
‘కాంగ్రెస్ నేతలకు ఎన్నికల గుబులు’
కోస్గి రూరల్: కాంగ్రెస్ నేతలకు ఎన్నికల గుబులు పట్టుకుందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా లేరని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో కోస్గి, గుండుమాల్ మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి బీసీ రిజర్వేషన్లు, బిల్లు, ఆర్డినెన్స్ ఇలా అన్నీ తెచ్చినా.. కోర్టు అపుతుందంటూ జిమ్మిక్కులు చేస్తున్నాడని అన్నారు. సీఎం అంటూ గెలిపించారని రెండు సంవత్సరాలు గడుస్తున్నా నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం ఇంత వరకు మట్టి కూడా తీయలేదన్నారు. సోదరుడి కమీషన్ల కోసమే డబుల్ రోడ్లు, బ్రిడ్జిలు వేస్తున్నారని ఆరోపించారు. ఓటు వేసి గెలిపించిన కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకై నా ఇంతవరకు వంద శాతం రుణమాఫీ కాలేదని, రైతు బంధు ఓట్లప్పుడే గుర్తుకు వస్తుందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలోనే 46 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని, రూ.100 కోట్లతో కోస్గి మున్సిపాలిటీని అభివృద్ధి చేశామని, భారత్‌మాళాలో భాగంగా భూత్పూర్–చించోలి వరకు డబుల్‌రోడ్లు వేయించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి వెళ్లి చూయించాలని అన్నారు. రెండు మండలాల్లోని ముఖ్య నాయకులందరు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 8 లోగా ఆభ్యర్థుల జాబితా ఇవ్వాలని కోరారు. రెండు మండలాలకు అధ్యక్షులు లేనందున ఎన్నికల సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో శ్యాసం రామకృష్ణ, వెంకట్‌నర్సింలు, జనార్దన్, సాయిలు , కోనేరు సాయిలు, పోశప్ప, ఉసేనప్ప,ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.