పాత పట్టణం.. సమస్యలు అధికం | - | Sakshi
Sakshi News home page

పాత పట్టణం.. సమస్యలు అధికం

Apr 10 2026 10:45 AM | Updated on Apr 10 2026 10:45 AM

● ఏళ్లతరబడి పనులు పెండింగ్‌లోనే.. ● గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ దుస్థితి నిరాశ్రయులపైనా నిర్లక్ష్యం..

రోడ్లు, డ్రైనేజీలు అధ్వానం

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలోని ‘పాతపట్టణం’ అవస్థలమయంగా మారింది. ఏళ్లతరబడి రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులు పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. అభివృద్ధికి నమూనాగా ఊదరగొట్టిన ఈ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

– గజ్వేల్‌

జ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలోని ఇందిరాపార్కు చౌరస్తా నుంచి కోటమైసమ్మ గుడి వైపు వెళ్లే రోడ్డును 1.3 కిలోమీటర్ల మేర 70ఫీట్లుగా విస్తరించాలని నిర్ణయించారు. ఈ పనులకు రూ.12 కోట్లు వెచ్చిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పనులు సా గు..తూనే ఉన్నాయి. ప్రత్యేకించి ఎంపీడీఓ కార్యాల యం నుంచి కోటమైసమ్మ గుడి వరకు పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేదు. బీటీ కొంత వేసి, కొంత పెండింగ్‌లో ఉంచారు. రోడ్డుకు ఇరు పక్కలా డ్రైనేజీ పనులు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి. రోడ్డు పనులు ప్రారంభమైనప్పటి నుంచీ ఇదే నిర్ల క్ష్యం కొనసాగుతూనే ఉంది. పాత పట్టణానికి ప్రధా న ఆధారమైన ఈ రోడ్డుపై కావాలనే వివక్ష చూపుతున్నారని ఇక్కడి కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.

రోడ్డు విస్తరణ సందర్భంలో ఎంతోమంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వీరిలో కొందరికీ మాత్రమే డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను కేటాయించారు. ఇంకా చాలా మందికి ఇండ్లు అందాల్సి ఉంది. రోడ్డు విస్తరణ చేపట్టిన యంత్రాంగం వారిని ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోల్పోయిన ఇళ్లకు ఖరీదు కట్టి ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ అదికూడా జరగలేదు. ఈ అంశంపై బాధితులు నిరసనలకు దిగినా ఫలితం లేకుండా పోయింది. బాధితుల ఇబ్బందులను పట్టించుకోకుండా పోలీసుల పహారాలో పనులు చేపట్టారు. ఇంత చేసినా కనీసం రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులైనా సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలు ఇక్కట్ల పాలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

రోడ్డుపైనే మురుగు

రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉండటం వల్ల మురుగునీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తోంది. ఒకవైపు దుర్గంధం.. మరోవైపు దోమల వ్యాప్తి పెరిగి జనం రోగాలబారిన పడుతున్నారు. రోడ్డు విస్తరణ పూర్తికాపోవడంతో సుమారుగా అర కిలోమీటర్‌ మేర రోడ్డు నరకప్రాయంగా మారింది. వాహదారులు ఈ మార్గం గుండా వెళ్లాలంటనే జంకుతున్నారు.

పెండింగ్‌ పనులపై ప్రత్యేక దృష్టి

మున్సిపాలిటీ పరిధిలోని పెండింగ్‌ పనులన్నీంటిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. సమీక్ష నిర్వహించి పనులు పూర్తిచేయడానికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తాం.

– గంగిశెట్టి చందన,

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement