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జేసీ మాట్లాడుతూ గ్యాస్ ఏజెన్సీల పరిధిలో వచ్చే జనవరి 3,4,5 తేదీల్లో సీడింగ్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆధార్, బ్యాంకు ఖాతాల సమాచారం నమోదుకు ఈ అవకాశాన్ని గ్యాస్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీలర్లు తమ పరిధిలోని వినియోగదారుల నుంచి సమాచారం సేకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని, వారికి సహకరించాలన్నారు. ఆధార్ ఇప్పటి వరకు నమోదు చేసుకోని వారి కోసం విశాఖ నగర పరిధిలో 21 ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయా కేంద్రాలకు వెళ్లి ఆధార్ నమోదు చేయించుకుంటేనే వారం రోజుల్లో నంబర్లు కేటాయిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 34 మంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఇంటింటికి వెళ్లి ఈసమాచారం సేకరించే కార్యక్రమం చేపడతారన్నారు. జనవరి మొదటివారం లోగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఈ ప్రక్రియ నూరుశాతం పూర్తి కావాలన్నారు. ఆధార్,బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కాకుంటే ఏప్రిల్ ఒకటి తర్వాత వారికి గ్యాస్ సరఫరా నిలిపివేసే అవకాశం ఉంటుందన్నారు. బ్యాంకులు తమ వద్దకు గ్యాస్ డీలర్లు తీసుకు వచ్చే దరఖాస్తులను స్వీకరించి సమాచారం నమోదు చేయాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖాధికారులు రవితేజ నాయక్, శాంతకుమారి పాల్గొన్నారు.