కుల్‌భూషణ్ కేసుకు పాక్ అటార్నీ జనరల్!
ఇస్లామాబాద్: అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్ కేసును సరిగా రిప్రజెంట్ చేయలేదని విమర్శలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో పాకిస్తాన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ది హేగ్‌లోని న్యాయస్థానంలో గురువారం జరిగిన విచారణలో పాకిస్తాన్ తరఫున ఖావర్ ఖురేషీ వాదనలు వినిపించగా.. తదుపరి విచారణలో అతడి స్థానంలో ఆ దేశ అటార్ని జనరల్ అస్తార్ ఆసఫ్ అలీ వాదనలు వినిపించనున్నారు.
ఈ మేరకు అంతర్జాతీయ న్యాయస్థానంలో జాదవ్ కేసును తాను రిప్రజెంట్ చేయనున్నట్లు ఆసఫ్ అలీ తెలిపారని జియో టీవీ శనివారం వెల్లడించింది. తుదితీర్పు వెలువడేంతవరకు జాదవ్‌కు విధించిన ఉరిశిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు తమ దేశానికి పెద్ద ఎదురుదెబ్బ అని పాక్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. దీంతో పాక్ తరఫున అటార్నీ జనరల్ రంగంలోకి దిగుతున్నారు.