మార్కెట్‌ యార్డు పనుల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ యార్డు పనుల అడ్డగింత

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

● ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు ఏర్పాటు చేయొద్దు ● వంటిమామిడి భూబాధితుల ఆందోళన

● ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు ఏర్పాటు చేయొద్దు ● వంటిమామిడి భూబాధితుల ఆందోళన

ములుగు(గజ్వేల్‌): భూములు కోల్పోయిన తమకు ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు మార్కెట్‌ను ఏర్పాటు చేయొద్దంటూ ములుగు మండలం వంటిమామిడి బాధిత రైతులు ఆందోళనకు దిగారు. శనివారం మార్కెట్‌యార్డు కోసం స్థలాన్ని అధికారులు చదును చేస్తుండగా పనులను రైతులు అడ్డుకున్నారు. వంటిమామిడి మార్కెట్‌యార్డును మరింతగా విస్తరించేందుకు సర్వే నంబర్‌ 72లో ప్రభుత్వం 49 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రైతులకు ఎకరా ఒక్కంటికి నష్టపరిహారం కూడా అందజేశారు. అయితే ఆ స్థలాన్ని మార్కెట్‌ కమిటీ స్వాధీనం చేసుకోలేదు. ప్రతిరోజు ఉదయం మార్కెట్‌ ముందు రాజీవ్‌రహదారిపై వ్యాపారులు మార్కెట్‌ను కొనసాగిస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా జిల్లా ఉన్నతాధికారులు మార్కెట్‌ను సందర్శించి పరిశీలన జరిపారు. మార్కెట్‌కు కేటాయించిన స్థలంలో కొంతనైనా భూమిని చదును చేసి ఉదయం వేళలో సాగుతున్న మార్కెట్‌ను ఆ స్థలంలో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో గజ్వేల్‌ ఏసీపీ నర్సింలు, గజ్వేల్‌ రూరల్‌ సీఐ రవిరాజు, తహసీల్దార్‌ రవిందర్‌రెడ్డి, ఎస్‌ఐ రఘుపతి, మార్కెట్‌ కార్యదర్శి రేవంత్‌, ఆయా మండలాల ఎస్‌ఐలు శనివారం మార్కెట్‌ వద్దకు చేరుకున్నారు. స్థలాన్ని జెసీబీ యంత్రాలతో చదును చేయిస్తుండగా బాధిత రైతులు అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తంచేస్తూ పనులను అడ్డుకున్నారు. తమకు ఇళ్ల స్థలాలను కేటాయించేంత వరకు పనులు జరగనివ్వబోమని అధికారులతో వాగ్వాదానికి దిగారు. రాజీవ్‌రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో మండల బీజెపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్‌ ఒంటిపై డీజిల్‌ పోసుకుని భయందోళన సృష్టించాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెలుతామని అధికారులు బాధిత రైతులకు నచ్చజెప్పడంతో సద్దుమనిగారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement