చేర్యాల(సిద్దిపేట): చేర్యాల మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎంపికపై వాడీ వేడి చర్చ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వరుసగా ఐదు, ఏడు స్థానాలు గెలుచుకోగా మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పీఠాలను బీఆర్‌ఎస్ కై వసం చేసుకున్న విషయం తెలిసిందే. కో–ఆప్షన్ ఎన్నికకు కసరత్తు జరుగుతున్న క్రమంలో పట్టణంలో అభ్యర్థుల పోటీ, ప్రధాన పార్టీల వ్యూహాలు, నేతల లాబీయింగ్ మరింత ఊపందుకున్నాయి. మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు నాలుగు కో–ఆప్షన్ స్థానాలు దక్కనున్నాయి. అర్హులుగా చెప్పుకునే అనుభవం కలిగిన మాజీ ప్రజాప్రతినిధులు, రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు, రెండు మైనార్టీ వర్గాల అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే పల్లా ఆశీస్సులున్న వారికే అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగింటిలో ఒకటి సీపీఎంకు ఇవ్వనున్నట్లు సమాచారం.
అర్హతలిలా..
అభ్యర్థి వయస్సు 21 ఏళ్లకుపైబడి ఉండి మున్సిపాలిటీలో ఓటరుగా నమోదై ఉండాలి. కనీసం ఐదేళ్లు చైర్‌పర్సన్, మేయర్, వార్డు సభ్యుడు, కౌన్సిలర్‌గా పనిచేసి ఉండాలి. మూడేళ్లు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేసిన న్యాయవాది, ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో గెజిటెడ్ ఉద్యోగిగా రిటైర్డ్ అయి.. మున్సిపల్ పరిపాలనలో అనుభవం ఉన్నవారు అర్హులు. వీరి నుంచి ఇద్దరిని ఎంపిక చేస్తారు. ఇందులో ఒక మహిళ తప్పనిసరిగా ఉండేలా ఎంపిక చేయాల్సి ఉంటుంది. మరో ఇద్దరు మైనారిటీ కో–ఆప్షన్‌్ సభ్యుల ఎంపికకు ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు అర్హులు.


