వ్యర్థాలతో ఇం‘ధనం’! | - | Sakshi
Sakshi News home page

వ్యర్థాలతో ఇం‘ధనం’!

Apr 11 2026 9:46 AM | Updated on Apr 11 2026 9:46 AM

నర్మేటలో రూ.250 కోట్లతో బయోగ్యాస్‌ ప్లాంట్‌

సాక్షి, సిద్దిపేట: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా వంట గ్యాస్‌ కోసం వినియోగదారుల బాధలు వర్ణనాతీతం. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతోనే ఈ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలా దిగుమతులను తగ్గించడానికి భారత ప్రభుత్వం బయోగ్యాస్‌ ప్లాంట్లను నిర్మించాలని నిర్ణయించింది. వ్యవసాయ, పౌల్ట్రీ వ్యర్థాలు, పశువుల పేడ నుంచి ఇంధనం తయారు చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో టీజీఐఐసీ సేకరించిన 20 ఎకరాల స్థలాన్ని బయోగ్యాస్‌ ప్లాంట్‌ కోసం కేటాయించారు.. అభివృద్ధి చెందుతున్న బయో ఎనర్జీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన జూనో జౌల్‌ బయో ప్యూయల్స్‌ కంపెనీ వారు ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 12న నర్మెటలో మంత్రి శ్రీధర్‌ బాబు శంకుస్థాపన చేయనున్నారు.

వ్యవసాయ వ్యర్థాలతో గ్యాస్‌

రాష్ట్రంలో అత్యధికంగా వరి పంటను సాగు చేస్తున్నారు. వరి కోతలు ముగిసిన తర్వాత గడ్డి, వివిధ పంటల మొదళ్లను తగులబెడుతుంటారు. దీంతో భూమి సారం కోల్పోవడంతో పాటు గ్రీన్‌హౌస్‌ వాయువు విడుదలవుతోంది. అదే వ్యవసాయ వ్యర్థాలు, వడ్లపొట్టు, పశువుల పేడ, పౌల్ట్రీ వ్యర్థాలతో స్వచ్ఛమైన ఇంధనంగా తయారు చేయనున్నారు. సేంద్రియ వ్యర్థాలను స్వచ్ఛమైన ఇంధనంగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధికి తోడ్పాటు అందించనుంది.

రాష్ట్రంలోనే తొలి ప్లాంట్‌

సిద్దిపేటలో రూ 250కోట్ల వ్యయంతో 10 సీబీజీ (కంప్రెషడ్‌ బయో గ్యాస్‌) ప్లాంట్లతో రాష్ట్రంలో ఇదే తొలి ప్రాజెక్టు. ఒక్కో ప్లాంట్‌ రోజుకు 10 టన్నుల టీపీడీ (టెన్స్‌ పర్‌ డే) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారా మొత్తం వంద టీపీడీ ఉత్పత్తి సామర్థ్యం లభిస్తుంది. ఇది రాష్ట్రంలో బయో–ఎనర్జీ ఉత్పత్తికి కీలక కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి, రెండో దశల్లో మూడు ప్లాంట్లు చొప్పున, మూడో దశలో నాలుగు ప్లాంట్లను ప్రారంభిస్తారు. ఈ మొత్తం క్లస్టర్‌ 2029–2030 నాటికి పూర్తి కానుంది. ఇది భారతదేశం తక్కువ కార్బన్‌ ఉద్గారాల ఇంధన వ్యవస్థల వైపు సాగించే ప్రయాణానికి తోడ్పడుతుంది. అలాగే దాదాపు 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

12న మంత్రి శ్రీధర్‌బాబు శంకుస్థాపన

పౌల్ట్రీ వ్యర్థాలు, పశువుల పేడతో

ప్లాంట్‌ నిర్మాణం

10 ప్లాంట్లు.. ఒక్కో ప్లాంట్‌

10 టన్నుల టీపీడీ సామర్థ్యం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement