
ఏర్పాట్లు ముమ్మరం
నారాయణపేట: రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఈ నెల 23, 27 తేదీల్లో.. సర్పంచ్, వార్డు స్థానాలకు మూడు విడతలుగా ఈ నెల 31, నవంబర్ 4, 8 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జెడ్పీ సీఈఓ మొగులప్ప, డీపీఓ సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
‘ప్రాదేశిక’ ఎన్నికలు ఇలా..
జిల్లాలో 13 జెడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీ సీఈఓ మొగులప్ప పర్యవేక్షణలో ఎన్నికల ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని సిద్ధం చేశారు. మొదటి విడతలో కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జెడ్పీటీసీలు, 27 ఎంపీటీసీ స్థానాలకు, నారాయణపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో జెడ్పీటీసీలు, 55 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో మక్తల్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జెడ్పీటీసీలు, 54 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్ట్రాంగ్‌రూంల్లోనే కౌంటింగ్..
జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గ కేంద్రాల్లో స్ట్రాంగ్‌రూంలను ఏర్పాటుచేశారు. అక్క డే నవంబర్ 11న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు నియోజకవర్గాలకు చెందిన బ్యాలెట్ బాక్సులన్నీ జిల్లా కేంద్రం సమీపంలోని గురుదత్త బీఈడీ కళాశాలలో భద్రపరిచారు. కానీ ఈ సారి ఏ నియోజకవర్గం బ్యాలెట్ బాక్సులను అక్కడే భద్రపరిచి.. కౌంటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో కొడంగల్ సెగ్మెంట్ లోని కోస్గి, మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్ మండలాల్లో జరిగే జెడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను కోస్గి సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాల లో భద్రపరిచేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. నారాయణపేట సెగ్మెంట్‌కు సంబంధించిన బ్యాలె ట్ బాక్సులను యాద్గీర్ రోడ్డులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో భద్రపర్చనున్నారు. మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి బ్యాటెట్ బాక్సులను మక్తల్‌లోని ఇండోర్ స్టేడియంలో భద్ర పరిచేందుకు అధికారులు ఏర్పాటుచేశారు.
‘స్థానిక’ ఎన్నికల నిర్వహణలో జిల్లా యంత్రాంగం నిమగ్నం
రెండు విడతల్లో 13 జెడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
మూడు విడతల్లో 272 సర్పంచు, 2,466 వార్డు స్థానాలకు..
నియోజకవర్గ కేంద్రాల్లో స్ట్రాంగ్‌రూంల ఏర్పాటు