
మంద నుంచి 50 గొర్రెల అపహరణ
పుట్టపర్తి అర్బన్: మంద నుంచి 50 గొర్రెలను అపహరించుకెళ్లిన ఘటన పుట్టపర్తి మండలం పెడపల్లి పెద్ద తండాలో చోటు చేసుకుంది. వివరాలు.. పెడపల్లి పెద్ద తండాకు చెందిన జగదీష్‌నాయక్, జయాబాయి దంపతులు చాలా కాలంగా సుమారు 78 గొర్రెల మందను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. రోజూ గొర్రెల మంద వద్దనే పడుకునే జగదీష్‌నాయక్ ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జల్లులు పడుతుండడంతో పక్కనే ఉన్న ఓ ఇంటి ఆవరణలో మంచం వేసుకొని నిద్రించాడు. సోమవారం వేకువజామున దుండగులు అక్కడకు చేరుకుని మందను సమీపంలోని జాతీయ రహదారిలోకి మళ్లించారు. మంద సమీపంలోనే కట్టేసిన ఐదు పాడి ఆవుల మెడ తాళ్లను తప్పించారు. జాతీయ రహదారిపైకి మందను తోలుకెళ్లి 50 గొర్రెలు, పొట్టేళ్లను వాహనంలోకి ఎక్కించుకుని ఉడాయించారు. సుమారు 25 గొర్రెలు, మేకలు, పాడి ఆవులను వదిలేశారు. తెల్లవారుజాము 3 గంటల సమయంలో కుక్కలు అరుస్తుండడంతో మేల్కొన్న జగదీష్‌నాయక్... గొర్రెలు లేని విషయం గమనించి కుటుంబసభ్యులు, బంధువులతో కలసి గాలింపు చేపట్టాడు. సోమవారం జీవాల సంతలు ఉన్న పావగడ, గోరంట్ల, పేరేసంద్రం, బెంగళూరు మార్కెట్లకు తరలించి ఉంటారనే అనుమానతంతో తలా ఓ దిక్కున వెళ్లారు. సోమవారం చీకటి పడుతున్నా గొర్రెల జాడ తెలియరాలేదని బాధిత కాపరి వాపోయాడు. అపహరించుకెళ్లిన జీవాల విలువ రూ.5 లక్షలకు పైగా ఉంటుందని కన్నీంటి పర్యంతమయ్యాడు.