
టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ
పెనుకొండ: మండలంలోని వెంకటగిరిపాళ్యంలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు. వివరాలు... వెంకటగిరిపాళ్యంలో టీడీపీ నేత బోయ తుపాకుల శివయ్య, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గొల్ల కేశవయ్య కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. 2022లో బోయ శివయ్యను పాలసముద్రం వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రమాదం రూపంలో కేశవయ్య హత్య చేయించాడంటూ బోయ తుపాకుల శివయ్య వర్గం కక్ష పెంచుకుంది. అప్పటి నుంచి తరచూ రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా చిన్న విషయానికి ఇరువర్గాలు గొడవ పడుతూ ఉన్నాయి. ఆదివారం మక్కాజిపల్లి తండా వద్ద తారస పడిన కేశవయ్య తమ్ముడు గోపాలప్ప, ఆయన వర్గీయులు మల్లికార్జున, నాగేంద్రపై తుపాకుల శివయ్య వర్గానికి చెందిన బోయ ఓబులేసు, మంజునాథ్, గజేంద్ర, చండ్రాయుడు, లితీసు, మల్లికార్జున దాడి చేసి గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన కేశవయ్య సోదరుడు శివయ్య తదితరులను తొలుత పెనుకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. అనంతరం కేశవయ్యకు చెందిన వర్గీయులు కియా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని 44వ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళను విరమించారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. దాడిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ వర్గీయుల మధ్య నెలకొన్న వివాదంపై ఆ పార్టీ ముఖ్య నాయకులు ఆరా తీసినట్లు సమాచారం.
పలువురికి గాయాలు..
అనంతపురానికి తరలింపు
కియా స్టేషన్ వద్ద ఆందోళన..