
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం : ఫ్యాప్టో
కదిరి టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఫ్యాప్టో చైర్మన్ గజ్జల హరిప్రసాద్ హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో కదిరిలో ఉపాధ్యాయులు ఆదివారం ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్‌ఆండ్‌బీ బంగ్లా నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకూ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను మంజూరు చేయాలన్నారు. పీఆర్సీని ఏర్పాటు చేయడంతో పాటు 30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రూ.25 వేల కోట్ల దీర్ఘకాలిక బకాయిలు చెల్లించాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. మున్సిపల్ పాఠశాలలకు అర్బన్ ఎంఈఓ పోస్టు మంజూరు చేయాలని, ఎంటీఎస్ ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచి, వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరారు. 20 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 7న విజయవాడలో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ రామానుజులయాదవ్, లక్ష్మీప్రసాద్, జాఫర్‌హుస్సేన్, యూటీఎఫ్ శ్రీనివాసులు, తాహర్ వలి, లక్ష్మీకాంతరెడ్డి, ఏపీటీఎఫ్ ఆదిబయన్న, రాజశేఖర్, రమణారెడ్డి, ఏపీటీఎఫ్ 1938 బి.బాబాఫకృద్ధీన్, దివాకర్, రూటా, హతావుల్లా, ఈదుల్లా, డీటీఎఫ్ షర్పుద్దీన్, మౌలాలి, వైఎస్సార్‌టీఏ రఘునాథరెడ్డి, గంగాధర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.