breaking news
Agent fraud
-
మలేసియాలో బందీ
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ఉపాధి కోసం ఉన్న ఊరును వదిలివెళ్లారు. ఏజెంట్ మాయమాటలను నమ్మి మోసపోయారు. ఇది మలేసియాలో బందీలైన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి యువకుల దుస్థితి. తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. సారంపల్లి గ్రామానికి చెందిన అశోక్, జిల్లెల్లకు చెందిన శ్రీకాంత్, కిరణ్ ఉపాధి కోసం మూడు నెలల క్రితం మలేసియా దేశం వెళ్లారు. ఇందుకోసం ఓ ఏజెంట్‌కు రూ.లక్షలు చెల్లించి వీసా తీసుకున్నారు. మలేసియాలో అడుగుపెట్టాక వారికి అసలు విషయం తెలిసింది. తమకు ఏజెంట్ ఇచ్చింది కంపెనీ వీసా కాదని, విజిట్ వీసా అని తెలియడంతో నిర్ఘాంతపోయారు. సదరు ఏజెంట్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా, తానేమీ చేయలేనని చేతులెత్తేశాడు. దీంతో కూలీ పని చేసేచోట ఆసాములు ఓ గదిలో బంధించారు. మూడు రోజులపాటు భోజనం పెట్టడం లేదు. అయితే, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న ముగ్గురు యువకులు అక్కడి భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. వారి చేతిలో చిల్లిగవ్వలేదు. బాత్రూంలోని నీరు తాగుతూ బతుకీడుస్తున్నారు. దీనిని అక్కడే ఉండే ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది ప్రస్తుతం జిల్లాలో వైరల్ అయింది. స్పందించిన కేటీఆర్ మలేసియాలో చిక్కుకున్న యువకుల వివరాలను తెలుసుకున్న స్థానిక నాయకుడు మాట్ల మధు.. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ స్పందించి మలేసియాలోని భారత రాయ బార కార్యాలయ అధికారులతో ఫోన్లో మాట్లా డారు. బాధిత యువకులను స్వదేశానికి రప్పించేం దుకు ఏర్పాట్లు చేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. -
ఇంటికి రాలేక... గల్ఫ్‌లో ఉండలేక
హైదరాబాద్‌లో మకాం... ► దొరికిన పనులు చేసుకుంటున్న వైనం ► విజిట్ వీసాలతో ఏజెంట్ మోసం ► పోలీసులకు బాధితుల ఫిర్యాదు కోరుట్ల: ‘నాతోపాటు 40 మందిని ఏప్రిల్‌లో ఏజెంట్ దుబాయ్ పంపిండు.. అక్కడ నెల రోజులు ఉంచుకుని పనులు లేవని తిప్పి పంపిండ్రు.. ఇంటికి వెళ్లడానికి మొహం చెల్లక హైదరాబాద్‌లోనే ఉండి దొరికిన పనులు చేసుకుంటున్నం. ఏజెంట్ మమ్మల్ని నమ్మించి మోసం చేసిండు’ కోరుట్ల మండలం మోహన్‌రావుపేటకు చెందిన అందె సతీశ్(25) ఆవేదన ఇదీ. సతీశ్‌తోపాటు మరో ముగ్గురు యువకులు ఆదివారం గల్ఫ్ ఉద్యోగాల ఎరతో తాము మోసపోయిన వైనంపై కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంభీర్పూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ ఏజెంట్ కాల్వ శేఖర్ దుబాయ్‌లోని మైక్రో సీజన్స్ సప్లయ్స్ క్యాటరింగ్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో జగిత్యాల జిల్లా కథలాపూర్, మేడిపల్లి, మల్యాల, మెట్పల్లి, గొల్లపల్లి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, కామారెడ్డి జిల్లా ఖమ్మం, విజయవాడ ప్రాంతాల నుంచి 40 మంది ఒక్కొక్కరు రూ.50 వేలు అతనికి చెల్లించారు. వారిని వారం రోజుల వ్యవధిలో ఏప్రిల్‌లో దుబాయ్ పంపాడు. తమను నెల రోజుల విజిట్ వీసాలతో అక్కడి పంపాడని బా«ధితులు సతీశ్, తిరుపతి, రమేశ్, ఏలేటి కుమార్ చెప్పారు. దుబాయ్ తమకు రెండు రూంలు కేటాయించారని, ఒక్కో రూంలో 15–20 మంది వరకు సర్దుకుని నానా తిప్పలు పడ్డామన్నారు. అక్కడ కంపెనీలో సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కొక్కరి వద్ద 1,500 దర్హామ్‌లు(రూ.25 వేలు) తీసుకున్నారన్నారు. నెల గడువు ముగియడంతో తాము అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొందనీ, ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుని తిరిగి ఇండియాకు వచ్చామన్నారు. దుబాయ్ వెళ్లిన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన అక్రం, విజయవాడకు చెందిన రఫీ ఇంటికి తిరిగివెళ్లలేక హైదరాబాద్‌లోనే ఉండి పనిచేసుకుంటున్నట్లు తెలిసింది. మరో ముగ్గురు యువకులు హైదరాబాద్‌లోనే పనులు చేసుకుంటున్నట్లు సమాచారం. తాము దుబాయ్ వెళ్లి మోసపోయామన్న విషయం తెలిస్తే.. ఇంటి వద్ద కుటుంబసభ్యులు ఆందోళన గురవుతారన్న ఆవేదనతో దొరికిన పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిసింది. ఉపాధి పేరిట తమను మోసగించిన ఏజెంట్‌పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బా«ధితులు సతీష్, రమేష్, తిరుపతి, కుమార్ కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజుతో ఆదివారం మొరపెట్టుకున్నారు.