
సాక్షి, అమరావతి: చంద్రబాబు నోట.. మళ్లీ అదే మాట. సొంత ఎమ్మెల్యేలు తప్పుడు పనులకు, అరాచకాలకు పాల్పడుతున్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి స్వయంగా అంగీకరించారు. ఇవాళ కేబినెట్ భేటీలో మంత్రుల అలసత్వంతో పాటు ఎమ్మెల్యేల అరాచకాలపైనా చర్చ జరిగింది.
కూటమి అధికారంలోకి వచ్చాక.. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు వివాదాస్పదంగా ఉంటూ వస్తోంది. అవినీతి, అక్రమాలు, ఆరాచకాలు, వివాదాస్పద వ్యాఖ్యలు.. చేష్టలతో ఎవరో ఒకరు నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పదే పదే ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు. తాజాగా..
కేబినెట్ భేటీలో మునుపెన్నడూ లేని రీతిలో అరుదైన చర్చ జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేల దందాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. టీడీపీ ఎమ్మెల్యేల అసభ్య ప్రవర్తన, బూతులతోపాటు ఉద్యోగులపై దాడులు చేసిన ఘటనలపైనా హీటెక్కింది. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ సీరియస్ అయ్యారు. గాడితప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్‌ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ఈ మధ్యకాలంలో జరిగినవి..
శ్రీశైలం ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్.. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బందిపై దాడి చేశారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యపై వేధింపులకు దిగగా.. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను దూషించిన ఆడియో క్లిప్ ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ టీడీపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీళ్లే కాదు..
గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వ్యవహారంలో వేధింపులు భరించలేక టీడీపీకే చెందిన ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయమూ తెలిసిందే. కొలికపూడి శ్రీనివాస్, బండారు శ్రావణి, ఇలా మరికొందరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేల వ్యవహారం కూడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా నడుస్తోంది. ఈ క్రమంలో..
‘‘ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు. అధికార ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే.. ఎవరు బాధ్యత వహిస్తారు?. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. తప్పు చేసింది ఎవరైనా ఇక మీదట చట్టపరమైన చర్యలు తప్పవు’’ అని పేర్కొన్నట్లు సమాచారం. అదే సమయంలో..
అదేసమయంలో.. మంత్రుల పెరఫార్మెన్సుపైనా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. వాళ్లపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఫైల్స్ క్లీయరెన్సులో ఘోరంగా వెనకబడ్డారని అధికారులు తేల్చారు. దీంతో ఒక్కో ఫైల్ కు సరాసరిని ఒక్కో మంత్రి ఎంత టైమ్ తీసుకుంటున్నారో వివరించిన చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ పరిస్థితి మారాలి.. నిర్ణిత సమయంలో ఫైల్స్ క్లియర్ కావాలి అని హెచ్చరించినట్లు తెలుస్తోంది.