రోజుల కొద్దీ రైతుల పడిగాపులు
మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో
ఏడు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
నేటికీ 1,800 మెట్రిక్ టన్నులే సేకరణ
కొనుగోళ్లు వేగిరం చేయాలంటున్న రైతులు
పొద్దుతిరుగుడు ఉత్పత్తులను పూర్తిగా కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన టార్గెట్ మేర పంటను కొనుగోలు చేస్తూ టోకెన్లు జారీ చేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
– సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా 9,876 ఎకరాల్లో సన్‌ఫ్లవర్ పంటను సాగు చేయగా 9,619 మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. పంటకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.7,721గా ప్రభుత్వం నిర్ణయించి మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గజ్వేల్, సిద్దిపేట, తొగుట, చిన్నకోడూరు, బెజ్జంకి, హుస్నాబాద్, మిరుదొడ్డిలలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. జిల్లాలో 2,200 మెట్రిక్ టన్నుల సేకరణకు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది.
టోకెన్లు జారీ
కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 1,800 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు గింజలను కొనుగోలు చేశారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్‌కు సరిపడా 400 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు రైతులకు టోకెన్లను జారీ చేశారు. ఇంకా చాలా మంది రైతులు వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒక్క తొగుట కొనుగోలు కేంద్రానికే దాదాపు 200 మెట్రిక్ టన్నులు పొద్దుతిరుగుడు గింజలను తీసుకవచ్చారు. ఇతర మార్కెట్‌లలో సైతం షెడ్ల కింద, బయట పోసి టార్పాలిన్ కవర్లు కప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే..
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే పొద్దుతిరుగుడు కొనుగోళ్లు చేసే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కొనుగోలు చేసినవి తరలించేందుకు లారీలను అందుబాటులో ఉంచకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల గోనె సంచులు లేకపోవడంతో కొనుగోళ్లు జరగడం లేదు. జిల్లాలో మరో 7వేల మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు కొనుగోలు చేయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయలు లేకపోవడంతో చాలామంది రైతులు ఇంటి వద్దనే దిగుబడులను ఉంచారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పొద్దుతిరుడుగు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
వారం రోజులుగా ఎదురుచూపులే
తొగుట మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రానికి పొద్దుతిరుగుడు ఉత్పత్తులను 94 సంచుల్లో తీసుకవచ్చా. జల్లి లభించలేదు. అప్పటికే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ముగిసిందని అధికారులు చెబుతున్నారు. అధికారులు స్పందించి పొద్దుతిరుగుడు పంటను వెంటనే కొనుగోలు చేయాలి. –తిరుపతి రెడ్డి, ఆనాజీపేట
కేంద్రం కోటా పూర్తి కావొచ్చింది
జిల్లాలో ఏడు చోట్ల పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కేంద్రం ఇచ్చిన కోటా పూర్తి కావొచ్చింది. మార్కెట్లలో ఎక్కువగా పొద్దుతిరుగుడు పంట ఉందని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకవెళ్లాం. వారు ఆదేశిలిస్తే పూర్తిగా కొనుగోలు చేస్తాం. –సునీత, జిల్లా మేనేజర్, మార్క్‌ఫెడ్
తొగుట మార్కెట్ యార్డులో పేరుకుపోయిన పొద్దుతిరుగుడు ఉత్పత్తులు
మార్కెట్‌యార్డుల్లో
పొద్దుతిరుగుడు రాశులు


