
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
నల్లచెరువు: మండల పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. జీఆర్పీ ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపిన మేరకు... అల్లుగుండు గ్రామ సమీపంలోని పట్టాలపై అదే గ్రామానికి చెందిన కుళ్లాయప్ప(40) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం భార్యతో విడిపోయిన ఆయనకు 10వ తరగతి చదువుతున్న కుమారుడు, 8వ తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. శనివారం ఇంటి నుంచి వెళ్లిన కుళ్లాయప్ప ఆదివారం ఉదయం పట్టాలపై రైలు వస్తున్న సమయంలో ఎదురుగా నిలబడ్డాడు. లోకో పైలెట్ గమనించి హారన్ కొట్టినా పక్కకు వెళ్లలేదు. దీంతో రైలు ఢీకొని ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. లోకో పైలెట్ ద్వారా విషయం తెలుసుకున్న జీఆర్పీ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే మండల కేంద్రానికి చెందిన జైతూన్‌బీ(67)కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని రోజులు కుమారుడి వద్ద, మరికొన్ని రోజులు కుమార్తె వద్ద ఉంటుండేది. ఇటీవల మానసిక స్థితి సరిగా లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది దివారం దేవరింటిపల్లి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యం షాపు మార్చాలంటూ నిరసన
రొద్దం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి అతి సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని మరో ప్రాంతానికి మార్చాలంటూ ఆదివారం వైన్‌షాప్ ఎదుట బహుజన చైతన్య వేదిక నాయకులు శివరామకృష్ణ, బాబుప్రసార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శివరామకృష్ణ మాట్లాడుతూ.. గత 15 రోజుల క్రితం మద్యం దుకాణం మార్చాలని పెనుకొండ ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి అతి సమీపంలో మద్యం షాపు నిర్వహించటం రాజ్యాంగ నిర్మాతను అవమాన పరచడమేనని అన్నారు. ఆందోళన కారులతో మద్యం దుకాణం యజమాన్ని చర్చించి దుకాణం మార్పునకు అంగీకరించడంతో ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రదాన కార్యదర్శి రవికమార్, కంచిసముద్రం గోవిందు, పాస్టర్ ఏలిపా, తిప్పన్న, రాజేశ్, మద్దిలేటి, తిమ్మయ్య, రాజశేఖర్, మణికంఠ, బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు.
మహిళకు పాముకాటు
రాయదుర్గంటౌన్: ఓ వ్యవసాయ మహిళా కూలీ పాముకాటుకు గురై ఆస్పత్రి పాలైంది. బ్రహ్మసముద్రం మండలం గుడిపల్లికి చెందిన సుశీలమ్మ కూలీ పని నిమిత్తం ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని మొక్కజొన్న తోటకు వెళ్లింది. పనిచేస్తుండగా సుశీలమ్మ కాలుకు పాముకాటు వేసింది. గమనించి తోటి కార్మికులు ఆమె హుటాహుటిన రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు విష పురుగులతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.