breaking news
Arts College Building
-
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం
ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం మంగళవారం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1917 ఏప్రిల్ 26న ఉస్మానియా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఫర్మాన్ (రాజాజ్ఞ) జారీ చేశారు. అడిక్‌మెట్ జాగీర్‌లో నిజాం 2వ నవాబు నుంచి మహ లకాభాయి చందా బహుమతిగా పొందిన భూమిని తిరిగి 7వ నవాబుకు కానుకగా ఇవ్వడంతో అదే స్థలంలో ఓయూ ఏర్పాటుకు పునాదులు పడ్డాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తొలిసారిగా ఓయూలో మంగళవారం ఫౌండేషన్ డే నిర్వహిస్తున్నారు. 105 వసంతాలు పూర్తి చేసుకున్న ఓయూలో కోటిమందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేశారు. ఎందరో విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. తొలి రోజుల్లో ధనవంతుల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించగా నేడు ఓయూ నూరుశాతం మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తుంది. ఏటా నిర్వహిస్తాం.. దేశంలోనే 7వ యూనివర్సిటీగా ప్రసిద్ధిగాంచిన ఓయూ తొలిసారి ఫౌండేషన్ డేను నిర్వహించడం గర్వంగా ఉంది. ఇకపై ఏటా ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించాం. తొలిసారి జరుగుతున్న 105వ ఫౌండేషన్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారు. వందేమాతర ఉద్యమం మొదలు నిన్నటి తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో ఉద్యమాలు ఇక్కడే మొదలయ్యాయి. మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వందలాది మంది నాయకులను తయరు చేసిన ఘనత ఓయూకు దక్కుతుంది. – వీసీ ప్రొ.రవీందర్ ఆర్ట్స్ కాలేజీ భవనం నిర్మాణం చరిత్రాత్మకం ఓయూ ఐకాన్‌గా నిలిచిన ఆర్ట్స్ కాలేజీ భవన నిర్మాణం చరిత్రాత్మకం. ఓయూ స్థాపనకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో నిజాం నవాబ్ 1934లో ప్రారంభించిన ఆర్ట్స్ కాలేజీ భవన నిర్మాణానికి అంతే ప్రాముఖ్యత ఉంది. డిగ్రీ కోర్సులతో ప్రారంభమైన ఓయూలో ప్రస్తుతం సుమారు 2.5 లక్షల విద్యార్థులు పీజీ, పీహెచ్డీ వరకు దూరవిద్య, రెగ్యులర్ కోర్సులు చదువుతున్నారు. 87 దేశాలకు చెందిన విదేశీ విద్యార్థులు ఓయూలో విద్యాభ్యాసం చేస్తున్నారు. – ప్రొ.అంజయ్య– చరిత్ర విభాగం 70 శాతం మహిళలు చదవడం ఓయూ ప్రత్యేకత ఓయూలో తొలిరోజుల్లో ధనవంతుల పిల్లలు చదువుకునేవారు. నేడు నూటి కి నూరుశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అందులో 70శాతం మహిళలు ఉండటం విశేషం. 105 ఏళ్ల చరిత్ర గల ఓయూకు పూర్వ వైభవం తెచ్చేందుకు వీసీ చేస్తున్న కృషి అభినందనీయం. – ప్రొ.సూర్య ధనుంజయ్– తెలుగుశాఖ. ఆనందంగా ఉంది అనేక మంది విద్యావంతులు, మేధావులు, సైంటిస్టులు, రాజకీయ నాయకులను, ఇతరులను అందించిన ఓయూలో చదవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓయూ నేడు 105 ఫౌడేషన్ డే జరుపుకోవడం ఆనందంగా ఉంది. –సంజయ్–పీహెచ్డీ విద్యార్థి. ఓయూ ఫౌండేషన్ డే పై నేడు లెక్చర్ ఓయూ 105వ ఫౌండేషన్ డే సందర్భంగా లోక్‌పాల్ సెక్రెటరీ భరత్‌లాల్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ మంగళవారం లెక్చర్ ఇవ్వనున్నట్లు వీసీ ప్రొ.రవీందర్ తెలిపారు. సోమవారం ఫౌండేషన్ డేను విజయవంతం చేయాలని కోరుతూ వాక్ అండ్ రన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఓయూ ఇంజినీరింగ్ ఎదుట వీసీ విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 10.30 నిమిషాలకు జరిగే ఫౌండేషన్ డే కార్యక్రమానికి విద్యార్థులు, సిబ్బంది అధిక సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: సీఎం రాక నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు) -
వందేళ్ల విద్యా కుసుమం
► శత వసంతాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ► 1917 ఏప్రిల్ 26న వర్సిటీని ఏర్పాటు చేస్తూ ఏడో నిజాం ఫర్మానా ► 1919లో మస్రత్ మహల్లో తరగతులు ప్రారంభం 20 ఏళ్ల పాటు అక్కడే కొనసాగిన యూనివర్సిటీ ► 1934లో ఆర్ట్స్ కాలేజీకి శంకుస్థాపన.. 1939లో పూర్తి అప్పటి నుంచి ఆర్ట్స్ కాలేజీ భవనంలో కొనసాగింపు l ► ఎందరో మేధావులు, ప్రముఖులకు విద్యనందించిన వర్సిటీ ప్రపంచానికి వెలకట్టలేని సేవలను అందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో మైలురాయికి చేరుకుంటోంది. ఎందరో మేధావులు, ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రముఖులు చదువుకున్న ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ వందో ఏట అడుగుపెడుతోంది. అటు విద్యా సౌరభాలు వెదజల్లినా.. ఇటు పోరాటాల పురిటిగడ్డగా నిలిచినా.. ఉస్మానియా ప్రత్యేకతలు ఎన్నో. హైదరాబాద్ సంస్థానంలో నాలుగో నిజాం కాలంలో మొదలైన విద్యా సంస్కరణలను.. ఏడో నిజాం కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటు శిఖరస్థాయికి చేర్చింది. వర్సిటీ వందేళ్ల పండుగ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. (మహ్మద్ మంజూర్, చింతకింది గణేశ్) అసఫ్‌జాహీ నాలుగో పాలకుడు మీర్ ఫర్కుందా అలీ నాజరుద్దౌలా (1829–1857) వరకు హైదరాబాద్ సంస్థానంలో మదర్సా విద్యా విధానం కొనసాగింది. ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో అక్షరాస్యత కేవలం 8 శాతమే. కొద్దిగా చదవడం రాయడం వచ్చే వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీ అయ్యే వారు. జమీందారీ వ్యవస్థ అమల్లో ఉండేది. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. నిజాం ఆభరణాలు బ్రిటిష్ వారి వద్ద తనఖా పెట్టి కాలం వెళ్లదీస్తున్నారు. ఆ రోజుల్లో సంస్థాన ప్రధానమంత్రిగా మహారాజా చందూలాల్ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా సమయానికి అందేవి కావు. ఉద్యోగులు తరచూ ప్రధానమంత్రి వద్దకు వచ్చి వేతనాలు ఇవ్వాలని అడిగేవారు. ప్రధాని వారికి ‘కల్ ఆవో (రేపు రండి)’చెప్పేవారు. దాంతో ఆ రోజుల్లో ఆయనను చందూలాల్ కల్ అని హాస్యం చేసేవారు. సంస్థానంలో కొత్త వెలుగులు సంస్థానం పరిస్థితిని మెరుగుపర్చేందుకు కొత్త ప్రధానమంత్రిని ఎంపిక చేయాలని కొందరు రాజ ప్రముఖులు ప్రతిపాదించారు. దాంతో విదేశాల్లో చదివిన, బ్రిటిష్ పాలన పట్ల మంచి అవగాహన ఉన్న తురాబ్ అలీఖాన్ సాలార్జంగ్ను ప్రధానిగా నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. పాలకులకు నజరానాలను నిలిపేశారు. పట్వారీ, పోలీస్, వైద్య ఆరోగ్య, విద్య, రెవెన్యూ, ల్యాండ్ సర్వే తదితర ప్రభుత్వ శాఖలను పునర్ వ్యవస్థీకరించారు. ఈ క్రమంలోనే మదర్సా వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేశారు. దీంతో హైదరాబాద్ సంస్థానంలో తొలిసారి ప్రభుత్వ విద్యా విధానం ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలలకు సిలబస్‌తో పాటు భవనాల నిర్మాణమూ చేపట్టారు. ఈ సమయంలో నాలుగో నిజాం మరణించడంతో... ఐదో నిజాం పదవి చేపట్టారు. 12 ఏళ్లు పాలించిన ఐదో నిజాం హయాంలో ప్రధానమంత్రిగా ఉన్న సాలార్జంగ్–1 విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి ఉర్దూ, పర్షియన్ భాషల్లో సైన్స్, సోషల్, మ్యాథ్స్ ను బోధించడాన్ని ప్రవేశపెట్టారు. ఇక ఐదో నిజాం మరణించినప్పుడు ఆరో నిజాం కేవలం రెండున్నరేళ్ల పిల్లాడు. ఈ ఆరో నిజాంకు సంరక్షకుడిగా ఉంటూ ప్రధానమంత్రి సాలార్ జంగ్–1 పరిపాలన కొనసాగించారు. ఈ సమయంలోనే సంస్థానం వ్యాప్తంగా జిల్లాల్లో, తాలుకాల్లో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను స్థాపించారు. అందులో మహబూబియా బాలికల పాఠశాల, ఆలియా బాలుర పాఠశాల, చాదర్‌ఘాట్ స్కూల్, జాగిర్గార్ కాలేజ్ (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్), నిజాం కాలేజీలను ఏర్పాటు చేశారు. ఆరో నిజాం 18వ ఏట సంస్థానం బాధ్యతలు చేపట్టారు. ఆరో నిజాం హయాంలో సంస్థానంలో పెద్ద సంఖ్యలో విద్యాలయాలు ఏర్పాటవడంతో అక్షరాస్యత పెరిగింది. అయితే ఇక్కడి విద్యాలయాల్లో చదువులు పూర్తయిన వారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. ఉస్మానియా ఏర్పాటుకు బీజం తండ్రి మరణానంతరం ఏడో నిజాం తన 25 ఏళ్ల వయసులో సంస్థానం బాధ్యతలు చేపట్టారు. ఆయన విద్యకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. స్కూళ్లను ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విద్యగా వారీగా విభజించారు. హైదరాబాద్‌లోనే ఉన్నత విద్య అందించడం కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటి అన్ని వర్గాల విద్యావేత్తలతో సమావేశమై చర్చించారు. హైదరాబాద్ సమీపంలోని ప్రదేశాలను పరిశీలించి.. రెండో నిజాం కాలంలో రాజనర్తకిగా కొనసాగిన మహాలఖాబాయి భూమి విశ్వవిద్యాలయానికి అనుకూలంగా ఉంటుందని గుర్తించారు. ఆమె వారసుల నుంచి భూమిని సేకరించి.. వర్సిటీ పనులు ప్రారంభించారు. విశ్వవిద్యాలయం భవన నిర్మాణ కమిటీ అప్పట్లో సంస్థానంలోని ప్రముఖ ఇంజనీర్లు దైన్యార్ జంగ్, అలీరజాలతో విశ్వవిద్యాలయ భవన నిర్మాణ కమిటీని ఏర్పాటు చేశారు. వారిని వారు ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, జపాన్, టర్కీ తదితర దేశాలకు పంపి.. అక్కడి విశ్వవిద్యాలయాల భవనాలపై అధ్యయనం చేయించారు. వారు ఫ్రాన్స్ ఆర్కిటెక్ట్ జాస్పర్‌ను వర్సిటీ భవనం పనుల కోసం ఎంపిక చేశారు. జాస్పర్ ఏడో నిజాం ఆదేశాల మేరకు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలను సందర్శించి.. హిందూ, ముస్లిం సాంస్కృతులు కలగలిపి ఉస్మానియా వర్సిటీ కోసం డిజైన్ రూపొందించారు. వందేళ్ల ఉస్మానియా 1917 ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏడో నిజాం ఫర్మానా జారీ చేశారు. విశ్వవిద్యాలయానికి సరిపడా భవనాలు నిర్మించే వరకు తాత్కాలికంగా కింగ్‌కోఠి ప్యాలెస్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. కానీ గన్‌ఫౌండ్రీలోని మస్రత్ మహల్(ప్రస్తుత ఎస్బీహెచ్ భవనం)తో పాటు దానికి అనుకుని ఉన్న ఏడు భవనాలను అద్దెకు తీసుకుని 1919 డిసెంబర్ 28న ఆర్ట్స్ కాలేజీని ప్రారంభించారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ భవనం నిర్మాణమయ్యే వరకు అంటే దాదాపు 20 ఏళ్ల పాటు యూనివర్సిటీ అక్కడే కొనసాగింది. మేధావులకు పుట్టినిల్లు.. దేశానికి తొలి తెలుగు ప్రధాని పీవీ నర్సింహారావు రాజ నీతిజ్ఞతను అలవరచుకున్నది ఉస్మానియాలోనే. తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక తెలంగాణవాదంతో అనుసంధానమైందీ ఈ ఆవరణలోనే. విద్యార్థి, విప్లవ, సామాజికోద్యమాల పురిటిగడ్డగా, ఉన్నత చదువుల విద్యా కేంద్రంగా దేశానికి ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను అందించింది. ప్రముఖ గణిత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతికి నామినేట్ అయిన మహమ్మద్ రజీ–ఉద్దిన్ సిద్దిఖీ, ఆర్థికవేత్త, మాజీ జర్మనీ రాయబారి సయ్యద్ అలీ మహమ్మద్ ఖుస్రో, కెనడాలో భారత పాత్రికేయుడు హరూన్ సిద్ధిఖీ, ప్రముఖ సినిమా దర్శకుడు శ్యాం బెనెగల్ వంటి వారెందరో ఉస్మానియాలో చదువుకున్నవారే. మౌలాలిలోని చందామహల్ మహాలఖాబాయి హైదరాబాద్‌లోని మౌలాలి గుట్ట దిగువన ఓ స్థలంలో వేదికను ఏర్పాటు చేసి.. ముషాయిరాలు నిర్వహించేది. 1792లో ఆమె తల్లి మరణించడంతో అక్కడే సమాధి చేసింది. దాని పక్కనే మహాలఖాబాయిని సమాధి చేశారు. అదే చందా మహల్. 2010లో పరిశోధకుడు కుగ్లే చొరవతో అమెరికా ఆర్థిక సహకారంతో చందా మహల్‌ని పునరుద్ధరించారు. ప్రస్తుతం దానిని పట్టించుకునేవారే లేకపోవడం గమనార్హం. ఎవరీ మహాలఖాబాయి? నూరు వసంతాల ఉస్మానియా చరిత్రకూ మహాలఖాబాయికి విడదీయలేని బంధం ఉంది. ఆమె అసలు పేరు చందాబీబీ. ఆమె తల్లి మిదాబీబీ, అమ్మమ్మది గుజరాత్‌లోని అహ్మదాబాద్. వారి కుటుంబం పలు సమస్యల కారణంగా ఓ భక్తిబృందంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. తల్లీకుమార్తెలు ఆ బృందంలోనే నాట్యం, గానం నేర్చుకుని.. నిజాం రాజ్యంలో నర్తకిలుగా చేరారు. మిదాబీబీకి 1768లో చందాబీబీ జన్మించింది. కవయిత్రిగా, నృత్యకారిణిగా, రాజనీతిజ్ఞురాలిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొందింది. రెండో నిజాం దగ్గర కవి, చరిత్రకారుడుగా ఉన్న షాతాజ్అలీతో కలసి పనిచేసింది. ఆమె సామాజిక సేవకురాలు కూడా. ప్రస్తుతం నాంపల్లిలోని బాలికల పాఠశాల భవనం ఆమె నివాసమే. దానిపేరు హస్సా రంగ్ మహల్. ఇక్కడే వందలాది మంది బాలికలు, యువతులకు ఆమె విద్యాబుద్ధులు నేర్పించింది. నృత్యంలోనూ శిక్షణనిచ్చింది. రెండో నిజాం ఇచ్చిన బిరుదు.. రెండో నిజాం మీర్ అలీఖాన్ చందాబీబీకి మహాలఖాబాయిగా బిరుదునిచ్చారు. ఆయన వద్ద ప్రధానిగా పనిచేసిన మీర్ ఆలంకు చందాబీబీ కవిత్వం అంటే అభిమానం. దాంతో నాంపల్లి నుంచి మౌలాలి వరకు ఉన్న వేల ఎకరాల భూములను ఇచ్చి, ఆమెను జాగీర్దారుని చేశారు. మౌలాలి, ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఉన్న ప్రాంతం, అడిక్‌మెట్, హైదర్గూడల్లోని భూములన్నీ ఆ జాగీర్లోనివే. మహాలఖాబాయి వివాహం చేసుకోలేదు. హుస్సేన్ అఫ్జా భానూ, హసీన్ లఖా భానూ, మహమ్మద్ మఖ్బుల్లను దత్తత తీసుకుంది. ఆమె మరణానంతరం ఈ భూములన్నీ వారికి సంక్రమించాయి. కొన్నాళ్ల తర్వాత మహాలఖాబాయి జాగీరును నిజాం ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఆ స్థలంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అయితే స్కాట్లాండ్ రాజనీతిజ్ఞుడు, చరిత్రకారుడు అయిన జాన్ మాల్కం రెండో నిజాం సంస్థానంలో కొద్దిరోజుల పాటు బస చేశారు. ఆయనకు వీడ్కోలు సభలో మహాలఖాబాయి నృత్య ప్రదర్శన ఇచ్చిన అనంతరం తన గజల్స్ రాత ప్రతిని ఆయనకు బహూకరించింది. కాలక్రమేణా అది లండన్ మ్యూజియానికి చేరింది. దానిని పరిశీలించిన కుగ్లే అనే చరిత్రకారుడు మహాలఖాబాయి చరిత్రను తవ్వితీశాడు. ఉర్దూ తొలి స్త్రీ కవయిత్రి ఈమేనని చెబుతారు. భారీగా భవనం.. అడిక్‌మెట్ ప్రాంతంలో 1934 జూలై 5న ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ భవనానికి ఏడో నిజాం శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణం పూర్తయ్యేందుకు దాదాపు ఐదేళ్లు పట్టింది. అన్ని హంగులతో పూర్తయిన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ భవనాన్ని ఏడో నిజాం 1939 డిసెంబర్ 4న ప్రారంభించారు. అప్పటినుంచి అందులోనే వర్సిటీ కొనసాగుతోంది. అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న అక్బర్ హైదర్ చాన్సలర్‌గా, నవాబ్ మెహదీయార్ జంగ్ బహదూర్ వైస్ చాన్సలర్‌గా నియమితులయ్యారు. 1,600 ఎకరాల సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలితో కూడిన భవంతులతో ఉస్మానియా ఏర్పాటైంది. ఇక దేశంలోనే తొలిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాతృభాషలో విద్యను బోధించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోని పుస్తకాలను ఉర్దూ భాషలోకి అనువదించడానికి ప్రస్తుతం నాంపల్లిలో ఉన్న రాయల్ హోటల్ భవనంలో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముందుచూపుతోనే ఉన్నత విద్య.. ‘‘హైదరాబాద్ సంస్థానంలో కుతుబ్‌షాహీలు, నాలుగో ఆసఫ్జాహీ పాలన వరకు మదర్సాలు ఉండేవి. వాటిలో ధార్మిక విద్యతో పాటు కొద్దిపాటి ప్రాపంచిక విద్య బోధించే వారు. నాలుగో నిజాం హయాంలో ప్రధానమంత్రిగా నియమితుడైన తురాబ్ అలీఖాన్ సాలార్జంగ్.. సంస్థానంలో ఆధునిక విద్యకు బీజం వేశారు. ఆనాటి పాలకుల దూరదృష్టి వల్లనే ఉస్మానియా వర్సిటీ ఏర్పాటైంది. ఇక్కడే ఉన్నత విద్య అవకాశం కలిగింది.. – అల్ అమా ఏజాస్ ఫరూకీ, చరిత్రకారుడు