ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాకటౌన్: ఉప కాలువల నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని, ప్రభుత్వం తక్షణమే వీటి నిర్మాణంపై దృష్టిపెట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. దౌల్తాబాద్ మండలంలోని గువ్వలేగి గ్రామంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందంతో కలిసి రైతులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...నీరు వస్తేనే నేల బతుకుతుందని, నేల బతికితేనే రైతు బతుకుతాడని, రైతు బతికితేనే దేశం బలపడుతుందన్నారు. కాలువల నిర్మాణం, భూసేకరణ, పరిహారం వంటి అంశాలపై సమావేశంలో రైతులతో చర్చ జరిపి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గతంలో రూ.3 లక్షల పరిహారం మాత్రమే ఇవ్వడంతో కొంతమంది రైతులు సమ్మతించగా, మరికొంతమంది ఒప్పుకోకపోవడంతో కోర్టులో డిపాజిట్ చేసినట్లు గుర్తు చేశారు. పరిహారం పెంపు అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు రూ.10లక్షలు పరిహారం అందేలా చూస్తానని హామీనిచ్చారు. దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ వివిధ సమస్యలను పరిశీలించారు. అనంతరం దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండలస్థాయి అధికారులు, గ్రామ సర్పంచులతో నిర్వహించిన సమీక్షలో గ్రామాభివృద్ధి లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధికారులు, సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


