ఉద్యానసాగు.. సబ్సిడీ బాగు | - | Sakshi
Sakshi News home page

ఉద్యానసాగు.. సబ్సిడీ బాగు

Apr 11 2026 9:46 AM | Updated on Apr 11 2026 9:46 AM

జహీరాబాద్‌: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలను అందించనుంది. గతేడాది కంటే ఈసారి రెట్టింపు నిధులు ఇచ్చే విధంగా ఉద్యాన శాఖ అధికారులు ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నారు. జిల్లాలో అరటి, బొప్పాయి పండ్ల తోటలతోపాటు అన్ని రకాల కూరగాయల పంటలకు ప్రోత్సాహకాలను అందజేసి సాగు విస్తీర్ణం పెంచేందుకు రూ.5.60 కోట్లతో ఉద్యాన శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కూరగాయల పంటల సాగుపై ఎకరానికి రూ.10వేల వరకు సబ్సిడీ ఇవ్వనుంది. జిల్లాలో సుమారు 4వేల ఎకరాల్లో కూరగాయల సాగును చేయించాలనే లక్ష్యంతో ఉంది. గతేడాది కంటే వేయి ఎకరాల సాగును పెంచే ప్రయత్నం చేస్తోంది. పీఏసీఎస్‌ల సహకారంతో 37 మంది విద్యావంతులైన రైతులను వలంటీర్లను ఎంపిక చేసి శిక్షణ ఇప్పించింది. ఒక వలంటీర్‌తో 100 ఎకరాల కూరగాయలను సాగు చేయించాలని ప్రతిపాదించారు. ఈ ఏడాది 500 ఎకరాల్లో పండ్ల తోటలను పెంచాలని ఉద్యాన శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకుగాను సబ్సిడీని సైతం అందించనున్నారు. రైతులవైపు నుంచి అరటి, బొప్పాయి, మామిడి పంటల సాగుకు సానుకూలత వస్తోంది. డ్రాగన్‌ ఫ్రూట్‌, అవకాడో, జామ తోటలకు సైతం సబ్సిడీ అందించనున్నారు.

సాగుచేసిన పంటలపై సబ్సిడీ ఇలా...

రైతులు సాగు చేసిన ఉద్యానపంటల సాగుపై సబ్సిడీ అందించనున్నారు. అరటి సాగుపై ఎకరానికి రూ.18వేల చొప్పున బొప్పాయికి రూ.7వేలు, అల్లంకు రూ.9వేలు, పసుపునకు రూ.8వేలు, ఉల్లిగడ్డపంటపై రూ.6వేల వంతున రైతులకు సబ్సిడీని అందించనున్నారు. రైతులు పంటను సాగు చేసుకుని, బిల్లులు అందజేసిన తర్వాత అధికారులు పంటల సాగును పరిశీలించిన అనంతరమే సబ్సిడీని మంజూరు చేస్తారు.

రూ.5.60కోట్ల సబ్సిడీతో ప్రణాళికలు

పెరగనున్న కూరగాయల సాగు విస్తీర్ణం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement