
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ ఇటీవల తన సలహా కోరిన మహిళా లాయర్‌కు వింతైన సమాధానం ఇచ్చారు. కోర్టులో జడ్జీలకు కన్ను కొట్టాలని చెప్పారు. అనుకూలమైన ఉత్తర్వులు రావాలంటే అలాంటి పని చేయక తప్పదని అన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పంచుకున్నారు.
తాను సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన సమయంలో ఎంతోమంది మహిళా న్యాయవాదులు తనకు కన్ను కొట్టారని గుర్తుచేసుకున్నారు. న్యాయమూర్తి నుంచి వారికి అనుకూలమైన తీర్పులు, ఉత్తర్వులు రావడానికే ఆరాటపడ్డారని వెల్లడించారు. ఈ విషయం తెలియజేస్తూ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అయితే, సోషల్ మీడియా తన పోస్టుపై విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు. కోర్టులో ప్రభావవంతంగా వాదనలు ఎలా చేయాలన్న దానిపై మహిళా లాయర్ కోరిన సలహాను ఆ తర్వాత పోస్టు చేశారు. జడ్జిలకు కన్ను కొట్టూ అంటూ ఆయన ఇచ్చిన సమాధానం ఇందులో కనిపిస్తోంది. జస్టిస్ మార్కండేయ కట్జూ 2006 నుంచి 2011 దాకా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. అంతకుమందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ చైర్‌పర్సన్‌గా సేవలందించారు.